logo

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది ఓటు వినియోగించుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు.

Published : 04 May 2024 05:50 IST

శ్రీకాకుళంలోని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న  జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సామూన్‌, ఇతర అధికారులు

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం): ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది ఓటు వినియోగించుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన పత్రాలను ఇప్పటికే ఆయా సిబ్బందికి ఇచ్చారు. వీరంతా వారికి కేటాయించిన తేదీల్లో ఆయా నియోజకవర్గ కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారి వద్ద ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 25,505 మంది పోస్టల్‌ బాలెట్‌ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. వీరికిగాను ఎన్నికల అధికారులు 20 శాతం అదనంగా 30,606 పోస్టల్‌ బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది.

7న చివరి అవకాశం..

4న పీవో, ఏపీవో, సూక్ష్మ పరిశీలకులు, పోలీసుశాఖ సిబ్బంది ః 5న ఓపీవో, సెక్టార్‌ అధికారులు, కంట్రోల్‌ రూం సిబ్బంది, ఇతర బృందాల్లో విధులు నిర్వహిస్తున్నవారు ః ఆరో తేదీన పోలీసు, ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న వీడియోగ్రాఫర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, మాజీ సైనికులు, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటు వేస్తారు. ఈ మూడు రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయినా వారికి 7న (రిజర్వ్‌డే) మరో అవకాశం ఉంటుంది.

సీ-విజిల్‌కు 624 ఫిర్యాదులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో మార్చి 14న ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు సీ-విజిల్‌కు 624 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో 437 మాత్రమే సరైనవిగా అధికారులు నిర్ధారించారు. 187 ఫిర్యాదులను జిల్లా నియంత్రణ కేంద్రం, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు పరిశీలించి.. ఫేక్‌ సమాచారంగా ధ్రువీకరించారు. పలాస నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అక్కడి నుంచే 269 ఫిర్యాదులు రాగా.. వాటిలో 107 సరైనవి కాదని నిర్ధారించారు. ఎచ్చెర్ల నుంచి అతి తక్కువగా 8, ఆమదాలవలసలో 94, ఇచ్ఛాపురంలో 85, నరసన్నపేటలో 90, శ్రీకాకుళంలో 20, టెక్కలి 47 ఫిర్యాదులు వచ్చాయి.

రాష్ట్రంలో జిల్లాకు మొదటి స్థానం.. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా వంద నిమిషాల్లో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడతారు. అలా ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో 98 కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫిర్యాదులపై యాప్‌ ద్వారానే కాకుండా టోల్‌ ఫ్రీ నంబర్లు 1950, 1800 4256625కు కాల్‌ చేయవచ్చు. జిల్లాస్థాయిలో ఎన్నికల ఫిర్యాదులకు 08942-240589/295084 నంబర్లను అందుబాటులో ఉంచారు. ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచుతారు.

హక్కు వినియోగించుకోనున్నవారి సంఖ్య ఇలా..

  • పీవో, ఏపీవో, ఓపీవోలు : 15,627
  • ఇతర ఎన్నికల సిబ్బంది : 4,134 మంది
  • పోలీసు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, మాజీ సైనికులు : 1,873
  • హోం ఓటింగ్‌, పీడబ్ల్యూడీ : 495
  • శ్రీకాకుళంలో పని చేస్తున్న ఇతర జిల్లా అధికారులు : 3,296
  • ఏవీఈఎస్‌ ఓటర్లు : 80
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని