logo

అన్న పాలనలో ‘సుజల’ సమాధి

ఉద్దానం కిడ్నీ ఇబ్బందుల నేపథ్యంలో తెదేపా హయాంలో రూ.కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజలధార యూనిట్లపై వైకాపా నిర్లక్ష్యం వహించింది. కిడ్నీ వ్యాధి గ్రస్థులకు శుద్ధ జలం అందించాలన్న బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేస్తే దానిని ప్రస్తుత పాలకులు తుంగలో తొక్కారు

Published : 09 May 2024 04:18 IST

నీరుగారిన బృహత్తర లక్ష్యం

కిడ్నీ వ్యాధిగ్రస్థులతో ఆడుకుంటున్న జగన్‌ సర్కార్‌

కాశీబుగ్గ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద కార్మికుల దాహార్తి తీరుస్తున్న ఎన్టీఆర్‌ సుజల ట్యాంకు

ఉద్దానం కిడ్నీ ఇబ్బందుల నేపథ్యంలో తెదేపా హయాంలో రూ.కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజలధార యూనిట్లపై వైకాపా నిర్లక్ష్యం వహించింది. కిడ్నీ వ్యాధి గ్రస్థులకు శుద్ధ జలం అందించాలన్న బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేస్తే దానిని ప్రస్తుత పాలకులు తుంగలో తొక్కారు. 2018లో రూ.9కోట్లతో కుప్పంలో నెలకొల్పాల్సిన ఈ ప్రాజెక్టును ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేస్తే.. వైకాపా ప్రభుత్వం దీనిని అలంకారప్రాయంగా మార్చేసింది.

-న్యూస్‌టుడే, ఇచ్చాపురం, కవిటిగ్రామీణం, సోంపేట, పలాస గ్రామీణం, పలాస, కంచిలి గ్రామీణం, వజ్రపుకొత్తూరు: అక్కడే ఎక్కువ
మరమ్మతులకు గురైన యూనిట్లు ఏళ్ల తరబడిగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు కలుషితనీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో 84 యూనిట్లు ఏర్పాటు చేయగా 38 మూలకు చేరాయి. కిడ్నీ బాధిత గ్రామాలు అధికంగా ఉన్న కవిటిమండలంలోనే యూనిట్లు పనికి రాకుండా పోయాయి. 38 గ్రామాల్లో ప్రారంభిస్తే 22 పాడయ్యాయి.

అంతంతే నీరు

మండలంలోని తోటూరు, మెట్టూరు, గుణుపల్లి, ఒంకులూరు, కొండపల్లి, ఎం.గడూరు, అక్కుపల్లి, గరుడభద్ర, ధర్మపురం, రాజాం, బాతుపురం, చినవంక, పల్లిసారధి, డోకులపాడు, వజ్రపుకొత్తూరు, హుకుంపేట, నువ్వలరేవులో రెండు ఎన్టీఆర్‌ శుద్ధజల ట్యాంకులు నిర్మించారు. మండలానికి గాను రిట్టపాడులో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నువ్వలరేవుతో పాటు గరుడభద్ర, ధర్మపురం, హుకుంపేట, తోటూరులో ట్యాంకులు మూలకు చేరాయి.
పలాస నియోజకవర్గంలో పలాస 1, మందస 1, వజ్రపుకొత్తూరు 1 చొప్పున మదర్‌ ప్లాంట్ల ద్వారా పలాసలో 16, మందసలో 16, వజ్రపుకొత్తూరులో 19 ప్రాంతాల్లో యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 12 వరకు పనిచేయడం లేదు. ఎన్టీఆర్‌ శుద్ధ జలం ప్రాజెక్టు 2018లో నారా లోకేష్‌ చేతుల మీదుగా పలాసలో ప్రారంభించగా నాటి నుంచి నేటి వరకు బిల్లులు చెల్లించలేదు. ఆసర్‌ ఏజెన్సీ ఈ కేంద్రాలను నిర్వహిస్తుండగా ఇప్పటివరకు రూ.5కోట్ల3లక్షల పైబడి ప్రభుత్వం నుంచి బకాయిలు ఈ ఏజెన్సీకి రావాల్సి ఉంది.

పెంచితే ప్రయోజనం

పురపాలక సంఘంలో ప్రతి ఏడాది వేసవిలో నీటిఎద్దడి అధికంగా ఉంటుంది. ప్రైవేటు నీటి కేంద్రాల వద్ద ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎన్టీఆర్‌ శుద్ధజల కేంద్రం వద్ద రూ.7కే క్యాను నీరు దొరుకుతుండటంతో అధికంగా వినియోగిస్తున్నారు. ప్రతీ వార్డులో ఒకటి చొప్పున పెడితే ఎంతోమందికి దాహం తీరుతుంది.


ఉప్పునీటినే వినియోగిస్తున్నాం

తీర ప్రాంత గ్రామం కావడంతో బోర్లు, బావుల్లో ఉప్పునీరే వస్తుంది. యూనిట్‌ మరమ్మతులు చేయకపోవడంతో ఉప్పునీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది.
- ఎస్‌.బాపనమ్మ, సి.హెచ్‌.గొల్లగండి


బోరు నీరే ఆధారం

కిడ్నీ ఇబ్బందులకు బోరు నీరే కారణమని తెలిసినా సుజలధార రాకపోవడంతో అదే నీరు తాగాల్సి వస్తుంది. మరమ్మతులకు గురైన తరువాత బాగుచేయించమని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.
-నీలాపు పార్వతి, సన్యాసిపుట్టుగ, ఇచ్చాపురం మండలం


ఏడాది దాటినా బాగుచేయలేదు..

మరమ్మతులకు గురై ఏడాది దాటింది. దీందో బోరునీటినే వేడి చేసుకొని తాగుతున్నాం. కిడ్నీ ఇబ్బందులకు మంచినీరే కారణమని అంతా అంటున్నారు. ప్రభుత్వం మాత్రం శుద్ధ జలం అందించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.

-దుక్క రాజమ్మ, నెలవంక, కవిటిమండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని