logo

అవ్వాతాతల.. ఉసురు పోసుకుంటారా?

ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు ఇళ్లకు ఎక్కడో దూరాన ఉన్న బ్యాంకులు.. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో అధికార పక్షానికి మేలు చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది.

Published : 30 Apr 2024 05:58 IST

ఇంటి వద్దే ఇచ్చేందుకు అవకాశం ఉన్నా పట్టించుకోని అధికారులు
లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, బృందం

  • గార మండలం వాడాడ, గొంటి, బలరాంపురం గ్రామాల్లోని 844 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా పింఛను నగదు తీసుకోవాలంటే 10 కి.మీ. దూరం ప్రయాణించి శ్రీకాకుళం నగరంలోని బ్యాంకులకు రావాలి.

  • ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన పింఛనుదారులు 17 కి.మీ. దూరంలో ఉన్న ఇచ్ఛాపురం పట్టణంలోని బ్యాంకులకు వెళ్లాలి. వీరికి బస్సు సదుపాయం లేకపోవడంతో తప్పనిసరిగా ఆటోలోనే వెళ్లాలి.

  • హిరమండలంలోని పెద్దగూడ పంచాయతీ జన్నోడుగూడలో ఉన్న లబ్ధిదారులు పింఛను కోసం సుమారు 15 నుంచి 20 కి.మీ. ప్రయాణించి కొత్తూరు, హిరమండలంలోని బ్యాంకులకు వెళ్లాలి.

  • ఏప్రిల్‌ 4న పింఛను కోసం మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన దివ్యాంగుడు బినోద్‌ పాణిగ్రహి (72) వసుంధర సచివాలయం పరిధిలోని రట్టిని గ్రామం నుంచి సుమారు 2 కిలోమీటర్లు దూరం ఎండలో ప్రయాణించారు. అక్కడి సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకున్నారు. తిరిగి వస్తుండగా దారిలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు.

ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు ఇళ్లకు ఎక్కడో దూరాన ఉన్న బ్యాంకులు.. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో అధికార పక్షానికి మేలు చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇంటింటికీ వెళ్లి పింఛను అందించేందుకు ఉన్న అవకాశాలను పట్టించు కోకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే కుతంత్రానికి తెరలేపింది. సచివాలయాల ద్వారా పింఛన్లు అందజేసే వీలున్నా పక్కన పెట్టేశారు. పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించి.. వారికి ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటి దగ్గరే పింఛను ఇవ్వాలని లబ్ధిదారులు వేడుకుంటున్నా లెక్క చేయకుండా అడుగులు వేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


24.28 శాతం మందికే ఇంటింటికీ..

జిల్లా వ్యాప్తంగా 3,20,886 మంది లబ్ధిదారులకు మే నెల పింఛను సొమ్ము ఇవ్వనున్నారు. వీరిలో 2,42,957 మందికి వారి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేయనున్నట్లు సెర్ప్‌ అధికారులు ప్రకటించారు. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారికి, మంచం పట్టినవారు, దివ్యాంగ, సైనిక పింఛన్లు పొందుతున్న 77,929 (24.28 శాతం) మందికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగదును అందజేస్తారని వెల్లడించారు. వారికి సంబంధించిన ఇవ్వాల్సిన నగదు మంగళవారం(30న) సచివాలయ సిబ్బంది ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.


ఎందుకు కుదరదు ?

జిల్లా వ్యాప్తంగా 732 సచివాలయాల పరిధిలో 12,229 మంది వాలంటీర్ల ద్వారా జనవరిలో 1న 3,23,436 మందికి 1,32,797 మందికి పింఛను అందించారు. ఫిబ్రవరి 1న 3,24,303 మందికి 2,62,957 మందికి, మార్చి 1న రూ.3,22,825 మందికిగాను 2,50,125 మందికి అందజేశారు. లక్షల మంది లబ్ధిదారులకు వేల సంఖ్యలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులతో మే 1 నుంచి 5వ తేదీలోపు పంపిణీ చేయించొచ్చు కదా..

  • ఏప్రిల్‌లో సచివాలయాల ద్వారా 3,21,689 పింఛనుదారులకు సిబ్బంది 2,95,171 మందికి రెండు రోజుల్లోనే పంపిణీ చేశారు. జిల్లాలో 6,642 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. 3,20,886 మందికి పింఛను సొమ్ము ఇవ్వాల్సి ఉంది. అంటే సగటున ఒక్కో ఉద్యోగి 48 మందికి ఇంటికే వెళ్లి పింఛను ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు.?

అందరికీ అందడం సాధ్యమేనా?

జిల్లా వ్యాప్తంగా 732 సచివాలయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం బ్యాంకులను ఆశ్రయించింది. జిల్లాలో జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు మొత్తం 243 శాఖలు ఉన్నాయి. మరో 39 ఇతర బ్యాంకుల శాఖలు ఉన్నా వాటిలో పింఛను లబ్ధిదారుల ఖాతాలు అంతంతమాత్రమే. ఒక్కో శాఖ నుంచి రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే నగదు అందజేసే అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 2,42,957 మందికి నగదు అందజేయాలంటే వారం నుంచి పది రోజుల పాటు సమయం తప్పనిసరిగా పడుతుంది. ఒక వేళ బ్యాంకు సర్వర్‌ పనిచేయకపోయినా.. ఇతరత్రా సేవలందించాల్సి ఉన్నా మరికొన్ని రోజులు పెరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.


వ్యయప్రయాసలు ఇదిగో..

  • పింఛను లబ్ధిదారులకు సచివాలయాల కంటే బ్యాంకులే చాలా దూరంలో ఉన్నాయి. కొన్ని చోట్ల బ్యాంకుకు  వెళ్లాలంటే పదుల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
  • తీరా ఎండలో ఉసూరుమంటూ అక్కడికి వెళ్లినా సరైన మౌలిక సదుపాయాలు ఉండవు. కూర్చునేందుకు స్థలం కనిపించదు. అసలే వేసవి కావడంతో తాగేందుకు నీరు దొరక్క వృద్ధులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  • జిల్లాలోని చాలా గ్రామాల నుంచి బ్యాంకులకు వెళ్లేందుకు బస్సు సదుపాయం లేదు. ఆటోలపై వెళ్లాలంటే రూ.వందల్లో రవాణా ఖర్చులు భరించక తప్పదు.
  • ఇంత చేసిన తరువాత వెళ్లిన రోజే బ్యాంకర్లు పింఛను సొమ్ము ఇస్తారనే నమ్మకం లేదు. ఒకేసారి అధిక సంఖ్యలో ఖాతాదారులు వెళ్లడం, బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలు దృష్ట్యా పింఛనుదారులకు అష్టకష్టాలు తప్పేలా లేవు.
  • నిరక్షరాస్యులు, వృద్ధులు నగదు ఉపసంహరణకు ఓచర్‌ రాయడం, ఏటీఎం కార్డులు వినియోగంపై అవగాహన ఉండకపోవడం మరో ఇబ్బంది.

ఏప్రిల్‌ 4న గార మండలం లింగాలవలస సచివాలయం వద్ద పింఛను డబ్బుల కోసం ఎండలోనే లబ్ధిదారుల పడిగాపులు


అప్పుడే ఆపసోపాలు పడ్డాం..
- శివంగి మోహనరావు, సీమూరు, కవిటి మండలం

ఏప్రిల్‌ పింఛను తీసుకోవడానికి మా గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలవంకలోని సచివాయానికి వెళ్లేందుకు ఎండలో ఆపసోపాలు పడ్డాం. కొందరు నడుచుకుంటూ వెళ్లారు. మరికొందరు ఆటోలపై వెళ్లి అక్కడ పడిగాపులు కాయాల్సి వచ్చింది. రోజంతా అక్కడే ఉండి పింఛను డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలైంది. ఈ సారి బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలంటున్నారు. అది ఇంకా దూరం. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయాలి.


ఇంటికే ఇవ్వాలి..
- జన్ని మహాలక్ష్మి, సొంఠినూరు, గొల్లవూరు పంచాయతీ, నందిగాం

ఈసారి పింఛను సొమ్ము కావాలంటే బ్యాంకుకు వెళ్లమంటున్నారు. మా గ్రామానికి 5 కి.మీ. దూరంలోని పెద్దతామరాపల్లి బ్యాంకులో నాకు ఖాతా ఉంది. అక్కడి వెళ్లాలంటే రానుపోనూ.. వెయిటింగ్‌ ఛార్జీ రూ.500 వరకు ఖర్చవుతుంది. ఇంటి వద్దనే పింఛను అందజేయాలి.


ఖాతా ఉందో లేదో తెలియదు
- చిన్నారావు, వృద్ధుడు, పలాస

నా బ్యాంకు ఖాతా ఏడేళ్ల కిందట ప్రారంభించాను. ఇప్పుడు అందులోనే పింఛను నగదు వేస్తామని చెబుతున్నారు. అది నిర్వహణలో ఉందో లేదో తెలీదు. ఒకసారి ఇంటికి వెళ్లి ఖాతా పుస్తకం ఎక్కడుందో వెతుక్కోవాలి. ఇంటి వద్దకే వచ్చి డబ్బులిస్తే ఇబ్బంది ఉండదు.


పింఛనుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాను
- సవర సొంబురు, జన్నోడుగూడ, పెద్దగూడ పంచాయతీ హిరమండలం మండలం

గత నెల మా ఊరి నుంచి మర్రిగూడ గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకున్నాను. అప్పుడు ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యాను. ఆ తర్వాత వైద్య చికిత్సకు రూ.6,500 ఖర్చయింది. వచ్చిన పింఛను సొమ్ము కాకుండా ఇంకా అప్పు చేయాల్సి వచ్చింది. ఈ నెల ఇంటికే వచ్చి పింఛను అందజేయాలి.

జిల్లాలో వివరాలిలా...

మొత్తం సచివాలయాలు: 732
ఉద్యోగులు: 6,642
మే లో పింఛను అందుకోనున్నవారు: 3,20,886
బ్యాంకు ఖాతాలున్నవారు: 2,42,957

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని