logo

జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్‌..!

వైకాపా అయిదేళ్ల పాలనలో కొండలు కొల్లగొట్టేశారు.. దొరికినకాడిని భూకబ్జాలకు పాల్పడ్డారు.. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి దాడులకు తెగబడ్డారు. అరాచకాలకు అంతులేకుండా వ్యవహరించారు. తాజాగా ఇవన్నీ అధికారికం చేసే కుట్రకు తెర లేపారు.

Updated : 06 May 2024 07:30 IST

గందరగోళంగా భూ యాజమాన్య హక్కు చట్టం
స్పష్టత లేకున్నా అమలు చేసేందుకు పన్నాగం

వైకాపా అయిదేళ్ల పాలనలో కొండలు కొల్లగొట్టేశారు.. దొరికినకాడిని భూకబ్జాలకు పాల్పడ్డారు.. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి దాడులకు తెగబడ్డారు. అరాచకాలకు అంతులేకుండా వ్యవహరించారు. తాజాగా ఇవన్నీ అధికారికం చేసే కుట్రకు తెర లేపారు. ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) పేరుతో సామాన్యుల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చట్టంపై సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నా లెక్క చేయట్లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు రోజుకో మాట చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. న్యాయవాదులు, నిపుణులు ఈ చట్టంతో కలిగే నష్టాలను వివరిస్తున్నా చెవికెక్కించుకోవట్లేదు.  

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, కలెక్టరేట్‌


ధర్మాన రోజుకోమాట..

‘కేంద్ర ప్రభుత్వ సిఫార్సులు, నీతి అయోగ్‌ సూచనల మేరకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నాం. దీనిపై న్యాయవాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభ్యంతరాలు కోరుతూ త్వరలో వెబ్‌సైట్‌ ప్రారంభిస్తాం. దాని కంటే ముందు  రీ సర్వే పూర్తికావాల్సి ఉంది.’

ఈ ఏడాది ఫిబ్రవరి 3న  శ్రీకాకుళంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి మాటలు ఇలా..

‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే దీన్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చాం. న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై స్పష్టత వచ్చేవరకు ఈ చట్టం అమలు చేయం. లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.’

ఏప్రిల్‌ 29న వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ధర్మాన వ్యాఖ్యలిలా..

ఇవన్నీ కుట్రలో భాగమే..

భూ యాజమాన్య హక్కు చట్టం అమల్లోనికి రాక ముందే ప్రజల ఆస్తులపై ప్రభుత్వం కన్నేసింది. ఆ కుట్రలో భాగంగానే జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాల పేరుతో భూముల రీ సర్వే చేయించారు. హద్దులు నిర్ణయించి జగన్‌ బొమ్మతో రాళ్లు పాతించారు. దస్త్రాల డిజిటలైజేషన్‌, శాశ్వత హక్కు పత్రం అని గొప్పలు చెబుతూ వాటిపై జగన్‌ చిత్రాలను ముద్రించారు. భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్య (ఐడీ)ను కేటాయించారు. ఇవన్నీ టైటిలింగ్‌ చట్టం అమలులో అంతర్భాగమేనని నిపుణులు చెబుతున్నారు. రీ సర్వే తప్పల తడకగా జరిగిందని జనాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. ఇదే కాకుండా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టానికి కూడా సవరణలు చేశారు.

రోడ్డెక్కిన న్యాయవాదులు..

చట్టం రద్దు కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న న్యాయవాదులు(పాత చిత్రం)

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చిన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజల భూములకు భద్రత కొరవడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వారితో చర్చలు జరిపి సూచనలు, సలహాలు తీసుకున్న దాఖలాలూ లేవు.

ఆందోళన కలిగిస్తున్న విషయాలివీ..

  • చట్టం అమలుకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన విధివిధానాలేవీ రూపొందించలేదు.
  • భూమిపై యాజమాన్య హక్కును నిర్ణయించే అధికారికి ఉండాల్సిన అర్హతలు, స్థాయిని ఎక్కడా పేర్కొనలేదు.
  • కొత్త చట్టంలో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(టీఆర్‌వో) తయారు చేసిన దస్త్రాలే అన్నింటికీ ప్రామాణికం. అధికార పార్టీ నేతల ఒత్తిడితో టీఆర్‌వో నిరక్షరాస్యులు, రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
  • చట్టంలోని నిబంధనల ప్రకారం ఆస్తి తమదేనంటూ ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేసినా.. సంబంధిత భూమి వివాదంలో ఉన్నట్లు టీఆర్‌వో ‘డిస్ప్యూట్‌ రిజిస్టర్‌’లో నమోదు చేస్తారు. దీంతో అసలు యజమానికి ఇబ్బందులు తప్పవు.
  • భూవివాదాల్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌ (ఎల్‌టీఏవో) ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ఇంత వరకు స్థానిక సివిల్‌ కోర్టుకు వెళ్లేవారు. దానికి కత్తెర వేశారు. బాధితులు హైకోర్టులో మాత్రమే రివిజన్‌ పిటిషన్‌ వేసుకోవాలి. అక్కడ కూడా పునఃపరిశీలనకు మాత్రమే అవకాశమిచ్చి.. లోతుగా విచారించే అవకాశం లేకుండా చేశారు.
  • సాధారణంగా తాతలు, తండ్రులకు చెందిన ఆస్తులు వారు మరణించిన తరువాత వారసులకు చెందుతాయి. కొత్త చట్టం ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ల్యాండ్‌ టైటిలింగ్‌ అధికారులే ఆ ఆస్తి ఎవరికి చెందుతుందో నిర్ణయిస్తారు. దీంతో అసలైనవారికి అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది పూర్తిగా అస్పష్టమైన చట్టం..

ప్రస్తుతం భూహక్కులకు సంబంధించి పాటిస్తున్న ఆర్‌వోఆర్‌ విధానమే సరైనది. అందులో సామాన్యులకు అన్యాయం జరిగితే న్యాయస్థానం వారి ఆస్తులకు భద్రత కల్పిస్తుంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ఆ వీలుండదు. ఈ చట్టం పూర్తిగా అస్పష్టమైనది. ఈ చట్టంలో న్యాయస్థానం పాత్రను తప్పించారు. టైటిల్‌ నిర్ధారణ, రద్దుకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారనే విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదు. 

అంపోలు రాంబాబు, న్యాయవాది


తప్పులతడకగా రీసర్వే..

భూముల రీ సర్వేతో మా గ్రామంలో రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. నాకు 6.20 ఎకరాల భూమి ఉంది. రీసర్వే అనంతరం ఏడు పాసుపుస్తకాలిచ్చారు. సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం తప్పులతడకగా ముద్రించారు. వాటిపై జగన్‌ చిత్రాలు ముద్రించారు. గతంలో మీ-భూమి పోర్టల్‌లో వివరాలు చూసుకునేవాళ్లం. అది కూడా నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ఏదో కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు. అంతా గందరగోళంగా ఉంది.

బడే జగదీష్‌, రావివలస, టెక్కలి మండలం


రెండేళ్లలో స్పందించకుంటే అంతే..

భూ యాజమాన్య హక్కు చట్టంతో వలసలు వెళ్లినవారు, చిన్న, సన్నకారు రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదముంది. గిట్టని వారెవరైనా వారి భూములపై ఫిర్యాదు చేస్తే ఆ ఆస్తిని డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ భూమి తనదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. దానిపై రెండేళ్లలో ఎవరూ స్పందించకపోతే ఫిర్యాదుదారుడికే ఆ భూమిపై హక్కులు రాసిచ్చేస్తారు. దీనిపై కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. హైకోర్టులో మాత్రమే రివిజన్‌ పిటిషన్‌ దాఖËలు చేసుకోవాలి. ఈ చట్టం అమల్లోకి వస్తే టీఆర్వోలపై రాజకీయ నాయకుల ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది.

పాలిశెట్టి మల్లిబాబు, న్యాయవాది, శ్రీకాకుళం


రద్దు చేయకుంటే పోరాటమే..

సాధారణంగా న్యాయస్థానాల్లోనే భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఈ చట్టంలో ఆ అవకాశం లేదు. జగన్‌మోహన్‌ రెడ్డి పేదలకు భూముల్లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం అమలు చేయాలని చూస్తున్నారు. పాత విధానమే సరైనది. దీన్ని రద్దు చేయకుంటే పోరుబాట తప్పదు.

జి.సింహాచలం, ప్రజాసంఘాల నాయకుడు


రాజకీయ నాయకులకే ఉపయోగం..

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అమల్లోకి వస్తే రాజకీయ నాయకులు పేదల భూములను బలవంతంగా లాక్కునే పరిస్థితి వస్తుంది. అన్యాయం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సామాన్య, మధ్యతరగతి రైతు కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుంది. 

కె.మోహనరావు, ఏపీ రైతు సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని