logo

భూ భక్షకులు

అయిదేళ్లపాటు అవినీతి లేని పాలన అందించామంటూ సీఎం జగన్‌, వైకాపా నాయకులు ప్రచారాల్లో గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో కొందరు  ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల దందాలు సాగించారు.

Published : 10 May 2024 06:50 IST

వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలే
జిల్లాలో పోటాపోటీగా ప్రభుత్వ స్థలాల కబ్జా
- ఈనాడు డిజిటల్‌,  శ్రీకాకుళం

అయిదేళ్లపాటు అవినీతి లేని పాలన అందించామంటూ సీఎం జగన్‌, వైకాపా నాయకులు ప్రచారాల్లో గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో కొందరు  ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల దందాలు సాగించారు. ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్లలో కొండలు, వాగుల పక్కన పాగా వేసి సొంతం చేసుకున్నారు. రాత్రికి రాత్రే చెరువులు, గెడ్డలు, ఆలయ, వివాదాస్పద భూములను కాజేశారు. దోపిడీలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.  వారి ఆగడాలపై ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించింది.. 

శ్రీకాకుళం నగరం  పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి


చెరువును కలిపేసుకున్నారు..

నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద సుసరాం చెరువుపై అధికార పార్టీ నాయకుడి కళ్లు  పడటంతో ఆక్రమణకు గురైంది. సర్వే సంఖ్య 394/1లో 14 ఎకరాలు ఉండగా ప్రస్తుతం  ఎనిమిది ఎకరాలకు కుచించుకుపోయింది. జాతీయ రహదారి విస్తరణలో కొంతమేర చెరువు స్థలం కోల్పోగా.. సుందరీకరణ పేరిట గట్టును ఆనుకుని ఉన్న ఆయన స్థలాన్ని కలుపుకొని ఆక్రమించారు. ఈ విషయమై 2022 జూన్‌ 15న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టినా చర్యలు తీసుకోలేదు.

నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద ఆక్రమణకు గురైన సుసరాం చెరువు


కొండను కొట్టి.. విక్రయానికి పెట్టి..

ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధి రత్తకన్న వద్ద పీర్లకొండ చుట్టూ ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. కొండ వెనుక సుమారు మూడు ఎకరాల్లో యంత్రాల సాయంతో చదును చేశారు. ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టగా కొందరు ఇళ్లు నిర్మించారు.  


అక్రమాలకు ప్రజాప్రతినిధి దన్ను

ఎచ్చెర్లకు చెందిన కీలక ప్రజాప్రతినిధి అండతో షేర్‌మహమ్మద్‌పురం వద్ద ట్రిపుల్‌ ఐటీ, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను ఆనుకొని ఎకరా రూ.2-3 కోట్ల విలువైన 12.5 ఎకరాలను వైకాపా నేతలు సాగు చేస్తున్నట్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు పత్రాలు సృష్టించారు. జిల్లా అసైన్డ్‌ కమిటీ ద్వారా పట్టాలు పొందడానికి పన్నాగం పన్నారు. గ్రామ సభ నిర్వహించకుండానే అధికార పార్టీ నేతలు, వారి బంధువుల బినామీ పేర్లతో దస్త్రాలు రూపొందించారు. అధికారుల సహకారంతో కొండపై చెట్లు తొలగించి చదును చేశారు.

  • ఫరీదుపేటలో జడ్పీ ఉన్నత పాఠశాలకు ఎదురుగా పంచాయతీ కార్యాలయాన్ని ఆనుకొని రూ.కోట్ల విలువైన స్థలాన్ని అధికార పార్టీ నేత ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. దీనిపై తెదేపా నేత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి.
  • కుశాలపురం పంచాయతీ పరిధిలో నరసమ్మ చెరువును ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించారు.

నేత అండతో చేశారు దందా..

టËెక్కలిలో జిల్లా ఆసుపత్రి, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం మధ్యలో భూమిలో ఆక్రమణదారులు పాగా వేశారు. జగతిమెట్ట జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వం సేకరించిన భూమి ఆక్రమణకు గురవుతోంది. కోటబొమ్మాళి మండలం కుజ్జిపేటలో కొందరు చెరువును ఆక్రమించగా మాజీ సైనికుడొకరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి మండలం ఎస్‌బీ కొత్తూరులోని సర్వే నంబరు 75లో రెవెన్యూ, అటవీ శాఖకు చెందిన 35 ఎకరాల భూమిని అధికార పార్టీ నేత అండతో ఏడుగురు ఆక్రమించి రొయ్యల చెరువులు నిర్మించారు. సబ్‌ కలెక్టర్‌ పరిశీలించినా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేశారు.  


కాలువ కనుమరుగు..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి సూదికొండ, నెమలికొండల నుంచి ఎర్రచెరువు వరకు ఉన్న కాలువ కిలోమీటరు మేర ఉంటుంది. వైకాపా పాలనలో సుమారు ఐదున్నర ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. కాలువ మొత్తం కనుమరుగు కాగా భవన నిర్మాణాలు దర్శనమిస్తాయి. ఐదేళ్లలో సుమారు రూ.ఐదు కోట్ల విలువ చేసే భూముల క్రయవిక్రయాలు జరిగాయి.


దళితుల  భూమికి ఎసరు..

రణస్థలం మండలం బంటుపల్లి రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకొని రూ.కోట్ల విలువైన భూములను అధికార పార్టీ పెద్దలు చేజిక్కించుకోవాలని పన్నాగం వేశారు. దశాబ్దాల కిందట ఆప్పటి ప్రభుత్వం దళితులు, ఇతర వర్గాలకు చెందిన పేదలకు ల్యాండ్‌ సీలింగ్‌ కింద సర్వే నంబరు 236లో 62.91 ఎకరాల భూమిని     63 కుటుంబాలకు పంపిణీ చేసింది. సాగు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వైకాపా నేతలు కీలక ప్రజాప్రతినిధికి ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున అందజేసి దళితుల నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని సమాచారం.


ప్రభుత్వ స్థలంలో భారీ భవన నిర్మాణం

ఇచ్ఛాపురం పట్టణ పరిధి రత్తకన్న వద్ద పీర్లకొండను చదును చేసి నిర్మాణానికి సిద్ధం చేసిన స్థలం

శ్రీకాకుళం నగరం పొట్టి శ్రీరాములు కూడలిలో 2.14 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ మంత్రి, మరో నేత కాజేసి వాటాలు వేసుకున్నారు. ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం భారీ భవన నిర్మాణం చేపట్టారు. కిల్లిపాలెం వద్ద నది స్థలాన్ని ఆ నేత ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌ వేశారు. శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించి కార్యకర్తలకు పంపకాలు చేపట్టారు.


ఆమె మాటే శాసనం..  

ఆమదాలవలస పట్టణ పరిధి పాలబంద చెరువు సర్వే నంబరు 129లో 5.21 ఎకరాల మేర స్థలం ఉంది. కీలక ప్రజాప్రతినిధి భార్య అండతో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు రేకులతో తయారు చేసిన ఏడు బడ్డీ దుకాణాలు ఏర్పాటు చేశారు. పశువుల పాకలు, కారు షెడ్లు ఏర్పాటు చేసి చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట చెరువులో మట్టి వేసి చదును చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి చెరువు కనుమరుగు కావడం ఖాయం. చక్కెర కర్మాగారానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించారు. మోనింగి వారి వీధి సమీపంలోని కనకాద్రి చెరువు ఏడెకరాలు ఆక్రమణలతో కనుమరుగైంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొంత భూమిని ఆక్రమించి భవనాలు, పశువుల పాకలు, మరుగుదొడ్లు నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు