logo

అమ్మాయిలు అదరగొట్టారు

ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు.

Published : 07 May 2024 00:24 IST

ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో పైచేయి
రాష్ట్రవ్యాప్తంగా 94.56 శాతం ఉత్తీర్ణత
మొదటిస్థానంలో తిరుప్పూరు

ఫలితాలు విడుదల చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సేతురామవర్మ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. ఫలితాలు సోమవారం ఉదయం 9.30కు ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్‌ సేతురామ్‌వర్మ విడుదల చేశారు. 94.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 94.03 శాతం కన్నా ఇది అధికం. 94.44 శాతం మంది విద్యార్థినులు, 92.37 శాతం విద్యార్థులు పాలసయ్యారు. 397 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత పొందాయి. 2,478 మహోన్నత పాఠశాలల్లో అందరూ ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ సాయం పొందే పాఠశాలలు 95.49 శాతం, ప్రైవేట్‌ పాఠశాలలు 96.07శాతం ఉత్తీర్ణత పొందాయి. బాలికల పాఠశాలలు 96.39శాతం, బాలురు పాఠశాలలు 86.39శాతం ఉత్తీర్ణత పొందాయి. మార్చి 1 నుంచి 22 వరకు జరిగిన పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 7.50 లక్షలమంది విద్యార్థులు రాశారు. తిరుప్పూర్‌ జిల్లా 97.45 శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. 97.42 శాతంతో శివగంగై, ఈరోడ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సబ్జెక్టుల పరంగా సైన్స్‌లో 96.33 శాతం, ఫిజిక్స్‌లో 98.48 శాతం, కెమిస్ట్రీలో 99.14శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.


నివేదను అభినందిస్తున్న హిజ్రాలు

చెన్నై తిరువళ్లికేణికి చెందిన నివేద అనే హిజ్రా విద్యార్థిని 283 మార్కులు పొందింది. రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలలో పరీక్ష రాసింది ఆమె ఒక్కటే కావడం గమనార్హం. 2015లో హిజ్రాగా మారిన ఆమె ఆదివారం జరిగిన నీట్‌ పరీక్ష  కూడా రాశారు. డాక్టర్‌ కావాలనేదే తన లక్ష్యమని అన్నారు. తిరువళ్లికేణిలోని లెడీ వెలింగ్టన్‌ పాఠశాలలో చదివిన విద్యార్థినిని ప్రధానోపాధ్యాయిని హేమమాలిని అభినందించారు.


గురువులకు అభినందనలు..

ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందిస్తున్న కలెక్టర్‌ క్రీస్తురాజ్‌

ఆర్కేనగర్‌: ఫలితాల్లో 97.45శాతం ఉత్తీర్ణతతో తిరుప్పూర్‌ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. జిల్లాలో 23,849 మంది పరీక్ష రాశారు. ఇందులో 10,440 మంది విద్యార్థినులు, 12,802 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన తిరుప్పూర్‌ 2019, 2020 సంవత్సరాల్లో మొదటిస్థానంలో నిలవడం గమనార్హం. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, పాఠశాలల ఉపాధ్యాయులను కలెక్టర్‌ క్రీస్తురాజ్‌, విద్యాధికారి గీత అభినందించారు.

కొళూత్తూర్‌ ఎవర్‌విన్‌ పాఠశాలలో సెల్‌ఫోన్‌లో మార్కులు చూపుతున్న విద్యార్థినులు

పుదుచ్చేరిలో 92.41శాతం.. ఆర్కేనగర్‌: పుదుచ్చేరిలో ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. పుదుచ్చేరి, కారైక్కాల్‌లో 92.41శాతం మంది ఉత్తీర్ణత పొందారు. మార్చిలో జరిగిన పరీక్షలను 14,012 మంది రాశారు. గతేడాది కంటే 0.26 శాతం ఉత్తీర్ణత తక్కువగా ఉంది. పుదుచ్చేరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో 86.39శాతం, కారైక్కాల్‌లో 81.65శాతం మంది పాసయ్యారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌లో మొత్తం 55 పాఠశాలలు ఉండగా మాడుకరై ప్రభుత్వ మహోన్నత పాఠశాల మాత్రమే వందశాతం ఉత్తీర్ణత పొదింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల ప్లస్‌టూ తరగతుల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించనున్నారు.


నమ్మకంతో ముందుకు సాగండి విద్యార్థులకు సీఎం పిలుపు

ఫలితాల నివేదిక సీఎం స్టాలిన్‌కు అందిస్తున్న మంత్రి అన్బిల్‌ మహేశ్‌

చెన్నై, న్యూస్‌టుడే: విద్యార్థులు నమ్మకంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు విడుదలైన సందర్భంగా ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. అందులో.. పాఠశాల విద్య పూర్తిచేసి కళాశాల జీవితానికి వెళ్లనున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యలో రాణించి ఉన్నత పదవుల్లో ప్రకాశించాలని ఆకాంక్షించారు. ఈసారి తక్కువ మార్కులు పొందినవారు కుంగిపోకూడదని, తర్వాత వేచి ఉన్న అవకాశాలు ఉన్నతికి స్తంభాలుగా ఉంటాయనే నమ్మకంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

15 మంది ఖైదీలు..

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మదురై సెంట్రల్‌ జైల్లో ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు రాసిన 15 మంది ఖైదీలు ఉత్తీర్ణత సాధించారు. అక్కడి జైల్లో 1400 మందికి పైగా విచారణ, శిక్షపడిన ఖైదీలు ఉన్నారు. ఖైదీలు తమకు నచ్చిన కోర్సులు చదివేందుకు జైళ్లశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 8వ తరగతి నుంచి కళాశాల విద్య వరకు చదివేందుకు అప్పుడప్పుడు ప్రత్యేక తరగతులను ఉపాధ్యాయుల ద్వారా నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలను 15 మంది ఖైదీలు రాశారు. అందరూ ఉత్తీర్ణత సాధించారు. వారిలో ఆరోగ్య జయప్రభాకరన్‌ 536 మార్కులతో మొదటిస్థానంలో నిలిచాడు. జైలు శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మహిళల సెంట్రల్‌ జైల్లో ఎవరూ పరీక్షలు రాయకపోవడం గమనార్హం.


కత్తిపోటుకు గురైన విద్యార్థి పాసయ్యాడు..

తిరునెల్వేలి : కుల ఘర్షణల్లో కత్తి దాడికి గురైన విద్యార్థి చక్కటి మార్కులు సాధించాడు. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి సమీపం పెరుందెరుకు చెందిన చిన్నదురై స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ చదువుకుంటున్నాడు. గతేడాది ఆగస్టులో అదే ప్రాంతానికి చెందిన ఓ వర్గం వారితో కులపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ముఠా కత్తితో దాడి చేయగా చిన్నదురై తీవ్రగాయాలకు లోనయ్యాడు. అడ్డుకునేందుకు వెళ్లిన అతని సోదరి చంద్ర కూడా గాయపడింది. ప్రభుత్వం చొరవ తీసుకుని అతను మరో పాఠశాలలో చదువు  కొనసాగించడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం విడుదలైన ప్లస్‌టూ పరీక్షలో 600 మార్కులకు 469 పొందాడు. తండ్రి మునియాండి, తల్లి అంబికాపతి కూలీలు.

అండగా ఉంటా..  ఆర్కేనగర్‌: చిన్నదురై కోరిన కళాశాలలో చేరేందుకు సాయపడతానని, ఉన్నతవిద్యకు అన్నిరకాలుగా అండగా ఉంటానని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. బాలుడితో ఆయన సెల్‌ఫోన్‌లో మాట్లాడి అభినందించారు. ఎక్స్‌ పేజీలోనూ అదే విషయాన్ని ప్రస్తావించారు.


ఫెయిలైనవారికి కౌన్సెలింగ్‌

డీఎమ్‌ఎస్‌లోని సేవా కేంద్రంలో గగన్‌దీప్‌సింగ్‌బేడి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ప్లస్‌టూ ఫలితాల్లో ఫెయిలైన  విద్యార్థులు నిరాశ, ఒత్తిడికి లోనవకుండా కౌన్సెలింగ్‌ ఇచ్చేవిధంగా ఆరోగ్యశాఖ తరఫున ప్రత్యేక ఏర్పాటు చేశారు. చెన్నై తేనాంపేటలోని డీఎమ్‌ఎస్‌ ప్రాంగణంలో 104 వైద్యసహాయ సమాచారం కేంద్రం ద్వారా, 14416 అనే ప్రత్యేక నెంబర్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ పనిచేస్తాయి. ప్లస్‌టూ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని 51,919 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. డీఎమ్‌ఎస్‌లోని సేవా కేంద్రాన్ని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్‌సింగ్‌బేడీ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని