logo

రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు.

Published : 30 Apr 2024 07:02 IST

పోతిన సత్యనారాయణ (పాతచిత్రం)

పీఎంపాలెం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆ వివరాలిలా.. మధురవాడ చంద్రంపాలెంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి పోతిన సత్యనారాయణ(46), భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. రుషికొండలోని ఓ ప్రయివేటు విద్యాలయంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమారుడి వద్దకు సోమవారం ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మధురవాడ ఐటీహిల్స్‌ రోడ్డు బ్రిక్స్‌ కంపెనీ సమీపానికి వచ్చే సరికి ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా మలుపు తిరగడంతో ఆయన అకస్మాత్తుగా బ్రేకులు వేసి రోడ్డుపై పడ్డారు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న వేరొక ద్విచక్రవాహనం అతని మెడ భాగాన్ని తొక్కించుకుంటూ వెళ్లడంతో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


కియా అనుబంధ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య

ఉపేంద్ర

గోరంట్ల, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలోని బైపాస్‌వీధిలో నివాసం ఉంటున్న ఉపేంద్ర అనే యువకుడు సోమవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను పాలసముద్రం సమీపంలో ఉన్న కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడి సొంతూరు విశాఖపట్టణానికి చెందిన బొస్తపేటగా ఆధార్‌కార్డు ద్వారా గుర్తించారు. బీటెక్‌ చదివిన ఉపేంద్ర కియా అనుబంధ సంస్థలో పనిచేస్తూ గోరంట్లలో ఉంటున్నట్లు సహచరులు పేర్కొన్నారు. ఉపేంద్ర, మరో వ్యక్తి ఒకే రూంలో ఉంటున్నారని, అతను తెల్లవారుజామున లేచి చూసేసరికి స్నానపు గదిలో ఉరి వేసుకున్నట్లు వెలుగు చూసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని