logo

ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!

చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది.

Published : 25 Apr 2024 04:46 IST

మహిళా సభలో తెదేపా అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేసేందుకు మహిళలు ముందుకురావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల అభ్యున్నతికి చేపట్టనున్న కార్యక్రమాలు, అమలు చేయనున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు వివరించారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఆడబిడ్డలకు న్యాయం చేయలేని జగన్‌ మళ్లీ ఎలా ఓట్లు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు.

గుజరాతీపేట (శ్రీకాకుళం), పాత శ్రీకాకుళం, నగరం, టెక్కలి

ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు, వేదికపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థులు గొండు శంకర్‌ (శ్రీకాకుళం),   కూన రవికుమార్‌ (ఆమదాలవలస), భాజపా, జనసేన జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పిసిని చంద్రమోహన్‌, తదితరులు

రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న బందిపోటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని తరిమికొట్టేందుకే జనసేన, భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను మీరంతా ఆశీర్వదించాలి. అధికారంలోకి రాగానే మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాం. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు ఎంతో ఆదరించారు. అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు


అధర్మానను చిత్తుగా ఓడించాలి..

చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ...

రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌ అయితే శ్రీకాకుళం నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు క్యాన్సర్‌ గడ్డలా తయారయ్యారు. ఇలాంటి వారిని కూకటివేళ్లతో పెకిలించాలి. శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. శ్రీకాకుళం - ఆమదాలవలస మధ్య 10 కి.మీ.ల రోడ్డు వేయలేకపోయారు. ఈ అ‘ధర్మాన’ను చిత్తుగా ఓడించి ఇంటికే పరిమితం చేయాలి.

ఇద్దరినీ భారీ మెజార్టీతో గెలిపించండి..

‘అభ్యర్థుల ఎంపికలో శాస్త్రీయ దృక్ఫథం అవలంభించాం. ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామ్మోహన్‌నాయుడు నా మిత్రుడు ఎర్రన్నాయుడి కుమారుడు. పార్లమెంట్‌లో ఏ అంశంపైనైనా గంటల తరబడి అనేక భాషల్లో మాట్లాడే శక్తి ఉంది. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చాడు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్‌ విషయానికొస్తే యువకుడు. మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తి. ఐవీఆర్‌ఎస్‌ సర్వే ప్రజాభిప్రాయం మేరకు టికెట్‌ ఇచ్చాను. ఇద్దరినీ భారీ మెజార్టీతో గెలిపించండి. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి కూడా నాకు ఆప్తులే. ఉదయమే అప్పలసూర్యనారాయణతో మాట్లాడాను.

తరలివచ్చిన వనితాలోకం..

సభకు తరలివస్తూ...

సభకు శ్రీకాకుళం నగరంతో పాటు గ్రామీణ, గార మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా స్వచ్ఛందంగా రావడంతో సభాప్రాంగణం కళకళలాడింది. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, తెదేపా ఆమదాలవలస, శ్రీకాకుళం, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కూన రవికుమార్‌, గొండు శంకర్‌, గౌతు శిరీష, భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, తదితరులు పాల్గొన్నారు.

సభకు హాజరైన మహిళలు

జెట్టీలు నిర్మిస్తాం.. రోడ్లు వేస్తాం..

‘రాష్ట్రంలో తక్కువ తలసరి ఆదాయం ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఇక్కడి నుంచే ఎక్కువ వలస పోతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఆ మేరకు జెట్టీలు నిర్మిస్తాం. జిల్లా కేంద్రంలో మైదానంతో పాటు శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డు పనులు పూర్తి చేస్తాం. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తాం. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.  

ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయొద్దు..

వైకాపా పాలనలో మహిళలు తీవ్రంగా నష్టపోయారు? మీ బిడ్డను, మామను అని చెప్పి అధికారంలోకి రాగానే అన్నీ విస్మరించారు. అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉంది. ఒకసారి తప్పు చేశాం. మళ్లీ ఆ తప్పు చేయకూడదు. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును బాగు చేయలేని మంత్రి ధర్మాన ప్రసాదరావు, సభాపతి తమ్మినేని సీతారాం ప్రజల జీవితాలు ఇంకేం బాగు చేస్తారు? రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించే బాధ్యత సోదరీమణులపై ఉంది.

కె.రామ్మోహన్‌నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ అభ్యర్థి


అబద్ధాల ముఖ్యమంత్రి అవసరమా?

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బటన్‌ నొక్కుతున్నా డబ్బులు రావట్లేదు. అమ్మఒడి సొమ్ములు మూడేళ్లు ఇచ్చి.. నాలుగో   ఏడాది మొండిచేయి చూపారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామన్నారు. రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు. విద్యుత్తు ఛార్జీలు, చెత్త, నీటి పన్నులు పెంచేశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక సూపర్‌ 6 పథకాలు అమలు చేసి సంక్షేమం అంటే ఏంటో చూపిస్తారు. హామీలిచ్చి విస్మరించిన జగన్‌ లాంటి అబద్ధాల ముఖ్యమంత్రి అవసరమా?

కూన రవికుమార్‌, తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి


అయిదేళ్లలో చేసింది శూన్యం..

తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి తప్ప.. వైకాపా అయిదేళ్ల కాలంలో చేసిందేమీ లేదు. శ్రీకాకుళం - ఆమదాలవలస రోడ్డు వేయలేకపోయారు. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. కోడిరామ్మూర్తి మైదానం పునర్నిర్మాణాన్ని వదిలేశారు. ఎక్కడ చూసినా రోడ్లంతా గుంతలే కనిపిస్తున్నాయి. సామాన్య కార్యకర్తనైన నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.

గొండు శంకర్‌, తెదేపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు