logo

మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు

మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది.

Published : 28 Mar 2024 00:22 IST

పనగల్‌పార్కు వద్ద పనులు

వడపళని, న్యూస్‌టుడే: మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. రెండోదశ మార్గంలోని స్టేషన్లలో దుకాణాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.

30 స్టేషన్లు..

రెండోదశ 3, 5 మార్గాల్లో భూగర్భమార్గంలో 30స్టేషన్లు రానున్నాయి. రిటైల్‌ దుకాణాలు, ఫలహారశాలలు తెరిచేందుకు వీలుగా నిర్మాణం జరుగుతోంది. ఆలందూరు, తిరుమంగళంలాంటి స్టేషన్ల నుంచి ఇంటర్‌ ఛేంజ్‌ అయ్యేందుకు సమగ్ర నివేదిక తయారు చేయడానికి టెండర్లు కూడా ఆహ్వానించింది. మాధవరం హైరోడ్డు, అయనావరం, పురసైవాక్కం, చేట్పేట్, స్టెర్లింగు రోడ్డు, నుంగంబాక్కం, రాయపేట, డాక్టర్‌ రాధాకృష్ణన్‌ సాలై, తిరుమయిలై, అడయార్‌ డిపో, బోట్ క్లబ్బు, నందనం, గాంధీనగర్‌, కాట్టుపాక్కం, ఆలపాక్కం, ఓఎమ్మార్‌లోని షోలింగనల్లూరు, కారపాక్కం పెరుంగుడి తదితర 28 స్టేషన్లలో 7.5 లక్షల చదరపు అడుగుల మేర వాణిజ్య అవసరాలకు స్థలం ఉంది. ఈ స్టేషన్లలో రిటైల్‌ దుకాణాలు, ఫలహారశాలలు ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతోంది. తిరుమంగళంలో 12 అంతస్తులతో కూడిన వాణిజ్య భవనం నిర్మాణం కానుంది. ఈ భవంతిలో మూడో అంతస్తులో మెట్రో రైలు ఆగి వెళ్లేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రవేశ, బయటికి వెళ్లే మార్గాల్లో దుకాణాల ఏర్పాటుకు సమగ్ర నివేదిక తయారు చేసేందుకు స్థల ఎంపిక కూడా జరిగిందని, జికా సంస్థ నుంచి నిధులందనున్నాయని టెండరు సంస్థ పేర్కొంది.

52 కి.మీ. వరకు..

రెండోదశలో నిర్మాణం జరగనున్న 116.1 కి.మీ.లలో 52 కి.మీ. వరకు జికా సంస్థ నిధులు అందిస్తోంది. ఇందులో 3, 5 మార్గాలు కూడా ఉంటాయి. అన్నిచోట్ల పార్కింగ్‌కు ఎక్కువ స్థలం కేటాయించడం అంతగా సాధ్యపడదంటున్నారు. ఉన్న స్థలానికి అనుగుణంగా చిన్న దుకాణాల నిర్మాణం జరుగుతుందని సీఎంఆర్‌ఎల్‌ అధికారి ఒకరన్నారు. కోయంబేడులోని 31 ఎకరాల స్థలంలో చేయాల్సిన పనులకు, థౌజండ్‌లైట్స్‌లో జరగాల్సిన పనులకు సమగ్ర నివేదికకు టెండర్లు ఆహ్వానించింది.

రాయపేట ప్రాంతంలో..

ఆరు నెలల్లో..

నగరవ్యాప్తంగా భూగర్భ పనులు కూడా దశలవారీగా ప్రారంభమయ్యాయి. రాయపేట, రాధాకృష్ణన్‌ సాలైలో వాహనాల రాకపోకలు బాగా ఉన్నందున పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కావడానికి ఆరు నెలలు పడుతుందని సైట్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. వెస్ట్‌కాట్ రోడ్డు, పీటర్స్‌ రోడ్డు నుంచి అధికసంఖ్యలో వాహనాల రాకపోకలుండటంతో పనులు సవాల్‌తో కూడుకున్నట్లు చెప్పారు. గోతులు తవ్వేందుకు యంత్రాన్ని లోపలికి దించేందుకు కావాల్సిన పనులు తుదిదశకు చేరుకుంటున్నాయని, టీబీఎం యార్డులో సిద్ధంగా ఉందని, రాయపేటలో భూగర్భ మార్గం పనులు జరగటానికి ఆరు నెలలు అవుతుందని సైట్ ఇంజినీరు అన్నారు. మాధవరం, అయనావరం, చేట్పేట్, గ్రీన్‌వేస్‌ రోడ్డు ప్రాంతాల్లో ప్రస్తుతం భూగర్భ పనులు నడుస్తున్నాయి.

వైఎంసీఏ మైదానం వద్ద..

రాయపేట ఆసుపత్రి సమీపంలోని వైఎంసీఏ మైదానానికి కింద రాయపేట స్టేషన్‌ నిర్మాణం జరగనుంది. ఇక్కడ గోడల నిర్మాణం కాస్త కష్టంతో కూడుకుంది. ట్రాఫిక్‌ దారి మళ్లించి పనులు చేస్తున్నారు. స్టేషను ప్రహరీలకు కావాల్సిన పని పూర్తయిన తర్వాత టన్నల్‌ బోరింగ్‌ మెషన్‌(టీబీఎం) రంగంలోకి దింపుతారు. నిర్మాణానికి ముందుగా ఈ ప్రాంతంలో భవనాల పరిస్థితులను అధికారులు పరిశీలించగా 26 భవంతులకు సమస్యలున్నట్లు గుర్తించారు.

పనగల్‌ పార్కు-కోడంబాక్కం భూగర్భ పనులు ఏప్రిల్‌లో

పనగల్‌ పార్కు నుంచి కోడంబాక్కం వరకు భూగర్భ పనులు రెండో టీబీఎంతో ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయి. ప్రతిపాదిత ప్రాంత అంగీకార పరీక్షలు మార్చిలో జరుగుతాయి. మొదటి బోరింగ్‌ యంత్రం ‘పెలికాన్‌’ జనవరి 31 నుంచి కోడంబాక్కం వరకు పనులు ప్రారంభించింది.  1.2 కి.మీ. దూరానికి 30 మీటర్ల వరకు తవ్వకం పనులు జరుగుతాయి. మొదటి యంత్రంతో 40 మీటర్ల దూరం వరకు పని జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని