logo

ఎన్నికల పండక్కి.. విశాఖకు రండి!

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో జగన్‌ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు.

Published : 01 May 2024 03:39 IST

దేశంలోని పలు ప్రాంతాల్లో నగర వాసులు
ముందస్తు ప్రణాళిక ఉంటే మేలు
ఓటు హక్కు వినియోగిస్తేనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు
ఈనాడు, విశాఖపట్నం

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో జగన్‌ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా రాష్ట్రం వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు.

నెల 13న ఎన్నికల పండగ జరగనుంది. ఆ రోజు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఉపయోగించుకొని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు. విశాఖకు చెందిన అధిక సంఖ్యలో ఓటర్లు వృత్తి, వ్యాపార, విద్యావసరాల దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వీరంతా ఆ రోజు నగరానికి వచ్చి ఓటేయాలంటే...ముందస్తుగా ప్రణాళిక చేసుకోక తప్పదు. రైళ్లు, బస్సులు రద్దీగా ఉన్నాయని, టికెట్లు దొరకలేదని నిర్లిప్తత వహిస్తే భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే బంగారంలాంటి అవకాశం చేజారిపోతుంది.

విశాఖ జిల్లాకు చెందిన అధిక సంఖ్యలో యువత ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. పెద్ద సంఖ్యలోనే యువతీ, యువకులు చదువులు సాగిస్తున్నారు. వీరిలో యువతులు, మహిళలు ఉన్నారు. ఐటీ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారూ అధికమే. అలాగే వివిధ రకాల వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం కొంతకాలం ఆయా ప్రాంతాల్లో ఉంటున్నవారూ లేకపోలేదు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వారు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ముంబయి, దిల్లీలోని ఐటీ సంబంధిత కంపెనీల్లో అధికంగా పనిచేస్తున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంది. అలాగే కోల్‌కతా, భువనేశ్వర్‌, కొన్ని ఉత్తరాది ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తున్న వారూ ఉన్నారు. వీరే కాకుండా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రి పనులు చేసేవారు ఎక్కువే. కొన్ని నెలల పాటు అక్కడ ఉండి వస్తుంటారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల నిమిత్తం నగరానికి వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలి. ఇందుకు ముందస్తు రిజర్వేషను తప్పదు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే రోజున ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు  తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే...సమర్థ నేతను ఎన్నుకోవచ్చు.


ఓటింగు శాతం పెంచేలా: ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు తప్పకుండా వచ్చి ఓటేస్తే నగరంలో ఓటింగ్‌ శాతం మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో 65 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఈసారి 75 శాతానికిపైగా పోలింగ్‌ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అపార్టుమెంటు వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాసితులు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని