logo

ఐఐటీఎం ఆచార్యుడికి ‘ఎన్‌ఏఈ’ సభ్యత్వం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం) ఆచార్యులు ఆర్‌ఐ సుజిత్‌ ‘యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’ (ఎన్‌ఏఈ)కి అంతర్జాతీయ సభ్యుడు (ఇంటర్నేషనల్‌ మెంబర్‌)గా ఎంపికయ్యారు.

Published : 14 Feb 2023 01:13 IST

సుజిత్‌

చెన్నై (వడపళని), న్యూస్‌టుడే: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీఎం) ఆచార్యులు ఆర్‌ఐ సుజిత్‌ ‘యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’ (ఎన్‌ఏఈ)కి అంతర్జాతీయ సభ్యుడు (ఇంటర్నేషనల్‌ మెంబర్‌)గా ఎంపికయ్యారు. ఇంజినీరింగులో అప్లికేషన్స్‌ ఆఫ్‌ డైనమికల్‌ సిస్టమ్స్‌ థియరీ అర్థం చేసుకోవడం, ఇంజినీరింగ్‌ సిస్టమ్స్‌ నిర్వహణలో అందించిన సేవలకు గుర్తుగా ఆయనకు సభ్యత్వం లభించినట్లు ఐఐటీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయంగా ఎంపికైన 18 మందిలో ఆయన ఒకరు. ప్రస్తుతం సుజిత్‌.. ఐఐటీలోని ఏరోస్పేస్‌ ఇంజినీరింగు విభాగంలో ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా సుజిత్‌ను గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ డీన్‌ ఆచార్యులు రఘునాథన్‌ రంగస్వామి ప్రత్యేకంగా అభినందించారు. 2003 - 07 వరకు విక్రమ్‌ సారాబాయ్‌ అంతరిక్ష కేంద్రంలో డైరెక్టరుగా పనిచేసిన డాక్టర్‌ బీఎన్‌ సురేష్‌ ఎన్‌ఏఈ సభ్యత్వం పొందారు. ఆ తర్వాత ఎంపికైన రెండో వ్యక్తి సుజిత్‌ కావడం గమనార్హం. 1988లో ఐఐటీ మద్రాస్‌లో ఏరో స్పేస్‌ ఇంజినీరింగులో డిగ్రీ పూర్తి చేసిన ఈయన 1990లో ఎంఎస్‌ చేశారు. యూఎస్‌ఏ అట్లాంటాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 1994లో పీహెచ్‌డీ పట్టా పొందారు. కంబస్టన్‌ ఎక్స్‌పర్ట్‌, ప్రిన్స్‌టన్‌ ఆచార్యులు సీకే లా, ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఆచార్యులు చెన్నుపత్తి జగదీశ్‌, నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ సైన్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఏసీ) డివిజన్‌ డైరెక్టరు, వర్జీనియా వర్సిటీ బయోకాంప్లెక్సిటీ ఆచార్యులు మాధవ్‌ మరతే, పలు విభాగాల పరిశోధకులు సుజిత్‌కు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని