logo

పాల కల్తీని గుర్తించేందుకు పరికరం

పాలల్లో ఉండే కల్తీని 30 సెకన్లలో గుర్తించేందుకు పరికరాన్ని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - మద్రాస్‌’ (ఐఐటీఎం) పరిశోధకులు అభివృద్ధి చేశారు. 3డీ కాగిత ఆధారంతో పొందికైన డిజైన్‌తో కూడిన పరికరంతో ఇళ్లలో కూడా పరీక్షలు చేసుకునే వీలుందని సోమవారం ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది

Published : 28 Mar 2023 01:47 IST

అభివృద్ధి చేసిన ఐఐటీఎం పరిశోధక బృందం

కల్తీ పాలను గుర్తించే పరికరం

వడపళని, న్యూస్‌టుడే: పాలల్లో ఉండే కల్తీని 30 సెకన్లలో గుర్తించేందుకు పరికరాన్ని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - మద్రాస్‌’ (ఐఐటీఎం) పరిశోధకులు అభివృద్ధి చేశారు. 3డీ కాగిత ఆధారంతో పొందికైన డిజైన్‌తో కూడిన పరికరంతో ఇళ్లలో కూడా పరీక్షలు చేసుకునే వీలుందని సోమవారం ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. యూరియా, డిటర్జెంట్లు, సబ్బు, గంజి, హైడ్రోజన్‌ పెరాక్సైడు, సోడియం హైడ్రోజన్‌ కార్బొనేట్‌, ఉప్పు వంటి కల్తీతో కూడిన పాలను పరికరం గుర్తించగలదు. పాలతో పాటు నీళ్లు, తాజా పళ్లరసాలు, మిల్క్‌ షేక్స్‌ వంటి ఇతర ద్రవాలలో కూడా కల్తీని గుర్తించేందుకు పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఐఐటీ మెకానికల్‌ ఇంజినీరింగు విభాగ అసోసియేట్‌ ఆచార్యులు, డాక్టర్‌ పల్లబ్‌ సిన్హా మహాపాత్ర ఆధ్వర్యంలోని రీసెర్చి స్కాలర్లు సుభాషిస్‌ పటారి, డాక్టర్‌ ప్రియాంకన్‌ దత్త పరిశోధనలు చేశారు. ప్రముఖ సమీక్షా పత్రిక ‘నేచర్‌’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసానికి సుభాషిస్‌ పటారి, ప్రియాంకన్‌ దత్త సహ రచయితలుగా వ్యవహరించారు. డాక్టర్‌ పల్లబ్‌ సిన్హా మహాపాత్ర మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన శైలికి దారి తీసే ముఖ్యమైన ఆహారాలలో పాలు ఒకటన్నారు.  కల్తీ పాల వినియోగం వల్ల మూత్రపిండాల సమస్యలు, శిశు మరణాలు, ఉదర సమస్యలు, అతిసారంతో పాటు క్యాన్సర్‌ వంటి వైద్య సమస్యలు కూడా ప్రబలే అవకాశాలున్నాయని పల్లబ్‌ సిన్హా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని