logo

అధ్యక్షా.. ఆమదాలవలసకు ఏం చేశారు?

శాసనసభ సభాపతి అంటే ముఖ్యమంత్రి సైతం అధ్యక్షా అని పిలిచే పదవి. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో స్వలాభం పైనే ధ్యాస పెట్టారు..  అభివృద్ధి ఊసే మరిచిపోయారు.

Published : 10 May 2024 06:41 IST

పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలు
ఐదేళ్లూ స్వలాభంపైనే ధ్యాస
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం

శాసనసభ సభాపతి అంటే ముఖ్యమంత్రి సైతం అధ్యక్షా అని పిలిచే పదవి. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో స్వలాభం పైనే ధ్యాస పెట్టారు..  అభివృద్ధి ఊసే మరిచిపోయారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ప్రజలు, ముఖ్య అనుచరులు, మండల, గ్రామ స్థాయి నేతలు ఆయన వైఖరిని ఎండగట్టినా తీరు మార్చుకోలేదు. ఇదీ గౌరవనీయులైన తమ్మినేని సీతారాం గురించి ఆమదాలవలస వాసుల అభిప్రాయం. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు, అసంపూర్తి  పనులను పట్టించుకోవాలని మొర పెట్టుకున్నా దృష్టి సారించిన దాఖలాలు లేవు. స్పీకర్‌ తీరుతో విసిగిపోయిన ప్రజలు పాలనలో మార్పును ఆకాంక్షిస్తున్నారు.


హామీ: సరుబుజ్జిలి కూడలిలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి స్థానికులకు తాగునీరు అందిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: ట్యాంకు నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేసినా అడుగు ముందుకు పడలేదు. ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో కొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు సమగ్ర రక్షిత మంచినీటి పథకం నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించలేదు. ఈ పథకం నిర్మాణం చేపడితే ఇంటింటికీ తాగునీరు అందించేందుకు దోహదపడుతుంది.


కలగానే వంతెన నిర్మాణం..

బలసలరేవు వద్ద అసంపూర్తిగా ఇలా..

ఆమదాలవలస-సంతకవిటి మండలాల మధ్య వంతెన నిర్మాణానికి వైకాపా ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనులకు సభాపతి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. 40 శాతం పనులు చేపట్టాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు వెళ్లిపోయారు.


హామీ: ఆమదాలవలస పురపాలక సంఘంలో పైపులైన్లు వేయించి తాగునీరు అందిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: తెదేపా హయాంలో రూ.54 కోట్లు మంజూరయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక పైపులైన్లు వేయలేదు. ఆరు వార్డులకు తాగునీరు అందించలేకపోయారు. వారంలో రెండు రోజులే ట్యాంకర్‌ పంపుతుండటంతో నీరు దాచుకుని తాగుతున్నారు. చింతాడ గ్రామస్థులు పొలాల్లో బోరు నీటిని తాగడానికి తెచ్చుకుంటున్నారు. గేదెలవానిపేట గ్రామంలో బోరు నీరు తాగిన చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊసావానిపేటలో కుళాయిల వద్ద నీరు పట్టుకుని తెచ్చుకుంటున్నారు.


ఆమదాలవలస-శ్రీకాకుళం రహదారిని గాలికొదిలేశారు..

ఆమదాలవలస-శ్రీకాకుళం ప్రధాన రహదారిని నాలుగు వరుసలతో విస్తరించడానికి తెదేపా ప్రభుత్వం రూ.37 కోట్లు మంజూరు చేసింది. 25 శాతం పనులు జరిగాయి. ప్రభుత్వం మారిపోవడంతో మరలా టెండర్లు పిలిచి రూ.40 కోట్లు మంజూరు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ అదనంగా మరో రూ.18 కోట్లు కేటాయించినా పనులు నత్తనడకన సాగాయి. గుత్తేదారుకు సుమారు రూ.14 కోట్ల మేర బకాయిలు ఉండటంతో నాలుగేళ్లుగా నిలిచిపోయాయి. అధ్వానంగా మారిన రహదారిపై ప్రమాదాల బారిన పడి 24 మంది మృతి చెందారు. 84 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.  


కిలోమీటరు రోడ్డు వేయలేకపోయారు..

తొగరాం పంచాయతీ రహదారి దుస్థితి

ఆమదాలవలస మండలం తొగరాం కొత్తవలస నుంచి ఇసుకలపేట వరకు 1.4 కిలోమీటరు రహదారి నిర్మాణ పనులను తెదేపా హయాంలో రూ.90 లక్షలతో ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో రహదారి నిర్మాణానికి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ఆయా పనులను పూర్తి చేయకపోవడంపై తొగరాం పంచాయతీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొగరాం పంచాయతీకి సర్పంచిగా సభాపతి సతీమణి వాణిశ్రీ వ్యవహరిస్తున్నారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేసున్నారు. 2023లో ఆమదాలవలస మండలం కొత్తవలస నుంచి రాగోలు వరకు రూ.మూడు కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మాణానికి సభాపతి శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు.


చక్కెర కర్మాగారం

హామీ: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమదాలవలసలో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: చక్కెర కర్మాగారం తెరిపిస్తామని పలుమార్లు అధికారులను పంపి పరిశీలన చేపట్టారు. ఇక్కడి భూములు అమ్మేయాలని ప్రభుత్వం చూడగా షేర్‌ హోల్డర్లు కర్మాగారాన్ని తెరిపించాలని డిమాండ్‌ చేశారు. భూముల జోలికి వెళ్తే రైతులు ఆందోళన చేపడతారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించడంతో హామీని బుట్ట దాఖలు చేశారు. సభాపతి తీరుపై చెరకు రైతులు మండిపడుతున్నారు.


హామీ: పొందూరులో ఖాదీ దుస్తుల తయారీకి చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం.

ప్రస్తుత పరిస్థితి: వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత పొందూరులో నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. ఇక్కడ ఖాదీ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోలేదు. క్లస్టర్‌ ఏర్పాటు చేస్తే ఖాదీపై ఆధారపడిన వారికి ఉపయుక్తంగా ఉండేది. ప్రస్తుతం చాలా మంది ఇతర పనులకు వెళ్తున్నారు.


మినీ స్టేడియం పూర్తి చేయలేదు..

నేల మట్టం చేసిన స్టేడియం

కాంగ్రెస్‌ హయాంలో జగ్గుశాస్త్రులపేట వద్ద రూ.50 లక్షలతో ఆమదాలవలస మినీ స్టేడియం నిర్మాణం చేపట్టారు. వెయిట్‌ లిఫ్టింగ్‌, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడంతో చాలామంది ఉదయం, సాయంత్రం వచ్చి వినియోగించుకునేవారు. తెదేపా హయాంలో మరింత అభివృద్ధి చేసి ఎన్టీఆర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియంగా పేరు పెట్టి క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.కోటితో అభివృద్ధి చేస్తామని స్టేడియం భవనాన్ని నేలమట్టం చేశారు. ఇప్పటి వరకు పనులు చేపట్టకపోవడంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని