logo

ఆత్మవిశ్వాసానికి చిరునామా.. తాన్సెన్‌

పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు.

Published : 10 May 2024 01:01 IST

రాష్ట్రంలో డ్రైవింగ్‌ లైసెన్సు పొందిన తొలి దివ్యాంగుడు

కారు నడుపుతూ..

పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. లైసెన్స్‌ కూడా అందుకున్నాడు. రాష్ట్రంలోనే మొదటి లైసెన్స్‌ పొందిన దివ్యాంగుడిగా ఘనత సాధించాడు.

-ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే

 చెన్నై వ్యాసార్పాడి పెరియార్‌నగర్‌లోని తాన్సెన్‌కు 10ఏళ్ల ప్రాయంలో విద్యుదాఘాతం కారణంగా రెండు చేతులు మోచేయి వరకు తీసేయాల్సి వచ్చింది. కుమారుడిని చూసి కన్నవారు తల్లడిల్లిపోయారు. తాన్సెన్‌ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రోజువారీ పనులు స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. కాళ్లతోనే రాయడం, ఈతకొట్టడం, డ్రమ్స్‌ వాయించడం కూడా నేర్చుకున్నాడు. ఇంజినీరింగ్‌ ముగించి బీఎల్‌ పూర్తి చేసిన తాన్సెన్‌ ప్రస్తుతం ఎంఎల్‌ చదువుతున్నాడు. వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.

వాహనం డిజైన్‌లో మార్పులు..

తాన్సెన్‌కు కారు నడపాలనే కోరిక కలిగింది. ఇదే విషయాన్ని వ్యాపారవేత్త శ్రీవారి శంకర్‌, నటుడు రాఘవలారెన్స్‌కు తెలిపాడు. వారి సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు సమస్యలు తలెత్తాయి. చెన్నై కేకేనగర్‌లోని పునరావాస ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతనికి అనుగుణంగా కారు మార్చుకోవాలని సూచించారు. ఆస్పత్రి ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్‌ డైరెక్టర్‌ తిరునావుక్కరసు, వైద్యుల సిఫారసు మేరకు రోటేరి ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్సు పొందాడు. రాష్ట్రంలోనే తొలిసారిగా, దేశంలోనే మూడోవ్యక్తిగా రెండు చేతుల్లేని దివ్యాంగుడు తాన్సెన్‌ ఏప్రిల్‌ 22న లైసెన్సు తీసుకున్నాడు.

మూడు నెలలు పరిశీలించి..

తిరునావుక్కరసు మాట్లాడుతూ తాన్సెన్‌ కారు నడపడం చూసి సంతోషపడిన తాము మిగిలినవారి భద్రత దృష్టిలో పెట్టుకున్నామన్నారు. మోచేయి వరకు ఉన్న చేతులతోనే స్టీరింగ్‌ పట్టుకొని నడిపిన అతనికి బ్యాలెన్స్‌ సరిగా ఉందా అని పరిశీలించామన్నారు. మోచేతులు, కాళ్లతో కారు నడిపి చూపించాడని, స్వయంగా డోర్‌ తెరిచాడని, సీట్‌బెల్ట్‌ వేసుకున్నాడని చెప్పారు. అవసరమైన సమయంలో బ్రేక్‌ వేశాడని తెలిపారు. మూడు నెలలు పర్యవేక్షించిన అనంతరం కొన్ని శిక్షణలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. అతని కారు డిజైన్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఇంకా బాగా నడిపాడని, అందుకే లైసెన్సు పొందేందుకు సిఫారసు చేశామని వివరించారు.

తిరుమల కొండపైకి..

తాన్సెన్‌ మాట్లాడుతూ.. నటుడు రాఘవా లారెన్స్‌ నిర్వహించే కచేరి, ఇతర కార్యక్రమాల్లో డ్రమ్స్‌ వాయిస్తానని చెప్పాడు. చేతుల గురించి ఎవరైనా అడిగే వరకు దివ్యాంగుడనే భావన తనకు లేదన్నారు. కారు నడపాలనే ఆశతో పునరావాస వైద్యసంస్థలోని వైద్యులను కలిశానని, వైద్యులు, రాఘవా లారెన్స్‌ సహాయపడ్డారని చెప్పాడు. కారులో ఆటోమేటిక్‌ గేర్‌, బ్రేక్‌ ఫీచర్‌ ఉందని, అందుకే తిరుమల కొండపైకి స్వయంగా కారు నడిపానన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని