logo

అడ్డదారిలో అద్దెకు..!

కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.

Published : 29 Apr 2024 05:32 IST

రూ.కోట్లు విలువ చేసే భవనం అప్పగించేందుకు సన్నాహాలు

కాశీబుగ్గలోని వీఆర్వోల సంఘ భవనం

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు. అక్కడ భవనాన్ని నిర్మించి కొన్నేళ్లు లీజుకు ఇచ్చారు. గడువు తీరడంతో ఏడాది క్రితం రెవెన్యూ అధికారులను ఖాళీ చేయించారు. తాజాగా పురపాలక సంఘంలోని ఓ కౌన్సిలర్‌ బంధువుకు అద్దె పేరుతో అప్పగించే పని జరుగుతోంది. అందుకు కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

గుట్టుచప్పుడు కాకుండా..

కాశీబుగ్గ ఎస్సీ కాలనీ (న్యూకాలనీ)లో సుమారు 30 ఏళ్ల కిత్రం వీఆర్వోల సంఘానికి స్థలం కేటాయించారు. అందులో భాగంగా భవన నిర్మాణం చేపట్టి లీజు పద్ధతిలో 1999లో స్థానికంగా ఓ వ్యక్తికి అప్పగించారు. గడువు పూర్తవడంతో 2022 డిసెంబరులో అప్పటి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దారు మధుసూదన్‌ ఆధ్వర్యంలో భవనం స్వాధీనం చేసుకున్నారు. భవనానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేశారు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా కొంతమంది రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఓ మున్సిపల్‌ కౌన్సిలర్‌ బంధువుకు అద్దెకు ఇచ్చేందుకు పావులు కదిపారు. రూ.3 లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని నెలకు రూ.7,500 అద్దె ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. రూ.కోట్లు విలువ చేసే భవనాన్ని ఇతరులకు అప్పగించేటప్పుడు స్థానికంగా ఉండే ఆర్డీవో, తహసీల్దారు వంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే డివిజన్‌ పరిధిలోని వీఆర్వోల అభిప్రాయం తీసుకోవాలి. ఇవేమీ జరగకుండా భవనాన్ని అప్పగించినట్లు తెలిసింది. మరో వైపు ఈ భవనంలో ఒక గదిని గత కొంత కాలంగా అనధికారికంగా ఇతరులకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

మూడేళ్లకు ఒప్పందం

నెలకు రూ.7,500 అద్దె ప్రాతిపదికన మూడేళ్లకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌ విషయం నా దృష్టిలో లేదు. వృథాగా ఉండటంతో అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. భవనం పై భాగం మరమ్మతులు చేయాల్సి ఉంది.

సోమేశ్వరరావు, వీఆర్వోల సంఘ నాయకుడు, పలాస మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు