logo

కొండలు కరిగిపోతున్నాయ్‌..!

కంకర కొండలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో యంత్రాలు ఉపయోగించి కొల్లగొడుతున్నారు.

Published : 27 Mar 2024 03:35 IST

అధికార పార్టీ నేతల అండతో యథేచ్ఛగా కంకర తవ్వకాలు
న్యూస్‌టుడే హరిపురం (మందస)

కంకర కొండలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో యంత్రాలు ఉపయోగించి కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లలో ప్రైవేటు నిర్మాణాల కోసం తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మందస, మకరజోల, సిద్ధిగాం, హరిపురం, సిరిపురం, పొత్తంగి, అంబుగాం పరిధిలో అనుమతికి మించి లేఅవుట్లు వెలిశాయి. వాటికి అవసరమైన కంకరను ఆయా ప్రాంతాలకు దగ్గరలోని ప్రభుత్వ, రైతుల డీ పట్టా భూముల్లో తవ్వుతున్నారు. నల్లబొడ్డులూరు వద్ద తొమ్మిది ఎకరాల కొండను మూడొంతులు కొల్లగొట్టేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు దీనిపై కన్నేసి రూ.లక్షల్లో వ్యాపారం చేశారు. భైౖరిసారంగపురం వద్ద రుద్రభూమి కొంత భాగంలో కంకర తవ్వకాలు చేపట్టారు.  పది అడుగుల లోతు తవ్వడంతో ఆ ప్రదేశం చెరువులా మారింది. రట్టి, గుడ్డిభద్ర, అల్లిమెరక ప్రాంతాల్లో డీపట్టా భూములు, మరికొన్ని చోట్ల చెరువు గట్టులను కొల్లగొడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తరలిపోతోంది.  

ప్రభుత్వ ఆదాయానికి గండి.. ప్రభుత్వ నిర్మాణాలకు కంకర వినియోగించినప్పుడు క్యూబిక్‌ మీటరుకు రూ.50 సీనరేజీ కింద ఖజానాకు జమ అవుతుంది. ట్రాక్టర్‌కు రూ.125 చొప్పున సీనరేజీ కింద ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రైవేటు నిర్మాణాలకు పెద్దఎత్తున తరలిస్తుండటంతో నష్టం వాటిల్లుతోంది.


నిఘా పెంచుతాం..

- ఆర్‌.జైభీం, సీఐ, ఎస్‌ఈబీ, సోంపేట

అనుమతి లేకుండా ఇసుక, కంకర, మట్టి తవ్వకాలు చేపట్టకూడదు. అక్రమంగా ఎవరు తరలించినా నేరమే. దీనిపై నిఘా పెంచుతాం. పట్టుబడిన వాహనాలను పోలీసులకు అప్పగించి సీజ్‌ చేయిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని