logo

ప్రతి మహిళకు నెలకు రూ.1,500

‘వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు  ఇబ్బందులు పడ్డారు. కేసులతో వేధింపులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ   ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేశారు.

Published : 05 May 2024 05:09 IST

అర్హులందరికీ సూపర్‌-6 పథకాలు
కిడ్నీ బాధితులు, జీడి రైతులను ఆదుకుంటాం
‘న్యూస్‌టుడే’తో పలాస కూటమి అభ్యర్థి గౌతు శిరీష
న్యూస్‌టుడే, పలాస

‘వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు  ఇబ్బందులు పడ్డారు. కేసులతో వేధింపులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ   ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెట్టిన బాధలు చెప్పలేం. పాఠశాలల విలీనం పేరుతో ప్రాథమిక విద్యకు పాతరేశారు. ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనను అంతం చేయాలనే తెదేపా, జనసేన, భాజపా జట్టు కట్టాయి. కూటమి ప్రభుత్వం మహిళలకు సంక్షేమం అందిస్తూనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. 19 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తాం.’అని పలాస కూటమి అభ్యర్థి గౌతు శిరీష స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలు,  అభివృద్ధి కార్యక్రమాలను ‘న్యూస్‌టుడే’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆమె  వివరించారు.


నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు

మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరవాత తొలి సంతకం ఈ దస్త్రం పైనే. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు యువతకు నెలకు రూ.మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. పరిశ్రమ అవసరాలకు తగినట్లు నైపుణ్య శిక్షణ అందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమవడం కోసం డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం.


గ్రామాల్లో పేదలకు మూడు సెంట్ల స్థలం

సామాజిక భద్రత పింఛను నెలకు రూ.నాలుగు వేలకు పెంచుతాం. దివ్యాంగులకు పింఛను రూ.ఆరు వేలు అందజేస్తాం. పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు ఇస్తాం. కిడ్నీ, తలసే మియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.10 వేల పింఛను అందిస్తాం. పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం. ఇప్పటి వరకు పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం తరఫున ఇళ్లు నిర్మించి ఇస్తాం.


బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తాం. ఉప ప్రణాళిక అమలు చేస్తాం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థలు, నియమిత పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. వీరి స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. రూ.ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం. మత్స్యకారులకు సముద్ర వేట విరామ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్ని భర్తీ చేస్తాం. 


జీడికి మద్దతు ధర వచ్చేలా కృషి .. మంత్రి అప్పలరాజు జీడి రైతులకు న్యాయం చేయలేదు. వ్యాపారులకు రూ.వెయ్యి ఇస్తామన్న హామీని ఆయన పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే జీడికి మద్దతు ధర లభించేలా కృషి చేస్తాం. కొబ్బరి ఇతర ఉద్యాన పంటలకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతాం.


ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను

మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను అందజేస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. ఇమామ్‌లకు ప్రతి నెల రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం.


భూహక్కు చట్టం రద్దు..

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తారు. రైతులకు రాయితీపై సోలార్‌ పంపుసెట్టు అందించి మిగులు విద్యుత్తును వారి నుంచి కొనుగోలు చేయిస్తాం. తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తాం.  కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. పంటల బీమా వర్తింపజేస్తాం. రైతు కూలీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వ రాయితీలు అందిస్తాం. ఆక్వాలో అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్తు యూనిట్‌ రూ.1.50కే సరఫరా చేస్తాం. ఐదు వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులు నిర్మిస్తాం.


మంత్రి అప్పలరాజు అక్రమాలపై దృష్టి

కూటమి అధికారంలోకి రాగానే పలాస నియోజకవర్గంలో గత అయిదేళ్లలో మంత్రి అప్పలరాజు, ఆయన అనుచరులు పాల్పడిన భూ ఆక్రమణలపై దృష్టి సారిస్తాం. ఐఏఎస్‌ అధికారితో విచారణ చేయిస్తాం. అప్పలరాజు హయాంలో మోసపోయిన, భూములు పోగొట్టుకున్న వారు నాకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.


రైతులకు ఏడాదికి రూ.20 వేలు

అధికారంలో రాగానే నిత్యావసర సరకుల ధరలు తగ్గిస్తాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌర ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి పథకాన్ని అనుసంధానించి ఛార్జీల భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేయడంతో పెట్టుబడి భారం తగ్గుతుంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు నియంత్రిస్తాం. ఉచితంగా ఇసుక ఇస్తాం. ఇంటి నిర్మాణ భారం తగ్గుతుంది.


మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్‌

కాపుల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలిస్తాం. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ప్రైవేటు దేవాలయాల్లో పని చేసే అర్చకులకు కనీస వేతనం ఉండేలా అమలు చేస్తాం.


కిడ్నీ సమస్యలపై పరిశోధనలకు ఊతం.. ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై పరిశోధనలకు ఊతమిస్తాం. భవిష్యత్తు తరాలు ఈ వ్యాధి బారిన పడకుండా చేయాలనేది మా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలాసలో పరిశోధనలు జరిగేలా చూస్తాం.


వనితలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

19 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తాం. వారు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణం రూ.10 లక్షల వరకు పెంచుతాం. ఉద్యోగం చేసే మహిళలకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేస్తాం. విద్యార్థినుల చదువుకు అవసరమైన రుణాలు ఇప్పిస్తాం.


మూడేళ్లలో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పూర్తి.. 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో పూర్తి చేస్తాం. పలాసలో రైతు బజారు, ఇండోర్‌ స్టేడియం, సగం పనులతో వదిలేసిన కె.టి.రోడ్డు, కాశీబుగ్గ రైల్వే గేటు వద్ద పైవంతెన పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తాం.


వాలంటీర్లకు నెలకు రూ.10 వేలు

ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేస్తాం. పింఛనుదారుల కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పూర్తి అనుకూల వాతావరణంలో పని చేసేలా చూస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. తక్కువ జీతాలు పొందే పొరుగు సేవలు, ఒప్పంద, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని