logo

వంటింటిపై జగనన్న బాదుడు

అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు.

Published : 19 Apr 2024 04:35 IST

మండుతున్న నిత్యావసరాల ధరలు
గగ్గోలు పెడుతున్న జనాలు
పెందుర్తి, సబ్బవరం, పరవాడ, వేపగుంట, న్యూస్‌టుడే

అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. ప్రయివేటు ఉద్యోగులు, కూలీలు, ఇతర రంగాలపై ఆధారపడిన వారి కుటుంబాల జీవనం కష్టతరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం నెలావారీ జీతాలు సక్రమంగా అందక పెరుగుతున్న ధరలకు బాధితులుగా మారిపోయారు. బియ్యం, వంట నూనెల ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో నెలా నెలా మారుతూ భారాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పప్పుల ధరలు మరింత దారుణంగా ఉన్నాయి. గతంలో రూ.200తో కూరగాయలు కొనుగోలు చేస్తే వారమంతా సరిపోయేవి. ఇప్పుడు రూ.500 వరకు ఖర్చవుతోంది. ఇలా ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా పట్టుకుంటే మండిపోయేంత ధరలు సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాయి.

ఇదంతా చూస్తున్న జగనన్న చిరునవ్వులు చిందిస్తూ జనాలకు సంక్షేమ పథకాలు అందించానని బీరాలు పలుకుతున్నారు.


ధరలు చూస్తే వామ్మో

నిత్యావసర సరకుల ధరలు చూస్తే గుండె గుబేలుమంటోంది. నెలానెలా మారిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయంలో వృద్ధి ఉండట్లేదు. ఫలితంగా పిల్లల చదువులు, ఇతర అవసరాలపై ప్రభావం పడుతోంది.

పి.గాయత్రి, గృహిణి


రెండింతలు పెరిగాయి

నాలుగేళ్లలో రెండింతలు పెరిగిపోయాయి. ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ధరల మంటల్లో ఎక్కడా ఉపయోగపడినట్టు లేదు. ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ఏ రోజూ మాట్లాడలేదు.

ఎస్‌.వీ.రాణి, వేపగుంట


ఇళ్లు గడవాలంటే కష్టమే

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పులు, బియ్యం, నూనె, గ్యాస్‌, ఇంటి అద్దెలు, కూరగాయలు తదితర ధరలు అమాంతం పెరిగిపోయాయి. రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పంచŸదార తప్ప ఏమీ ఇవ్వడం లేదు. నాలుగేళ్ల క్రితం నెలకు రూ.4 వేలు అయ్యే కిరాణా బిల్లు ఇప్పుడు ఏకంగా రూ.8 వేలు వరకు అవుతోంది.

జి.సునీత


అమాంతం పెరిగిపోయాయి

వైకాపా పాలనలో ధరలు అమాంతంగా పెరిగిపోతున్నా నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కందిపప్పు గతంలో కిలో రూ.80 ఉంటే ఇప్పుడు రూ.160 దాటింది. సామాన్యులు అల్లాడిపోతున్నారు. విద్యుత్తు బిల్లు, పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్‌, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 

కాకి శ్రీను


ఆకాశాన్నంటుతున్నాయి..

వైకాపా ప్రభుత్వంలో పెరగని వస్తువు ధరంటూ ఏదీ లేదు. ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం, మసాలాలు ఇలా ఏ వస్తువు చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో రూ.20 ఉన్న కిలో సాధారణ బియ్యం ఇప్పుడు రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది.

నక్కా ఈశ్వరరావు గొట్టివాడ


గతంలో రూ.100కే సంచి నిండేది

తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.100కే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. అదే సంచి ఇప్పుడు నిండాలంటే రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మళ్లీ వైకాపా ప్రభుత్వం వస్తే ఇక తినడానికి, ఉండడానికి ఏదీ మిగలదు.   

పల్లా సన్యాసిరావు,  గొల్లలపాలెం


ఈ ప్రభావం పిల్లలపై పడుతోంది

పేద, మధ్య తరగతి కుటుంబాలు సంపాదించిన సంపాదనలో కొంత పిల్లల పేరున పొదుపు చేయాలంటే తప్పకుండా ధరలు అదుపులో ఉండాలి. గత ఐదేళ్లలో ఏ రోజూ నిత్యావసర ధరలు తగ్గిన సందర్భాలు లేవు.   

సంబాన రాజు, వేపగుంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని