logo

‘ఇన్ఫోసిస్‌’ షురూ..

విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఎంప్లాయి లీడర్‌షిప్‌ కనెక్ట్‌’ పేరుతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Updated : 28 Jun 2023 10:11 IST

నేడు ఐటీపార్కులో ‘ఎంప్లాయ్‌ లీడర్‌షిప్‌ కనెక్ట్‌’ సమావేశం
జులై 1వ తేదీ నుంచి కార్యకలాపాలు!

ఇటీ పార్కులో ఇన్ఫోసిస్‌ భవనం ఇదే

ఈనాడు - విశాఖపట్నం: విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఎంప్లాయి లీడర్‌షిప్‌ కనెక్ట్‌’ పేరుతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జులై 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని ఐటీ పార్కులోని హిల్‌-2, 3 జంక్షన్‌లో మౌరి టెక్‌ ఎదురుగా సిగ్నిటీ టవర్స్‌ భవన్‌లో ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ రెండు షిఫ్టులలో 1400 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది.

వర్క్‌ ఫ్రం హోం నుంచి ఆఫీస్‌కు..

కొవిడ్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రం హోం పనిచేస్తున్నారు. అదే ఇంకా కొనసాగుతూ వస్తోంది. ‘వర్క్‌ ఫ్రం హోం నుంచి వర్క్‌ ఫ్రం ఆఫీస్‌’కు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు తమ సంస్థలను విస్తరించి ఉద్యోగులకు దగ్గరగా ఆఫీసు నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ భారతదేశంలో మొదటగా విశాఖపట్నం, నాగపూర్‌, కోయంబత్తూర్‌, భోపాల్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల ఉత్తరాంధ్ర పరిధిలోని ఉద్యోగులను ఇక్కడ పనిచేసేందుకు ఒప్పించడం సులువవుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన (అపాయింట్‌మెంట్స్‌) వారు ఇక్కడ పనిచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి వారానికి రెండు, మూడు రోజులు కార్యాలయంలో పనిచేసేలా ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే భవనంలో....

ఇన్ఫోసిస్‌ నిర్ణయంతో ప్రభుత్వ ఐటీ విభాగం ముందుకొచ్చి అవసరమైన భవనం కేటాయించాలని ఏపీఐఐసీకి సూచించింది. ఆర్థిక మండలిలో ఆంక్షలతో కూడిన భవనాలు తమకు వద్దని, ఐటీ సెజ్‌లో డీనోటిఫై చేసిన భవనాలు, నగరంలోని పలు భవనాలను సంస్థ ప్రతినిధులు పరిశీలించినట్లు సమాచారం. చివరకు హిల్‌-2 సమీపంలోని మౌరి టెక్‌ భవనాన్ని ఎంపిక చేశారు. గత ప్రభుత్వం ఇదే భవనంలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో నడిచే పలు సంస్థలకు అవకాశం కల్పించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక అక్కడున్న సంస్థలు ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లిపోవడంతో ఆ భవనం ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులోనే ఇప్పుడు ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని