logo

అన్నమో జగనన్నా అనాల్సిందే..!

ముఖ్యమంత్రి జగన్‌ గొప్పగా చెప్పే మాటలివి..  మరి ఆసుపత్రుల్లో రోగులకు వండిపెట్టే నిర్వాహకులకు పది నెలలుగా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో భోజనంలో నాణ్యత తగ్గుతోంది.. మెనూ అమలు కావడం లేదు.

Updated : 16 Apr 2024 05:23 IST

పదినెలలుగా భోజన బిల్లులు బకాయిలే
మా వల్ల కాదంటున్న నిర్వాహకులు
ఈనాడు, పాడేరు, న్యూస్‌టుడే, చోడవరం పట్టణం, చింతపల్లి

చోడవరం సీహెచ్‌సీలో ఇటీవల 30 మంది ఇన్‌పేషంట్లకు గుడ్లు, పండ్లు లేకుండా చిన్న క్యారేజీల్లో తెచ్చిన ఆహారం

ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలు విస్తరించాం.. వైద్యం ఖర్చు రూ.25 లక్షల వరకు పెంచాం..

ముఖ్యమంత్రి జగన్‌ గొప్పగా చెప్పే మాటలివి..  మరి ఆసుపత్రుల్లో రోగులకు వండిపెట్టే నిర్వాహకులకు పది నెలలుగా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో భోజనంలో నాణ్యత తగ్గుతోంది.. మెనూ అమలు కావడం లేదు. కొన్నిచోట్ల ఇళ్ల నుంచే రోగులకు క్యారేజీలతో ఆహారం తెచ్చుకుంటున్నారు. ఇదేంటని అధికారులు అడిగితే బిల్లులు సకాలంలో ఇచ్చి మాట్లాడండని నిర్వాహకులు ఎదురు చెబుతున్నారు.

అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని 16 ఆసుపత్రుల పరిధిలో సుమారు రూ.2 కోట్లకు పైగా డైట్‌ బిల్లులు బకాయిలున్నాయి. వాటిలో కొంతైనా చెల్లించకుంటే ఇకపై వండిపెట్టేది లేదని నిర్వాహకులు తేల్చిచెప్పేస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల అధికారులు, కలెక్టర్లకు వినతులు అందజేశారు. అయినా స్పందన కనిపించ లేదు. దీంతో బుధవారం నుంచి ఆసుపత్రులకు ఆహార సరఫరా నిలిపేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదే జరిగితే రోగులు అన్నమో జగనన్నా అనాల్సిందే.

ఉమ్మడి జిల్లాలో వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 16 ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో ఇన్‌ పేషెంట్‌లుగా చేరిన రోగులకు భోజనాలను అందించడానికి టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించారు. ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోజుకు సగటున 250 మంది వరకూ రోగులకు భోజనాలు పెడుతున్నారు. మిగిలిన 50 పడకలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో రోజుకు 30 నుంచి 100 మంది వరకూ భోజనాలు అందిస్తున్నారు. ఒక రోగికి రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ఆకుకూర, ఉడికించిన కోడిగుడ్డుతో భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం అందించాలి. దీనికి మొత్తం రూ.80 వరకు చెల్లించాల్సి ఉంది. గతంలో రూ.40 ఇచ్చేవారు. అది పెంచినా నెలల తరబడి సొమ్ములివ్వడం లేదు. దీంతో కిరాణా దుకాణాల దగ్గర అప్పు పుట్టడం లేదని భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం


బకాయిలు భారం..  మెనూ దూరం..

భోజన నిర్వాహకులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో భోజన సరఫరాకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెద్ద ఆసుపత్రుల్లో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులకే వాటిని అదనంగా అప్పగించారు. ఒకే గుత్తేదారు మూడు, నాలుగు ఆసుపత్రుల్లో ఆహారం అందించాల్సి రావడంతో వారు స్థానికంగా మరొకరికి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నారు.  ఇటీవల చోడవరం ప్రభుత్వాసుపత్రిలో పరిశీలించగా నిర్వాహకులు ఇంటి వద్ద భోజనం వండి ఆసుపత్రికి చిన్న క్యారేజ్‌ల్లో తీసుకువచ్చారు. భోజనం ఎలాఉందో వైద్యాధికారులు పర్యవేక్షణ చేయడంలేదు. నాణ్యతలేని భోజనం కారణంగా చాలామంది తీసుకునేందుకు ఇష్టపడటంలేదు. నక్కపల్లి, మిగతా చోట్లా భోజనం అంతంతమాత్రంగానే అందిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి రమేశ్‌ కిశోర్‌ వద్ద ప్రస్తావించగా, ‘డైట్‌ బిల్లులు డిసెంబర్‌ వరకు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్లో అప్‌లోడ్‌ చేసేశాం. త్వరలోనే అందుతాయి. నిర్వాహకులు బిల్లుల బకాయిలపై వినతులైతే ఇచ్చారు.. ఆహార సరఫరా నిలిపేస్తామని చెప్పలేదు. ఆ పరిస్థితి రాకుండా, రోగులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామ’ని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని