logo

పట్టణాలు మురిసేలా నిధులు!

పట్టణాల్లో సుస్థిర అభివృద్ధి చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు వేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పట్టణ ప్రణాళిక చట్టాలకు అనుగుణంగా పట్టణాలు, నగరాలు మారాలని అనుకుంటోంది.

Updated : 03 Feb 2023 05:31 IST

రాష్ట్రాలకు సహకారంగా  కేంద్రం ప్రత్యేక ఏర్పాటు
బడ్జెట్ ప్రకటనకు ముందే ఆదర్శంగా తమిళనాడు

పట్టణాల్లో సుస్థిర అభివృద్ధి చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు వేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పట్టణ ప్రణాళిక చట్టాలకు అనుగుణంగా పట్టణాలు, నగరాలు మారాలని అనుకుంటోంది. ఆ ప్రణాళికల్ని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే అమలుచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. చెన్నై శివారు ప్రాంతాలు, రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఈ తరహా ఆలోచనలతో ముందుకెళ్తోంది.

అభివృద్ధి అన్నిచోట్లా..

* చెన్నైతోపాటు తమిళనాడు జిల్లాల్లో ద్వితీయశ్రేణి నగరాల్ని చట్టాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రత్యేకించి రెండేళ్లలో ఈ ప్రయత్నం ఊపందుకుంది.
*  కీలకమైన ల్యాండ్‌పూలింగ్‌ విధానం, భారీ శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం, రవాణాలో సులభతర ప్రజాపయోగ సౌకర్యాలు లాంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. మౌలిక వసతుల వృద్ధి, వివిధ రంగాల్లో అవకాశాలు పెరిగేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు.
* నగరాల్లో సుస్థిర అభివృద్ధి కొనసాగాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుబాటులో ఉన్న భూముల్ని ఎంత క్రమశిక్షణగా వినియోగిస్తే భవిష్యత్తు అంత బాగుంటుందనేది ఒక ప్రమాణంగా ఉంది. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు భూకేటాయింపుల ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.
* తాజా బడ్జెట్ ప్రకారం పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనపరంగా కూడా నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో చేపట్టే పలు కార్యక్రమాలకు రూ.583.37 కోట్లు ప్రకటించినట్లుగా ఒక అంచనా ఉంది.

చెన్నై టౌన్‌షిప్‌లు

రాష్ట్రంలో టౌన్‌షిప్‌ల నిర్మాణాలకూ ప్రణాళికలు రచిస్తున్నారు. చెన్నై శివారులో 6 కొత్త టౌన్‌షిప్‌లను తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో మీంజూరు, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, మామల్లాపురం, తిరుమళిసై ఉన్నాయి. తిరుమళిసై టౌన్‌షిప్‌కు 15వ ఆర్థిక కమిషన్‌లో భాగంగా రూ.1000కోట్లు కేటాయించారు. ఈసీˆఆర్‌లోని మామల్లాపురం సమీపంలో కొత్త టౌన్‌షిప్‌ వస్తుందన్న విషయాన్ని ఈ మధ్యే గవర్నర్‌ రవి తన అసెంబ్లీ ప్రసంగంలో చెప్పారు.

నిటారుగా నిర్మాణాలు..

నగరాల్లో స్థలాల కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని విస్తారంగా కాకుండా.. నిటారుగా ఆకాశహార్మ్యాల తరహాలో ఉండేలా చేయాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. ఇందుకు తగ్గట్లు ప్రణాళికలు కూడా పూర్తిచేసింది. ఇక్కడి గృహాల్లో నివసించే జనాభాకు తగ్గట్లు టౌన్‌షిప్‌ ఆవరణలో, బయట ట్రాఫిక్‌ నిర్వహణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్బందుల తొలగింపు తదితరాల్ని పరిశీలిస్తున్నారు. పట్టణాభివృద్ధి నేపథ్యంలో పనిచేసిన సీˆనియర్‌ ఐఏఎస్‌ అధికారుల అభిప్రాయాల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది.
పట్టణాల్లో కనీస సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా నిధులిచ్చింది. రూ.10 వేల కోట్లతో ‘పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి’ని తెస్తూ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రాల్లో పట్టణీకరణ, నగరీకరణలో చేపట్టే సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలకు కేంద్రం ప్రోత్సహించనుంది. బడ్జెట్లో ప్రకటించిన   సంస్కరణల్ని తమిళనాడు ముందునుంచే ప్రణాళికల్లో ఉంచడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈనాడు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని