logo

వైకాపా హయాంలో ప్రజారోగ్యానికి పాతర

వైకాపా పాలనలో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. పెందుర్తి, చినముషిడివాడ, పురుషోత్తపురంలో యూపీహెచ్‌సీలు ఉన్నప్పటికీ సీహెచ్‌సీకి వచ్చే రోగులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

Published : 17 Apr 2024 03:56 IST

కుంటుపడిన వైద్య సేవలు
కనిపించని స్పెషలిస్టులు
పెందుర్తి, పరవాడ, వేపగంట, సబ్బవరం, న్యూస్‌టుడే

వైకాపా పాలనలో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. పెందుర్తి, చినముషిడివాడ, పురుషోత్తపురంలో యూపీహెచ్‌సీలు ఉన్నప్పటికీ సీహెచ్‌సీకి వచ్చే రోగులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలున్నాయి. రోజుకొక స్పెషలిస్టు వైద్యుడితో సేవలందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కనీసం బోర్డులో పేర్లు కూడా నమోదు చేయలేని స్థితిలో ఉంది. ఏ రోజు ఏ స్పెషలిస్టు వైద్యుడు వస్తాడో తెలియని అవస్థ నెలకొంది. పెందుర్తి సీహెచ్‌సీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. యాంటీబయాటిక్‌ మందులు, బీ కాంప్లెక్సు మందుల కొరత ఉంది. గర్భిణులకు స్కానింగ్‌ సేవలు అందడం లేదు. అంబులెన్సు లేకపోవడంతో రోగులకు ఆర్థిక భారంగా మారింది.

పీహెచ్‌సీ లేకపోతే వైద్య సేవలెలా..: పెందుర్తి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో గ్రామాల్లో వైద్య సేవలు కుంటుపడ్డాయి. పెందుర్తిలో యూపీహెచ్‌సీ శిథిల భవనంలోనే కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత వైద్యులు అందుబాటులో ఉండట్లేదు. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు పెందుర్తి సీహెచ్‌సీకి అంబులెన్సు ఇవ్వడం జరిగింది. ఆ వాహనం ఇప్పుడు కనిపించట్లేదు. యూపీహెచ్‌సీల్లో అరవైకి పైగా వైద్య ఆరోగ్య పరీక్షలు చేస్తామన్నారు, కానీ ముప్పై కూడా జరగడం లేదు.

పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్‌


దూరాభారం: జీవీఎంసీ లంకెలపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన యూపీహెచ్‌సీని గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో జీపీఆర్‌ లేఅవుట్‌ వద్ద నిర్మించారు. అక్కడికి వెళ్లేందుకు వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో పీహెచ్‌సీ ఉంటే ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండేది.

పీవీఎన్‌.మూర్తి, లంకెలపాలెం ఎస్సీకాలనీ


30 నుంచి 10 పడకలకు కుదించారు: సబ్బవరం ఆసుపత్రి స్థాయిని తగ్గించి భ్రష్టు పట్టించారు. గతంలో ఉన్న 30 పడకలను 10కి కుదించేశారు. నాడు అనుభవజ్ఞులైన నలుగురు డిప్యూటీ సివిల్‌ సర్జన్లు ఉండేవారు. పెద్ద ఆపరేషన్లు మినహా మిగిలినవన్నీ ఇక్కడే చేసేవారు. గతంలో ఉండే సర్జన్లు ఇప్పుడు లేరు. శస్త్ర చికిత్స కోసం నగరానికి లేదా ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

గండి ముత్యాలునాయుడు, అమృతపురం


చిన్నపాటి వైద్యానికీ కేజీహెచ్‌కు: గతంలో ఎలాంటి ఆపరేషన్‌ అయినా సబ్బవరం ఆసుపత్రిలో చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఫలితంగా కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. సబ్బవరం ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలి.

ఎన్‌.గోపాల్‌ ఎస్సీ, బీసీ కాలనీ, సబ్బవరం


ప్రత్యేక నిపుణుల రాక అరుదు: నరవలో పట్టణ ఆరోగ్యకేంద్రం ఉంది. ఇక్కడికి రోజుకొక ప్రత్యేక డాక్టరు వస్తారన్నారు. కానీ అలా జరగడం లేదు. చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ప్రత్యేక వైద్యం కోసం నేరుగా కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది.

రాడి అప్పయ్యప్ప, ఇప్పిలివానిపాలెం


అన్ని మందులూ అందుబాటులో ఉండట్లేదు: పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో కొన్ని రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ర్యాబిస్‌ వాక్సిన్‌లు చాలా చోట్ల అరుదుగా ఉంటున్నాయి.

చందక కనకమ్మ, వృద్ధురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని