logo

పారిశుద్ధ్య పోస్టు @ రూ.2.50 లక్షలు

వైకాపా ప్రజాప్రతినిధులు కొందరు అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పొట్టకొట్టి అందినంత దండుకోవాలని చూస్తున్నారు.

Published : 30 May 2023 04:53 IST

వైకాపా నేతల బేరం
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

వైకాపా ప్రజాప్రతినిధులు కొందరు అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పొట్టకొట్టి అందినంత దండుకోవాలని చూస్తున్నారు. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో 300 మంది కార్మికులను కూలి ప్రాతిపదికన దొడ్డిదారిన నియమించడం దీనికి ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకుంటున్నారని వాపోతున్నారు. తక్షణమే కూలి ప్రాతిపదికన చేపట్టిన నియామకాలు రద్దు చేసి, కార్మికుల కుటుంబ సభ్యులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

ఆ నలుగురే కీలకం

ఇప్పటికే 300 మంది కార్మికులను కూలి ప్రాతిపదికన  నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులు తాము సూచించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. తెర వెనుక ఒక్కో పోస్టుకు బేరం పెట్టి రూ.2.50లక్షల వరకు అమ్ముకుంటున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీవీఎంసీలో ఓ ఉన్నతాధికారి, పాలకవర్గంలోని నలుగురు నడుపుతున్నారని బహిరంగంగానే పలువురు కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. కూలి ప్రాతిపదికన కార్మికులను తీసుకునే విధానానికి మేయరు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడం గమనార్హం.

316 కాదు.. కేవలం 77 మందే..

పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి కొత్తగా కార్మికులను నియమించాలని, తద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావించిన కొందరు అధికార పార్టీ నేతల ఆలోచనలను పసిగట్టిన గత కమిషనర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడి మరింత తీవ్రతరం కావడంతో ‘ఆప్కోస్‌’ ద్వారా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టాలని భావించారు. అనంతరం కార్మిక సంఘాల ఒత్తిడితో... మృతి చెందిన, ఉద్యోగ విరమణ చేసిన 482 మంది కార్మికుల వారసులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆప్కోస్‌ నిబంధనల ప్రకారం దరఖాస్తులు ఆహ్వానించగా 5012 వచ్చాయి. అందులో వారసత్వ నియామకాలకు 316 మంది అర్హులని ముగ్గురు కమిటీ సభ్యులు తేల్చారు. దాన్ని పక్కనపెట్టి కేవలం 77 మంది మాత్రమే అర్హులని అధికారులు ప్రకటించారు. దీని వెనుక అధికారపక్ష నాయకుల ఒత్తిడి ఉందనే వాదన వినిపిస్తోంది.

రూ.లక్ష నుంచి ప్రారంభమై...

‘మొదట ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు అధికార పార్టీ నేతలు కొందరు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో రూ.2.50లక్షలకు పెంచేశారు. గతంలో ఇచ్చిన పేర్లు కాదని, రూ.2.50లక్షలు చెల్లించిన వారి పేర్లను అధికారులకు పంపుతున్నారు.  ఇలాంటి వారిలో ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. వీరు తమ ఇళ్లల్లో పనిచేస్తూ జీవీఎంసీ వేతనం పొందేలా చేయడం నేతల వ్యూహంగా కనిపిస్తోంది’ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు