logo

జూన్‌లో కొత్త రోడ్లు

కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్‌ నాటికి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

Published : 25 Apr 2024 00:18 IST

సిద్ధమవుతున్న కార్పొరేషన్‌

వడపళని, న్యూస్‌టుడే: కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్‌ నాటికి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నగరపుర సాలై మేమ్‌పట్టు తిట్టం(ఎన్‌ఎస్‌ఎంటీ), తమిళనాడు అర్బన్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ (టీయూఆర్‌ఐపీˆ) పథకం కింద కార్పొరేషన్‌కు రూ.250 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటితో 36 బస్సు రూట్లు, నగరంలోని 1,200 అంతర్గగ వీధుల్లో నూతనంగా నిర్మించనున్నట్లు చీఫ్‌ ఇంజినీరు ఎస్‌.రాజేంద్రన్‌ అన్నారు. జూన్‌లో మొదలయ్యే రోడ్ల నిర్మాణం రుతు పవనాలు ప్రవేశించేవరకు జరుగుతుందన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం మేరకు రోడ్లు వేసేందుకు పనులు ప్రారంభించిన తర్వాత గుత్తేదారు జాప్యం చేస్తే రోజుకు రూ.5 వేలు జరిమానా విధిస్తామని చెప్పారు. కార్పొరేషన్‌ సేకరించిన వివరాల మేరకు తండియార్‌పేట జోన్‌లో 153 రోడ్లు, అన్నానగర్‌లో 133, వలసరవాక్కంలో 111, అడయార్‌లో 108 రోడ్లలో కొత్తగా వేయనున్నారు. రూ.50 కోట్లు బస్సు రూట్లకు, రూ.200 కోట్లు అంతర్గత రోడ్లకు వినియోగించనున్నామని రాజేంద్రన్‌ చెప్పారు. గతంలో కొత్తగా రోడ్లు వేసేందుకు తగినన్ని నిధులు అందలేదు. పాడైపోయిన వాటికి మరమ్మతులు చేసి కొత్తగా వేయడానికి రూ.1,700 కోట్ల మేరకు కార్పొరేషన్‌కు కావాల్సి ఉంది. దెబ్బతిన్న దారులు నగరవ్యాప్తంగా 5 వేల వరకున్నాయి. ఆరేడేళ్లుగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని, తొలుత వాటిపై దృష్టి సారించాలని పలువురు గృహవాసులు డిమాండు చేస్తున్నారు. ఓల్డ్‌ వాషర్‌మెన్‌పేటలోని మేయర్‌ బసుదేవ్‌ వీధి, రామానుజం వీధి, మాయప్పన్‌ వీధి, మింట్ సుబ్బురాయులు వీధి తదితర చోట్ల కొత్తగా రోడ్లు వేసి పదేళ్లయిందని స్థానికుడు ఆర్‌.రమేష్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని