logo

దగ్గు సిరప్‌తో కొవిడ్‌ నియంత్రణ సాధ్యం

కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గిందన్న ఊరట కాస్త ఉన్నా.. అది మళ్లీ ఏదో ఒకవిధంగా ముంచుకొస్తుందేమోనన్న భయాలు మాత్రం జనాల్లో ఉన్నాయి. ఈ వైరస్‌ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.

Updated : 21 Feb 2023 08:51 IST

ప్రతిపాదించిన 3 వర్సిటీల పరిశోధకులు
ఊపిరితిత్తుల రక్షణకు వ్యాక్సినేషన్‌ మంచిదని వెల్లడి

ఈనాడు-చెన్నై: కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గిందన్న ఊరట కాస్త ఉన్నా.. అది మళ్లీ ఏదో ఒకవిధంగా ముంచుకొస్తుందేమోనన్న భయాలు మాత్రం జనాల్లో ఉన్నాయి. ఈ వైరస్‌ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌ కూడా విభిన్న కోణాల్లో పరిశోధన చేస్తోంది. కొవిడ్‌ వైరస్‌ తీవ్రతను దగ్గు సిరప్‌ ద్వారా, ఎక్స్‌పెక్టోరంట్్స మందుల ద్వారా తగ్గించొచ్చని వారు ప్రతిపాదిస్తున్నారు. జాదవ్‌పూర్‌, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీల పరిశోధకులతో కలిసి జరిపిన పరిశోధనలో ఈ విషయాల్ని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన డీన్‌, అప్లైడ్‌ మెకానిక్స్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ మహష్‌ పంచగ్నుల, జాదవ్‌పూర్‌ వర్సిటీ న్యూక్లియర్‌ స్టడీస్‌ అండ్‌ అప్లికేషన్‌ విభాగానికి చెందిన సహాయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరణ్యక్‌ చక్రవర్తి, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ నీలేష్‌ ఎ.పటంకర్‌ ఈ పరిశోధన బృందంలో ఉన్నారు. కొవిడ్‌-19 వైరస్‌ ముక్కు, గొంతు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే విధానాలపై వీరు పరిశోధించారు. తద్వారా వ్యాధి తీవ్రత ఎలా మారుతోందన్నదానిపై, ఆ తర్వాత ఆ తీవ్రతను ఎలా నియంత్రించొచ్చన్న దానిపై గణితశాస్త్ర నమూనాల్ని ఉపయోగించి ఒక అవగాహనకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్ని బట్టి.. మ్యూకస్‌ ద్వారా వైరస్‌ కదులుతూ శ్వాసనాళాల్లోకి వెళ్తోందని, ఈ వైరస్‌ రక్తం ద్వారా ఊపరితిత్తుల లోతుల్లోకి చేరుతోందని చెబుతున్నారు. వీటిని సైతం తాజా పరిశోధనలో పరిగణలోకి తీసుకున్నారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్‌ మహష్‌ పంచగ్నుల మాట్లాడుతూ.. ‘కొవిడ్‌-19 మొదటి లక్షణం బయటపడిన తర్వాత రెండున్నర నుంచి ఏడు రోజుల్లో అది నియోనియా, ఇతర ఊపిరితిత్తుల సంబంధ ఇబ్బందులకు దారితీస్తోంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన మ్యూకస్‌ తుంపర్లు ముక్కు, గొంతుద్వారా ఊపిరితిత్తులకు వెళ్లినప్పుడు ఇది సంభవిస్తోంది. మ్యూకస్‌ తుంపర్లను ఆదిలోనే తగ్గించగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నాం. దగ్గు సిరప్‌, ఎక్స్‌పెక్టోరంట్్స మందుల ద్వారా తుంపర్లను నియంత్రించవచ్చని ప్రతిపాదిస్తున్నాం. పైగా ఈ ప్రక్రియ గాలిలో కలిసే స్వీయ ఎరోసోలైజ్డ్‌ బిందువులు వచ్చే మూలాల్ని కూడా నియంత్రించవచ్చు’ అని ఆయన అన్నారు. ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదల, వ్యాధి తీవ్రత అనేది రోగిలోని ఇమ్యూన్‌ స్పందన మీద ఆధారపడి ఉంటుందని మరో పరిశోధకులు డాక్టర్‌ అరణ్యక్‌ చక్రవర్తి అంటున్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైన మ్యూకస్‌ తుంపర్లు ముక్కు, గొంతు నుంచి ఊపిరితిత్తుల లోపలి భాగాల్లోకి వెళ్లకుండా మందుల ద్వారా నియంత్రించవచ్చని, నిమోనియా ఇతర ఊపిరితిత్తుల సంబంధ వ్యాధుల్ని వ్యాక్సినేషన్‌ ద్వారా నియంత్రించవచ్చని ఈ పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని