logo

మేము రాలేం.. మీరు వెళ్లండి..!

శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు.

Published : 10 May 2024 06:12 IST

ధర్మాన ప్రచారానికి జనాలు దూరం

గుజరాతీపేటలో స్థానికులు లేక వెలవెలబోతున్న ధర్మాన ప్రచారం

అరసవల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ నెల 7న గుజరాతీపేటలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ..‘ఇక్కడున్న నాయకత్వం నన్ను వదిలివెళ్లినా మీరంతా నా వెంటే ఉన్నారు’. అని మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అంధవరపు వరం కుటుంబసభ్యులను ఉద్దేశించి ప్రసగించారు. వాస్తవానికి ఆరోజు ప్రచారానికి స్థానిక నేతలు, అక్కడ ఉండే ప్రజలు పెద్దగా హాజరుకాలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా కనిపించారు. వరం కుటుంబం పార్టీని వీడిన నేపథ్యంలో ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాన్ని వారి వీధిలో పెట్టించి ఆర్భాటం చేయాలనుకున్న ప్రయత్నం స్థానికులు రాకపోవడంతో బెడిసికొట్టింది. ఇటీవల దండివీధి, మంగువారితోట, బలగ, ఆదివారంపేట, చిత్తరంజన్‌వీధి సమీపప్రాంతాలు, రామకృష్ణ థియేటర్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రచారాల్లోనూ స్థానికుల కంటే స్థానికేతరులు, రాజీనామాలు చేసిన వాలంటీర్లే పాల్గొనడం గమనార్హం.

ప్రణాళికాబద్ధంగా ఆర్భాటాలు..

ధర్మాన ప్రచారానికి అరగంట ముందు ఒక ఆటో పూలదండలు, శాలువాలతో ప్రత్యక్షమవుతుంది. కొందరు నాయకులు ఆ వీధిలోని ఇంటింటికి ఆటోలో వచ్చిన పూలదండలు, శాలువా, హారతి పట్టడానికి కర్పూరం అందజేస్తారు. మంత్రి ప్రచారానికి వచ్చిన వెంటనే అనుకున్నట్లు స్థానికులతో బలవంతంగా ఆర్భాటాలు చేయిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ఈ తతంగం చూసినవారంతా నవ్వుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లో ఇంత ఆదరణ తగ్గడానికి మంత్రి ధర్మాన వ్యవహార శైలే కారణమనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్మేగా ధర్మాన గెలిచిన తరువాత మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అలకబూని సామాన్యులను దగ్గరకు రానివ్వలేదని, ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని