logo

మారిన యువత అభిరుచి

ఇండీడ్‌ సంస్థ తాజాగా ఓ సర్వే నివేదికను విడుదల చేసింది. 2020 మే నుంచి 2023 మే వరకు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఈ సర్వే జరిగింది.

Published : 08 Jul 2023 03:18 IST

ఫుడ్‌ డెలివరీ ఉద్యోగాలకు ఆదరణ
దేశంలోనే మొదటిస్థానంలో చెన్నై

సెల్‌ఫోన్‌ తీసుకుని.. యాప్‌పై క్లిక్‌ చేసి.. అలా ఆర్డర్‌ ఇవ్వగానే.. ఇలా కొన్ని నిమిషాల్లోనే రుచికరమైన వంటకాలు ఇంటికొచ్చేస్తున్నాయి. ఇలా రోజుకు వేలాది ఆర్డర్లు.. ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కొనుగోలు చేసే ఒరవడి చెన్నై నగరంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ రంగంవైపు మొగ్గి ఉద్యోగాలు చేసేవారి సంఖ్య ఎక్కువైంది. తాజా సర్వేలోనూ ఇదే వెల్లడైంది. దేశంలోనే ఇప్పుడు చెన్నై నగరం ఈ రంగంలో దూసుకెళ్తుందనే చెప్పాలి.

ఈనాడు-చెన్నై: ఇండీడ్‌ సంస్థ తాజాగా ఓ సర్వే నివేదికను విడుదల చేసింది. 2020 మే నుంచి 2023 మే వరకు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఈ సర్వే జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే.. దేశంలోని నగరాల్లో ఏ ఉద్యోగాలకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది, ఎటువైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు, ఎందుకు ఆ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు అనే కోణంలో సర్వే కొనసాగింది. గత మూడేళ్లలో ఉద్యోగాల ఒరవడులు ఎలా ఉన్నాయనే వివరాలు సేకరించింది. ఇందులో తేలిందేంటంటే.. ప్రత్యేకించి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, చెఫ్‌లు, కాల్‌సెంటర్‌ ఉద్యోగాల్లో చేరేవారి సంఖ్య చెన్నైలో పెరిగిందని తెలిసింది. దీంతో భారతీయ మార్కెట్‌లో ఉద్యోగాల కల్పనపరంగా ఈ నగరం బాగా ముందున్నట్లు ప్రకటించారు.

వెనుక వరుసలో పెద్ద నగరాలు

చెన్నై మహానగరంలో ఆహారప్రియలు బాగా పెరిగారు. దీంతో డెలివరీల వేగం పెరిగింది. ఆర్డర్లూ హెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల అవసరం బాగా పెరిగింది. ఇందులో చేరేవారి సంఖ్య నగరంలో విపరీతంగా పెరిగినట్లుగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాల్లో చేరేవారిని చూస్తే ఏకంగా 12 శాతం ఉద్యోగాలు ఒక్క చెన్నై నుంచే ఉన్నాయని ప్రకటించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. దిగ్గజ నగరాలుగా పేరుగాంచిన ముంబయి, బెంగళూరు నగరాల్ని సైతం ఈ రంగం ఉద్యోగాల్లో చెన్నై వెనక్కి నెట్టిందని తెలిపారు. ఫుడ్‌ డెలివరీ వ్యవస్థ ఇక్కడ అంత ప్రభావమంతంగా పనిచేస్తోందని వివరాల్ని ప్రకటించారు. పనిచేసేవారిలోనూ పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ చేసేవారు బాగా పెరిగారు.

వంటకూ పోటీ

నగరంలో ఫుడ్‌ డెలివరీ రంగానికి విపరీత డిమాండ్‌ ఏర్పడినట్లుగా సర్వేలో తేలింది. వెబ్‌సైట్, యాప్‌ లాంటి ఈ-కామర్స్‌ మాధ్యమాల ద్వారా ఆహార ఆర్డర్లు పెరగడంతో హోటళ్లకూ అంతకంతకూ డిమాండ్‌ పెరుగుతోంది. చాలా హోటళ్లు విస్తరణకు వెళ్లాయి. దీంతో వంట చేసేవారి అవసరం బాగా పెరిగింది. ప్రత్యేకించి నైపుణ్యాలున్నవారివైపే మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడింది. దీంతో చెఫ్‌లు, ప్రత్యేక సర్టిఫికెట్లతో కోర్సులుచేసినవారిని ఉద్యోగాల్లో తీసుకున్నారు. ఇటువైపు వచ్చేవారి సంఖ్య గతంకంటే బాగా మెరుగైందని నివేదికలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తరహా ఉద్యోగాల్లో చెన్నై వాటా 7 శాతంగా ఉందని సర్వేలో తేలింది.

కీలకంగా కాల్‌సెంటర్లు

ఇప్పటికే వాణిజ్య, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దిగ్గజ కంపెనీలు చెన్నైలో ఉన్నాయి. ఆయా సంస్థల్లో ఫిర్యాదుల పరిష్కారానికి, వినియోగదారులకు సరైన అవగాహన కల్పించడానికి కాల్‌సెంటర్లు వేదికగా మారుతున్నాయి. మరోవైపు ఫుడ్‌ డెలివరీ రంగం పుంజుకోవడంతో సమస్యలూ అంతకంతకు పెరిగాయి. చాలామంది నుంచి ఫిర్యాదులు వస్తుంటడంతో కాల్‌సెంటర్‌ ఉద్యోగాలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా చెన్నైలోనే 8 శాతం ఉద్యోగాలు అవసరమయ్యాయి. ఇప్పటికీ డిమాండ్‌ ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. ఇతర రంగాలతో పోల్చితే.. సులువుగా ఉద్యోగాలు దొరికే ఈ రంగంపై ఎక్కువగా దృష్టి సారించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని