logo

Nara Lokesh: సాక్షి దినపత్రికపై రూ.75 కోట్లకు నారా లోకేశ్‌ పరువునష్టం దావా!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ సాక్షి దినపత్రికపై గతంలో విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా గురువారం

Updated : 24 Feb 2022 07:49 IST

నేడు విశాఖలో కోర్టుకు హాజరు

ఈనాడు, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ సాక్షి దినపత్రికపై గతంలో విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా గురువారం విశాఖకు వస్తున్నారు. 6/2020 నెంబరుతో దాఖలైన వ్యాజ్యంలో తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని పేర్కొన్నారు. ఆ పత్రికలో 2019 అక్టోబరు 22న ‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి’  శీర్షికతో కథనం ప్రచురితం అయింది. అందులోని అంశాలన్నీ పూర్తి అవాస్తవమని, దురుద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనం అని ఖండిస్తూ 2019 అక్టోబరు 25న సాక్షి సంపాదక బృందానికి లోకేశ్‌ తరఫు న్యాయవాదులు రిజిస్టర్‌ నోటీసు పంపారు. దీనికి సంబంధించి 2019 నవంబరు 10న సాక్షి నుంచి తిరుగు సమాధానం వచ్చింది. దీనిపై సంతృప్తి చెందని లోకేశ్‌ పరువు నష్టం దావా వేశారు. విశాఖ విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు  తిన్నానని వార్తలో పేర్కొన్న తేదీల్లో తాను ఇతర ప్రాంతాల్లో ఉన్నానని, అయినప్పటికీ తన పరువుకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అసత్యాలతో కథనం ప్రచురించారని దావాలో పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా పనిచేసిన తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధం లేని అంశాలతో ముడిపెట్టి అసత్యాలతో కథనం రాయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ , సాక్షి ప్రచురణకర్త మురళి, విశాఖకు చెందిన సాక్షి న్యూస్‌ రిపోర్టర్లు వెంకటరెడ్డి, ఉమాకాంత్‌లపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని