logo

రోడ్డున పడిన ఆధిపత్య పోరు..!

మూలపేట గ్రీన్‌ఫీల్డుపోర్టు అనుసంధాన రహదారి నిర్మాణ పనుల్లో ఆధిపత్యం కోసం గుత్తేదారులు అజమాయిషీ ప్రదర్శిస్తున్నారు.

Published : 30 Mar 2024 04:39 IST

పోర్టు పనుల్లో అజమాయిషీకి గుత్తేదారుల పట్టు
రహదారికి అడ్డంగా వాహనాలు నిలపడంతో ఉద్రిక్తత

పోర్టు రోడ్డులో అడ్డంగా వాహనాలు నిలిపిన డ్రైవర్లను ప్రశ్నిస్తున్న ఇతర గుత్తేదారులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: మూలపేట గ్రీన్‌ఫీల్డుపోర్టు అనుసంధాన రహదారి నిర్మాణ పనుల్లో ఆధిపత్యం కోసం గుత్తేదారులు అజమాయిషీ ప్రదర్శిస్తున్నారు. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన అంతర్గతపోరు శుక్రవారం రోడ్డునపడింది. రహదారి నిర్మాణం కోసం జీటీఆర్‌ సంస్థకు చెందిన టిప్పర్లు మట్టి లోడ్‌తో వెళ్తుండగా వాటికి అనుమతిలేదని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అయితే అప్పటికే 20 టిప్పర్లు లోడ్‌తో వెళ్లగా వాటికి లేని అభ్యంతరం ఇప్పుడేంటని గుత్తేదారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వద్ద ఉన్న అనుమతి పత్రాలు సిబ్బందికి చూపించినా పైనుంచి ఆదేశాల్లేవని విశ్వసముద్ర సిబ్బంది చెప్పారు. దీంతో గ్రావెల్‌ లోడుతో ఉన్న టిప్పర్లను నిర్మాణంలో ఉన్న పోర్టు రోడ్డుకు అడ్డంగా పెట్టించి వాటి తాళాలు తీసుకుని గుత్తేదారు వెళ్లిపోయారు. ఇతర గుత్తేదారులకు చెందిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు పట్టణానికి దగ్గరలోనే ఇంత వ్యవహారం జరిగినా పోలీసుల జాడలేదు. కనీసం సంస్థ ప్రతినిధులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. తెరవెనుక పెద్దలతో సంప్రదింపులు జరిపి, రాయబారాలు నడిపారు. చివరికి సంబంధిత గుత్తేదారు అక్కడికి చేరుకుని ఇతర గుత్తేదారులతో మాట్లాడారు. వాహనాలు పక్కకు తీయించడంతో సమస్య సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని