logo

ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకం: ప్రేమలత

డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు.

Published : 10 May 2024 01:08 IST

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. దివంగత నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు ప్రకటించిన పద్మభూషణ్‌ పురస్కారం పొందేందుకు దిల్లీ వెళ్తున్న సందర్భంగా ఆమె చెన్నై విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. పదో తేదీ దిల్లీ తమిళ సంఘం తరఫున నిర్వహించే సన్మాన కార్యక్రమంలోనూ పాల్గొంటామని తెలిపారు. మూడేళ్ల డీఎంకే పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు సీఎం స్టాలిన్‌ చెబుతున్నారని, ఆయన నేరుగా ప్రజల వద్దకు వెళ్లి చూశారా అని ప్రశ్నించారు. రైతులు దారిద్య్రంలో ఉన్నారని, రిజిస్ట్రేషన్ల సేవా పన్నును అకస్మాత్తుగా పెంచారని, ఆస్తిపన్ను, పాలు, బస్సు ఛార్జీలువంటివి పెరిగాయని విమర్శించారు. ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకమైందని తెలిపారు. నీట్‌ పరీక్షలు రద్దు చేయిస్తామన్నారని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. విజయకాంత్‌ బతికున్నప్పుడే పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసి ఉంటే బాగుండేదన్నారు. దేశంలోని అన్ని పురస్కారాలకు ఆయన అర్హుడని, భారతరత్న ప్రకటించినా ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని