logo

పోస్టల్‌ బ్యాలెట్‌లో కొరవడిన ముందుచూపు

జిల్లావ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.  జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి.

Published : 09 May 2024 04:00 IST

ఓటేయకుండా వెనుదిరిగిన ఉద్యోగులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.  జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ఆరు గంటల తరువాత లైన్‌లో ఉన్న అందరికీ ఓటు హక్కు కల్పించారు. పీవోలు, ఏపీవోలు, సూక్ష్మపరిశీలకులు, ఇతర పోలింగ్‌ అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటు హక్కు వినియోగానికి తరలివచ్చారు. ఆరు నియోజకవర్గాల్లో మూడు రోజుల్లో 14162 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. అత్యధికంగా అనకాపల్లి నియోజకవర్గంలో 2926 మంది, అత్యల్పంగా పాయకరావుపేట 1876 మంది వినియోగించుకున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోపంతో కసితో ఉద్యోగులు ఓటు వేశారని తెలుస్తుంది.

అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో బుధవారం గందరగోళం నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు బ్యాలెట్‌ ఇవ్వకపోవడంతో అక్కడే ఉన్న ఏఆర్వో, సిబ్బందిని ప్రశ్నించారు. విశాఖపట్నానికి చెందిన అత్యవసర విభాగానికి చెందిన ఉద్యోగులకు ఓటు వేయడానికి బ్యాలెట్‌ ఇవ్వలేదు. దీంతో వీరంతా గందరగోళానికి గురయ్యారు. మాడుగులకు చెందిన 25 మంది వైద్య సిబ్బందికి అవకాశం కల్పించలేదు. దీంతో వీరు ఎన్నికల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఐదురెట్లుకు పైగా ఉద్యోగులు ఊహించని విధంగా తరలిరావడంతో ఏర్పాట్లు చేయడంలో జిల్లా ఎన్నికల అధికారులు విఫలమయ్యారు. సంబంధిత ఉద్యోగులకు బ్యాలెట్‌ సరిపోకపోవడంతో అప్పటికప్పుడు ప్రింటింగ్‌ చేయించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు ఓటు వేయడానికి అవకాశం లేకుండా పోయింది.  
సొంత జిల్లాలో ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రెండు రోజులు అవకాశం కల్పించిందని, చాలా మంది ఇక్కడే ఓటు వేయడానికి ఆసక్తి చూపడంలో బ్యాలెట్‌ సమస్య ఏర్పడిందని రోజారాణి పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోలేని ఉద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదని మే 13న జరిగే పోలింగ్‌లో సొంత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి నేరుగా ఓటు వేయవచ్చన్నారు. ఆరోజు ఆ ఉద్యోగులకు సెలవు సైతం ఇస్తారన్నారు.


కొత్తగా దరఖాస్తు చేసిన వారికీ...

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మూడోరోజు ఉత్సాహంగా పోలింగ్‌ జరిగింది. ఎన్నికల విధులకు నియమించిన ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ విద్యార్థులు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్టీసీ, వైద్యఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఓటు వేశారు. కొత్తగా ఎన్నికల విధులకు నియమించిన వారు ఇక్కడికి చేరుకుని ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరికీ తహసీల్దార్‌ ఓటు హక్కు కల్పించారు. 900 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు