logo

‘దీవెన’ పేరుతో దగా!

జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క.

Updated : 05 May 2024 05:21 IST

ఒక విడతకే  పరిమితం చేసిన జగనన్న
న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

డ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. రెండేళ్ల ఐటీఐ కోర్సు అభ్యసించే విద్యార్థులకు రూ.10 వేల చొప్పున బాకీ పడినట్లే. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మూడేళ్లకు కలిపి రూ.22,500 చొప్పున అందజేయాలి. డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇవ్వాలి. ‘బాకీ సొమ్ము ఎప్పుడు ఇస్తావు జగనన్నా’ అంటూ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇస్తానని చెప్పడం ఎందుకు..ఇవ్వకుండా జాప్యం చేయడంలో ఆంతర్యం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.  

చెప్పిందొక్కటి..: పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు పుస్తకాలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం వసతి దీవెన పేరిట ఉపకార వేతనం రెండు విడతల్లో తల్లుల ఖాతాలకు జమ చేస్తామని వైకాపా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేలు జమ చేస్తామని స్పష్టం చేసింది.


చేసిందొకటి..: విద్యార్థులకు అందుతోంది ఒక విడతే. సగం మాత్రమే ఇస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరం మొత్తానికి వసతి దీవెన కింద ఒక విడత కూడా ఇవ్వలేదు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన పుస్తకాలు, రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం జగన్‌ ప్రభుత్వం వసతి దీవెన పేరిట సంక్షేమ పథకం ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం పూర్తయి సంస్థలను వదిలి బయటకు వెళ్లిపోతున్నా సొమ్ము మాత్రం అందలేదు. కొంత ఆలస్యమైనా డబ్బులు వస్తాయని ఆశతో ఉన్న వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.


డిగ్రీ పూర్తయినా డబ్బులు రాలేదు..
- జి.ప్రవీణ్‌కుమార్‌, శ్రీకాకుళం

నేను గత విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశా. మూడేళ్లలో వసతి దీవెన కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున జమైంది. రెండో విడత కోసం అధికారులను సంప్రదిస్తే ఇస్తారని చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి రూ.30 వేలు రావాలి. చదువు పూర్తయినా డబ్బులు రాలేదు. ఆ సొమ్ము విడుదల చేస్తే పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందడానికి ఉపయోగపడుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని