logo

అప్పన్న నిజరూప దర్శనం రేపు

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుక చందనోత్సవం సింహగిరిపై శుక్రవారం వైభవోపేతంగా జరగనుంది.

Published : 09 May 2024 04:24 IST

చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుక చందనోత్సవం సింహగిరిపై శుక్రవారం వైభవోపేతంగా జరగనుంది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ మల్లికార్జున ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. సుమారు లక్ష మంది భక్తులు నిజరూప దర్శనం చేసుకుంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరించారు. ఆ వివరాలేమిటంటే..

  • గురువారం సాయంత్రం 6గంటల తర్వాత సింహగిరిపైకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. మెట్లమార్గంలో రాకపోకలు కూడా రద్దు చేశారు. రాత్రి 7 గంటలకు సింహగిరిపై దర్శనాలు నిలిపివేస్తారు.
  • శుక్రవారం వేకువజామున ఒంటి గంటకు ఆలయంలో అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజలు చేస్తారు. అనంతరం స్వామి దేహంపై ఉన్న చందనాన్ని విసర్జన చేసి నిజరూపంలోకి తీసుకువస్తారు. 3గంటల నుంచి 3.30గంటల మధ్య ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పిస్తారు. 5గంటల వరకు ప్రముఖులకు దర్శనాలు కల్పిస్తారు. వేకువజామున 4గంటల నుంచి ఉచితం, రూ.300, రూ.వెయ్యి దర్శనాలు ప్రారంభిస్తారు. ఉదయం 5గంటల నుంచి రూ.1500 టికెట్ల భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి ఒంటి గంట నుంచే కొండ దిగువ నుంచి బస్సులు ప్రారంభమవుతాయి. 2గంటల నుంచి కొండపైన క్యూలైన్లలోకి భక్తులను అనుమతిస్తారు. ఈసారి ప్రముఖులు సహా భక్తులెవరికీ అంతరాలయ దర్శనాలు లేవు. ఉచితంతో పాటు అన్ని టికెట్ల భక్తులు నీలాద్రి ద్వారం నుంచే దర్శనాలు చేసుకోవాలి.
  •  గత వైఫల్యాల నేపథ్యంలో ఈసారి టికెట్ స్లాట్లను పక్కాగా అమలు చేసేందుకు నిర్ణయించారు. ఆ మేరకు కొండ దిగువనే భక్తులను స్లాట్ల వారీగా పంపించేందుకు ఆరు చోట్ల హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నారు. హోల్డింగ్‌ పాయింట్ల వద్దే భక్తులు తమ వాహనాలు పార్కింగ్‌ చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో కొండపైకి రావాల్సి ఉంటుంది.
  • ఉచిత దర్శనం భక్తుల కోసం పాత అడివివరం మామిడి తోట వద్ద హోల్డింగ్‌ పాయింటు ఏర్పాటు చేశారు. అక్కడే భక్తులు వాహనాలు నిలిపివేసి ఉచిత బస్సుల్లో సింహగిరికి వెళ్లాలి. రూ.300 టికెట్ల భక్తులు గురుకుల పాఠశాల హోల్డింగ్‌ పాయింటు వద్ద పార్కింగ్‌ చేసి బస్సెక్కాలి. రూ.వెయ్యి, రూ.1500 టికెట్ల భక్తులు కృష్ణాపురం గోశాల వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసి ఉచిత బస్సుల్లో సింహగిరికి చేరుకోవాలి.
  • గోపాలపట్నం, వేపగుంట వైపు నుంచి వచ్చే ఉచిత దర్శనం భక్తులకు సింహాచలం ఆర్టీసీ బస్‌స్టాండు వద్ద, రూ.300 దర్శనం టికెట్ల భక్తులకు పాత గోశాల కూడలిలో, రూ.వెయ్యి, రూ.1500 టికెట్ల భక్తులకు శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం కల్యాణ మండపాల వద్ద హోల్డింగ్‌ పాయింట్లు కేటాయించారు. ఆయా భక్తులు అక్కడే వాహనాలు పార్కింగ్‌ చేసుకుని ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలి.
  • 10వ తేదీ రాత్రి 6గంటల తర్వాత సింహగిరి రెండు ఘాట్రోడ్లు, మెట్లమార్గం మూసివేస్తారు. ఆయా మార్గాల్లో వాహనాలను, భక్తులను కొండపైకి అనుమతించరు. రాత్రి 7గంటలకు సింహగిరిపై క్యూలైన్లలోకి ప్రవేశం నిలిపివేసి గేట్లకు తాళాలు వేస్తారు. అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్న భక్తులందరికీ నిజరూప దర్శనం కల్పిస్తారు.

ఇతర సదుపాయాలు: కొండపైన, దిగువన వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, సేవా సంస్థల సేవలు, జీవీఎంసీ ద్వారా పారిశుద్ధ్యం నిర్వహణ, అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు ఏర్పాటు చేశారు. హోల్డింగ్‌ పాయింట్లు, క్యూలైన్లు, మెట్లమార్గం, తదితర అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంచారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు