logo

చర్చనీయంగా ఏ.ఆర్‌.రెహమాన్‌ పోస్టు

దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ తన ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు.

Published : 07 May 2024 00:10 IST

చెన్నై: దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ తన ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు. కొందరు అభ్యాసకుల వ్యాఖ్యలూ మధురమే అంటూ దానికి వ్యాఖ్యను జోడించారు. ఆ వీడియోలో ‘అన్నీ నేర్చుకున్నామంటూ ఎవరూ తమను తామే గొప్పగా భావించకూడదు. అంత పెద్ద సూర్యుడి నుంచి చేతిలోని గొడుగు కాపాడి నీడ ఇస్తుంది. అలాగే ఎక్కువగా చదువుకున్నవారికీ తక్కువ చదువుకున్న వారూ ఇరుసుగా ఉంటారు. లేకుంటే బండి నడవదు’ అనే పాట చరణాలనూ ఉటంకిస్తూ కుమరిముత్తు మాట్లాడారు. ఈ వీడియోను ఏ.ఆర్‌.రెహమాన్‌ పోస్టు చేయడంపై నెటిజన్లు పలు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తన పాటలకు హక్కులు కోరుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టును ఆశ్రయించడాన్ని ఉటంకిస్తూ ఈ వీడియో పోస్టు చేసినట్టు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.\\


కృతజ్ఞతలు తెలిపిన త్రిష

త్రిష పోస్టు చేసిన ఫొటో

చెన్నై: నటి త్రిష 41వ జన్మదిన వేడుకలు శనివారం జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఎక్స్‌ పేజీ వేదికగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన పుట్టినరోజు సంబరాల ఫొటోలనూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


24న ‘వడక్కన్‌’ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: మాటల రచయిత భాస్కర్‌ శక్తి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘వడక్కన్‌’. చిత్రంలో కుంగుమ రాజ్‌, వైరమాల హీరోహీరోయిన్లుగా నటించారు. కర్ణాటక సంగీత కళాకారిణి ఎస్‌.జె.జనని సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తేని ఈశ్వర్‌ ఛాయగ్రాహకుడిగా పనిచేశారు. రాష్ట్రంలో పనిచేసే వలస కూలీల ఇతివృత్తంతో హాస్యభరితంగా చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు పోస్టరును విడుదల చేసింది


17న ‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’...

చెన్నై: ఆనంత్‌ నారాయణన్‌ దర్శకత్వంలో సంతానం ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునిశ్‌కాంత్‌, బాల శరవణన్‌ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుందని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్రం 17న విడుదల కానున్నట్టు విడుదల తేదీలో మార్పు చేసింది. మరోవైపు చిత్రంలోని మూడో పాట ‘మాలు మాలు’ పాటను సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని