logo

సముద్రమంత కష్టం.. వలస బతుకులే శరణ్యం

మత్స్యకారుడైన అప్పలరాజు మత్స్య శాఖకు మంత్రి కాగానే ఆ సామాజిక వర్గీయులు సంబరపడ్డారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. వీలున్నప్పుడల్లా ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు.

Updated : 07 May 2024 05:34 IST

జెట్టీల ఊసే లేదు.. ఫిషింగ్‌ హార్బర్‌ పట్టాలెక్కదు
హామీలకే పరిమితమైన మంత్రి అప్పలరాజు
న్యూస్‌టుడే, సోంపేట, సంతబొమ్మాళి

మత్స్యకారుడైన అప్పలరాజు మత్స్య శాఖకు మంత్రి కాగానే ఆ సామాజిక వర్గీయులు సంబరపడ్డారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. వీలున్నప్పుడల్లా ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినా ఐదేళ్లలో మంత్రిగా చేసిందేమీ లేకపోవడంతో ఉసూరుమనడం వారి వంతైంది. జీవనోపాధి నిమిత్తం ఎప్పటిలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ‘అధికారంలోకి వస్తే తీర ప్రాంతం రూపురేఖలు మారుస్తాం.. ఇక్కడి నుంచి వలసలు లేకుండా చేస్తాం’ అని చెప్పిన జగన్‌ ఆ ఊసే మరిచారు. ఒక జెట్టీ నిర్మించకపోగా ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం అతీగతీ లేకుండా ఉంది. ఉపాధి దిశగా చర్యలు తీసుకోక పోవడంతో మత్స్యకారులు స్వగ్రామాలను వదిలి వెళ్తున్నారు.  

ఇదీ పరిస్థితి..

సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీలో రెండు వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు చేపల వేటే ఆధారం. సంప్రదాయ వేటతో తగినంత ఆదాయం రాక 900 మందికి పైగా అండమాన్‌, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, గోవా, కేరళ తదితర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నెలలో 25 రోజుల వరకు సముద్రంపై ఉండి వేట సాగించినా రూ.30 వేల లోపు ఆదాయం సమకూరుతోంది. స్టీమర్లు వినియోగించే అవకాశం ఉంటే రూ.70 వేలకు పైగా సంపాదించవచ్చు.

  • జిల్లాకు చెందిన 32 వేల మందికి పైగా మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. స్టీమర్లు, ఆధునిక మర పడవల్లో వేటకు వెళ్లి రెండు, మూడు వారాల పాటు సముద్రంపై ఉంటున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే కుటుంబ సభ్యులు ఆఖరి చూపునకు నోచుకోలేని దుస్థితి నెలకొంది.
  • ఆధునిక వేటకు సిక్కోలు తీరంలో కనీస వసతులు లేవు. సముద్రం పైకి పడవ పంపాలన్నా.. వేట నుంచి తిరిగి ఒడ్డుకు చేరాలన్నా ఆపసోపాలు పడాల్సి వస్తోంది. సాధారణ పడవలపై ఎనిమిది నాటికల్‌ మైళ్ల లోపే వేట సాగిస్తుండటంతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.  
  • తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్‌, పుదుచ్చేరి, గోవా, అండమాన్‌-నికోబార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర తదితర తీర ప్రాంత రాష్ట్రాల్లో సగటున 30 కి.మీ.కు ఒక జెట్టీ నిర్మించారు. ఫిషింగ్‌ హార్బర్లు ఉండటంతో వేట సాగించేందుకు అనువైన పరిస్థితి ఉంటుంది.


కొందరికే భరోసా..మత్స్యకారులకు వేట విరామ సమయంలో అందించే భరోసా, పింఛన్లు అరకొరగా ఇస్తున్నారు. వివిధ నిబంధనలతో మత్స్యకార భరోసా కొందరికే పరిమితం చేశారు. ఇంజిన్‌ పడవపై 18 మంది వేటకు వెళ్తుండగా కేవలం ఆరుగురికి, చిన్న పడవలో ఆరుగురు వేటకు వెళ్తుండగా ముగ్గురికే భృతి చెల్లిస్తున్నారు. జిల్లాలో చిన్న, ఇంజిన్‌ పడవలు ఐదు వేల వరకు ఉన్నాయి.  


ప్రకటనలకే పరిమితం

జిల్లాలో ఆరేడు జెట్టీలు ఏర్పాటు చేస్తే వలసల నివారణతో పాటు 1.5 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అవకాశముంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో రెండు, మూడు జెట్టీల ఏర్పాటుకు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తే మత్స్యకారులు, ఇతర వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఎన్నికల ముందు పాలకులు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి.

పలాస నియోజకవర్గంలో నువ్వలరేవు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన టి.జెట్టీ పునాదుల దశ కూడా దాటలేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆర్భాటంగా ప్రకటించిన బుడగట్లపాలెం హార్బర్‌ పరిస్థితి అతీగతీ లేకుండా ఉంది. ఒక హార్బర్‌ ఏర్పాటుకు చేసే వ్యయంలో నాలుగో వంతుతో నియోజకవర్గానికి ఒక జెట్టీ నిర్మించవచ్చు. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసే జెట్టీల ద్వారా రాత్రి, పగలు తేడా లేకుండా వేటకు అవకాశం ఏర్పడుతుంది. జెట్టీల వద్ద కెరటాల తీవ్రత ఉండకపోవడంతో వేట తర్వాత అక్కడ పరికరాలు ఉంచడం..ఇక్కడి నుంచే వేటకు వెళ్లొచ్చు. తుపాన్లు, ఇతర వైపరీత్యాల సమయంలో పడవలు, వేట పరికరాల రక్షణకు అవకాశం ఉంటుంది.


కనీస వసతులు కరవు..

- కె.వెంకటరావు, అధ్యక్షుడు, ఏపీ వలస మత్స్యకారుల సంఘం

జిల్లాలో వేటకు అనువైన కనీస వసతులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో కూలీలుగా అదే పని చేస్తున్నాం. 25 రోజుల పాటు సముద్రంపై ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఏటా 70 మంది వరకు మత్స్యకారులు మృతి చెందుతున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తెచ్చే పరిస్థితీ లేదు. ప్రాణాలకు తెగించి వేట సాగిస్తున్నా వచ్చే ఆదాయంలో మత్స్యకారులకు 10 శాతం దక్కడం లేదు. పాలకులు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చక పోవడంతో మత్స్యకారులకు వలస బతుకులే శరణ్యంగా  మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని