logo

‘ఉక్కు’... ఇంకా చిక్కుల్లోనే

‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికుల సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై పడింది. జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నారు. దీంతో పోర్టులో కార్యకలాపాలు స్తంభించాయి.

Published : 16 Apr 2024 04:22 IST

సమ్మె విరమించని గంగవరం పోర్టు కార్మికులు

ఈనాడు-విశాఖపట్నం: ‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికుల సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై పడింది. జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నారు. దీంతో పోర్టులో కార్యకలాపాలు స్తంభించాయి. ప్లాంటుకు అవసరమైన బొగ్గు నిల్వలు పోర్టులో ఉండిపోవడంతో ఉత్పత్తికి ఆటంకం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. స్టీలు ప్లాంటు వైపు ఉన్న గేటు నుంచి రోడ్డు మార్గంలో తరలించే అవకాశం ఉన్నా అదానీ సంస్థ ఆ ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో విశాఖ పోర్టు నుంచి ప్రస్తుతం సాఫ్ట్‌ కోల్‌ తెచ్చుకుంటున్నారు.
బొగ్గే కీలకం: బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో ఇనుమును కరిగించే ఇంధనంగా బొగ్గును ఉపయోగిస్తారు. ఈ బొగ్గు నుంచి కోక్‌ తయారు చేస్తారు. ప్లాంటులో ఐదు బ్యాటరీలున్నాయి. ఒక్కో బ్యాటరీలో 67 ఓవెన్స్‌ ఉంటాయి. ఒక్కో ఓవెన్‌లో 25 టన్నుల కోక్‌ తయారు అవుతుంది. బొగ్గును వేడి చేస్తూ 16-18 గంటల వ్యవధిలో కోక్‌ తయారు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది. ఈ క్రమంలో 7 టన్నుల గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌తో రోలింగ్‌ మిల్‌ ఫర్నేస్‌లు నడుస్తాయి. బొగ్గు కొరత ఏర్పడితే రోలింగ్‌ మిల్‌ ఫర్నేస్‌లు నడవవు, అదేవిధంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో స్టీలు ఉత్పత్తికాని పరిస్థితి నెలకొంటుంది.

కొనాలంటే ఆర్థిక ఇబ్బందులు: బొగ్గు ద్వారా తయారయ్యే కోక్‌ను బయట నుంచి కొనుగోలు చేయాలంటే టన్ను రూ.35వేలపైగా పలుకుతుంది. అదే స్టీలు ప్లాంటులో అయితే తక్కువ ఖర్చుకు సమకూరుతుంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంటు బయట నుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. విశాఖ ఉక్కుకు సంబంధించిన బొగ్గు నిల్వలు గంగవరం పోర్టులో 30వేల టన్నుల వరకు ఉన్నాయి. వీటితోపాటు సెయిల్‌, ఎన్‌ఎండీసీ నిల్వలు ఈ పోర్టులో ఉంటాయి. ఆ నిల్వల నుంచి అవసరాన్ని బట్టి స్టీలు ప్లాంటుకు గతంలో ఉపయోగించుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసిన బొగ్గు రెండు నౌకల్లో వచ్చింది. కానీ, దిగుమతి చేసే కార్మికుల్లేరు. ఒక్కో నౌకలో లక్ష టన్నులపైగా ముడిసరుకు ఉన్నట్లు సమాచారం.

చర్చలు ఫలించడం లేదు: గంగవరం పోర్టు కార్మికుల సమ్మె నేపథ్యంలో నౌకల నుంచి సరకు దిగుమతి చేయడం లేదు. బెర్తుల వద్ద, గోదాంలలో ఉన్న సరకు రవాణా చేసే పరిస్థితి లేదు. కార్మికులతో పోర్టు యాజమాన్యం, జిల్లా కలెక్టర్‌ సాగించిన చర్చలు ఫలించలేదు. అదానీ కావాలనే స్టీలు ప్లాంటును ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నట్లు ఉక్కు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని