ప్రతి కార్యకర్త కష్టాన్నీ గుర్తిస్తాం

తాను వైకాపా కార్యకర్తనని చెప్పుకోడానికే ఎక్కువ గర్వపడతానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం అనకాపల్లిలో నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయిలో నిల్చోబెట్టి వైకాపా

Updated : 29 Jun 2022 13:05 IST

అనకాపల్లిని పరిశ్రమల హబ్‌గా మారుస్తా..
వైకాపా ప్లీనరీలో మంత్రి అమర్‌నాథ్‌


మాట్లాడుతున్న మంత్రి అమర్‌, వేదికపై ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ, దాడి తదితరులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే : తాను వైకాపా కార్యకర్తనని చెప్పుకోడానికే ఎక్కువ గర్వపడతానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం అనకాపల్లిలో నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయిలో నిల్చోబెట్టి వైకాపా విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త కష్టాన్నీ గుర్తుంచుకుంటానని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లాకు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. కోడూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి జిల్లాను మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చారని చెప్పారు. గడగడపకు వెళ్లి ఓటడిగే హక్కు వైకాపా కార్యకర్తకే ఉందని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో మూడు పారిశ్రామిక సదస్సులు ఏర్పాటుచేసినా ఒక్క పరిశ్రమనైనా తేగలిగారా అని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై నోరు పారేసుకుంటున్నారని, ఇక నుంచి ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేనన్ని సంక్షేమ పథకాలను జగన్‌ అమలుచేసి చూపుతున్నారన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వాలంటీర్లను వైకాపా కార్యకర్తలే నియమించారన్నారు. వాలంటీర్లు పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే వారిని తొలగిస్తామని చెప్పారు. సీఎం జగన్‌ అనకాపల్లి జిల్లాకు  గుర్తింపు ఇచ్చి రెండు మంత్రి పదవులు కేటాయించారన్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలు అధికంగా వస్తాయని, స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సీఎం జగన్‌ స్వతహాగా ఎదిగిన నాయకుడన్నారు.  ఎన్టీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఎదిరించి రాష్ట్రంలో విజయబావుటా ఎగురవేశారని గుర్తుచేశారు. చంద్రబాబును ఎవరో ఓడించాల్సిన అవసరం లేదని, ఆయన కుమారుడే అందుకు చాలని పేర్కొన్నారు. అనకాపల్లి ప్రతిష్ఠ ఇనుమడింపజేసేలా మంత్రి అమర్‌నాథ్‌ పాలన చేయాలని సూచించారు. సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షత వహించగా పార్టీ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, సతీష్‌ వర్మ, ముక్కా మహాలక్ష్మినాయుడు, రాజారాం, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ భీశెట్టి వరహా సత్యవతి, జీవీఎంసీ కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, కొణతాల నీలిమ, పీలా లక్ష్మీ సౌజన్య, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మి, వైకాపా నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, దాడి జయవీర్‌, జాజుల రమేష్‌, పలకా రవి, కొణతాల మురళీకృష్ణ, ఆళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని