logo

AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!

ఎన్నికల కోడ్‌ కూసింది.. నెల రోజుల్లో ప్రక్రియ ముగిసిపోతుందని.. గతసారి మాదిరిగానే మొదటి విడతలో ఎన్నికలు జరుగుతాయని అంతా లెక్కలేశారు.

Updated : 19 Mar 2024 09:27 IST

ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో వైద్య సిబ్బందికి కానుకలు అందజేస్తున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌

 న్యూస్‌టుడే, టెక్కలి : ఎన్నికల కోడ్‌ కూసింది.. నెల రోజుల్లో ప్రక్రియ ముగిసిపోతుందని.. గతసారి మాదిరిగానే మొదటి విడతలో ఎన్నికలు జరుగుతాయని అంతా లెక్కలేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల సంఘం మే 13 పోలింగ్‌ తేదీగా ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పార్టీల్లో వేడి చల్లారింది. దాదాపుగా రెండు నెలల పాటు సమయం ఉండటంతో అన్ని రకాలుగా ఆలోచనలో పడ్డారు. ఇంకా పోలింగ్‌కు 50 రోజులకుపైగా వేచి ఉండాల్సిన నేపథ్యంలో అప్పటి వరకు ఎలా నెట్టుకురావాలనే ఆందోళన మొదలైంది. అధికార వైకాపాలోనూ అంతర్మథనం ప్రారంభమైంది.  

జిల్లాలో ఇప్పటికే ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ప్రకటన కొలిక్కివచ్చింది. వైకాపాలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానానికి సైతం బరిలో నిలిచేవారి పేర్లు ప్రకటించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమిలోనూ నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. వారంతా ఎన్నికల వరకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికల వ్యయం భరించలేనంతగా మారడం అభ్యర్థులకు భారంగా మారింది. పార్టీల అధిష్ఠానం కొంత మేర సమకూరుస్తున్నప్పటికీ స్థానిక నేతలకు సర్దుబాటు, శ్రేణులు, ఇతర అంశాలకు పోటీదారులు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చు పదింతలు పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అధికార పార్టీకి తడిసిమోపెడు

నెలరోజుల్లోనే ఎన్నికలు ఉండే అవకాశముందని అంచనా వేసిన అధికార వైకాపా ప్రక్రియను ముందే ప్రారంభించింది. కోడ్‌ రాకముందే అభ్యర్థులకు అధిష్ఠానం నుంచి ఫండింగ్‌ కూడా వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని పై నుంచి సూచనలు రావడంతో నియోజకవర్గాల్లో ఆ మేరకు పంచేశారు. పురపాలక సంఘాల్లో కౌన్సిలర్లు, మేజర్‌ పంచాయతీల్లో వార్డు సభ్యులకు సైతం నజరానాలు అందించారు. ఇవి కాక వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. కొన్ని చోట్ల మహిళలకు చీరలు, కానుకలు అందించారు. కార్యకర్తలకు విందు భోజనాలు పెట్టించారు. నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి వరకు  రూ.2-6 కోట్ల వరకు ఖర్చు చేశారు. నియోజకవర్గ కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్థానిక నాయకులు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు వాలంటీర్లకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తున్నారు. ఖర్చును అలవాటు చేసేశారు. మరోవైపు అధిష్ఠానం తాము చెప్పేవరకు పంపిన మొత్తాన్ని కదిలించవద్దని ఆదేశించడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఖర్చు ఆపుదామంటే కుదరని పరిస్థితి నెలకొంది. ఎంతమంది ఎటు జారిపోతారోనని ఆందోళన అభ్యర్థుల్లో ప్రారంభమైంది.

కూటమికి సమయం దొరికినట్లే..!

భిన్న ఆలోచనలు కలిగిన రాజకీయ పార్టీల శ్రేణులు ఒకే పంథాలో నడవడం అంత తేలిక కాదు. ఎన్నికల గడువు ఎక్కువగా ఉండటంతో తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య సమన్వయానికి తగినంత సమయం దొరికిందని ఆయా పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా తెదేపా, జనసేన నేతలు కలసి పని చేస్తున్నప్పటికీ.. తాజాగా వారికి భాజపా జత కట్టడంతో మూడు పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన కసరత్తు ఎలా చేయాలనే దానిపై సమీక్షించుకునేందుకు వీలు కుదిరింది. ఇంతలో అధికార పార్టీ దూకుడు కొంత తగ్గుతుందని, మరోవైపు వాలంటీర్లను నియంత్రించేందుకు సమయం దొరుకుతుందని ప్రణాళిక చేస్తున్నారు. ఇంటింటికీ మరోసారి వెళ్లేందుకు, మేనిఫెస్టో వివరించడంతో పాటు అధికార పార్టీ వైఫల్యాలను వివరించేందుకు ఈ సమయాన్ని వినియోగించుకోవాలని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.

అందరిలోనూ అదే ఆలోచన..

ఎన్నికలంటే పోటీ చేసే అభ్యర్థులతో పాటు విధులు నిర్వహించే ఉద్యోగులకూ అగ్ని పరీక్షే. ఎన్నికల విధులు, ఏర్పాట్లు, కోడ్‌ అమలు, నిర్వహణ పర్యవేక్షించే రెవెన్యూ, పోలీసు సిబ్బంది సైతం రెండు నెలల సమయాన్ని ఎలా నెట్టుకురావాలో అని సతమతమవుతున్నారు. శాంతి భద్రతలతో పాటు రాజకీయ వర్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సెక్టార్‌, రూట్‌ అధికారులు, సిబ్బందిని నియమించారు. కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు వాటిని కొనసాగించడం.. పోలింగ్‌, కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయడమంటే సుదీర్ఘ ప్రయాణమే అవుతుందని తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల్లో కీలక భూమిక పోషించే ఉపాధ్యాయులు ఇదే సమయంలో పరీక్షలు, మూల్యాంకనం విధులు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి నిర్వహించడం ఎలా అని వారిలోనూ ఒత్తిడి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని