logo

అంతటా.. జీ20 శోభ!

‘2023 జి-20’ నిర్వహణకు అధ్యక్ష బాధ్యతలు భారతదేశం చేపట్టిన నేపథ్యంలో దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.

Published : 28 Mar 2023 05:07 IST

బీచ్‌ రోడ్డులో సుందరీకరణలో భాగంగా..

ఈనాడు-విశాఖపట్నం, వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:  ‘2023 జి-20’ నిర్వహణకు అధ్యక్ష బాధ్యతలు భారతదేశం చేపట్టిన నేపథ్యంలో దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగానే 28, 29వ తేదీల్లో విశాఖలో రెండో సన్నాహక సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేడు ఉదయం 9:30 గంటల నుంచి సమావేశాలు మొదలవుతాయి. జి-20లో భాగంగానే మరో రెండు రోజులు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక చేశారు. నగరంలోని ముడసర్లోవ, కాపులుప్పాడ, బీచ్‌ రోడ్డులలో కొన్ని ప్రదేశాలను ప్రతినిధులు సందర్శించేందుకు సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు. విదేశీ ప్రతినిధులు ప్రయాణించే ఆరు ప్రాంతాలను తాత్కాలిక్‌ రెడ్‌ జోన్‌గా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.  

అతిథులు 300.. సేవలకు 3వేల మంది: జీ20 సన్నాహక సదస్సులకు దేశ, విదేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు. వీరికి సేవలందించడంలో దాదాపు 3వేల మంది నిమగ్నమయ్యారు. సదస్సులు జరిగే రాడిసన్‌ బ్లూ హోటల్‌ లోపలికి అతిథులను మాత్రమే పంపుతామని, సహాయకులు, ఇతర పరివారమంతా బయటే ఉండాలని నిర్వాహకులు తేల్చి చెప్పారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయా బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఓ ఈవెంట్‌ సంస్థకు అప్పగించారు. దీంతో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి వస్తోందని, దీని వల్ల లైజాన్‌ అధికారులు, ఇతర సహాయక సిబ్బంది హోటల్‌ లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

కైలాస గిరిపై..

విశాఖ చేరుకున్న విదేశీ ప్రతినిధులు: ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు విశాఖలో సదస్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జీ20 సభ్య దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాల నుంచి దాదాపు 63 మంది ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంత వరకు 57 మంది విశాఖ చేరుకున్నారు. మిగిలిన వారు మంగళవారం ఉదయానికి వచ్చే అవకాశం ఉంది. మరో 220 మంది దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, వివిధ దేశాల ఎంబసీ ప్రతినిధులు ఉన్నారు.

నెల రోజులుగా ఏర్పాట్లు: రాష్ట్ర మంత్రులు సురేష్‌, విడదల రజిని, ఆర్‌.కె. రోజా విశాఖకు వచ్చారు. మంగళవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు తదితరులు వస్తారని కలెక్టరేట్‌కు సమాచారం అందింది. కేంద్ర మంత్రుల పర్యటన వివరాలేవీ రాలేదు. అతిథులు, సదస్సు ప్రతినిధులు రాడిసన్‌ బ్లూ హోటల్లో బస చేస్తున్నారు. 28వ తేదీ రాత్రి అదే హోటల్‌ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. పోలీసు యంత్రాంగం 2500 మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత, అతిథి సేవలకు కలిపి దాదాపు 3వేల మందిని వినియోగిస్తున్నారు. నెల రోజుల నుంచి యంత్రాంగం సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది.

నేడు గవర్నర్‌, సీఎం రాక: రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ మంగళవారం విశాఖ వస్తున్నారు. గవర్నర్‌ సాయంత్రం 4.30గంటలకు విమానంలో విశాఖకు చేరుకుంటారు. గవర్నర్‌ బంగ్లాలో బస చేయనున్నారు. ‘జీ20’ సదస్సు ప్రతినిధులకు ప్రభుత్వం ఇవ్వనున్న విందు కార్యక్రమంలో పాల్గొంటారు. 29న ఉదయం విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.

* సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుంటారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లి అక్కడ జీ20 సదస్సు ప్రతినిధులకు నిర్వహించే విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 8.35 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు.


ఫోన్‌లో కొత్త సిమ్‌.. మోమున చిరునవ్వు!
ఉద్యోగులకు అధికారుల దిశా నిర్దేశం

జి-20 పైలాన్‌

గాజువాక, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మక ‘జీ20’ సన్నాహక సదస్సులకు వచ్చే అతిథులకు ఆతిథ్య బాధ్యతలను వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకు కేటాయించారు. సుమారు 200 మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పటికే విధుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయలో ఉన్నతాధి కారులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు.

* విమానం దిగిన వెంటనే అతిథిని చిరునవ్వుతో పలకరించి లాంజ్‌లోకి తోడ్కొని వెళ్లాలని, అక్కడ తేనీరు తాగి వచ్చే లోపు కారును సిద్ధం చేయాలన్నారు. హోటల్‌కు చేరకముందే రూమ్‌, ఏసీ, నీటి సదుపాయం ఎలా ఉందో పరిశీలించాలని స్పష్టం చేశారు. అతిథులకు విశాఖలో సందర్శించదగ్గ ప్రదేశాలను తెలియజేయాల్సి ఉంటుంది. వారు విమానాశ్రయం నుంచి వస్తున్నప్పుడు ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చూసుకోవాలి.

*  మొబైల్స్‌లో పాత సిమ్‌లు పక్కన పెట్టి కొత్త సిమ్‌లే వాడాలన్నారు. ఇతర వ్యక్తులతో సంభాషణలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫోన్‌ ఎప్పుడూ ఎంగేజ్‌లో ఉంచకూడదన్నారు. ఏ క్షణానైనా అతిథులు ఫోన్‌చేస్తే వెంటనే స్పందించి వారికి కావలసిన, వసతి, రవాణా, తాగునీటి సౌకర్యం సమకూర్చాలని సూచించారు.

* డెలిగేట్లకు కేటాయించిన ఉద్యోగులు ఎంతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జీ-20 సదస్సు ఒక మరపురాని అనుభూతిని కలిగించేలా ఉద్యోగులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని