logo

వేగవంతమైన అభివృద్ధి సాదిస్తున్నాం

ఉన్నత స్థానాల్లో ఉన్న జిల్లాకు చెందిన వ్యక్తులు గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, పల్లెలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Published : 27 Jan 2022 05:50 IST

 దేశంలోని 20 జిల్లాల్లో విజయనగరానికి స్థానం 
 గ్రామాలను దత్తత తీసుకోవాలి 
 గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ 


 జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్, ఎస్పీ, జేసీలు

దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్న 20 జిల్లాల్లో విజయనగరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించారని, ఇది అందరికీ గర్వకారణం.- సూర్యకుమారి, కలెక్టర్‌

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉన్నత స్థానాల్లో ఉన్న జిల్లాకు చెందిన వ్యక్తులు గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, పల్లెలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అన్ని రంగాల్లో సత్వరాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేసుకునేలా చూస్తున్నామని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా అభివృద్ధిని చాటుతూ సాగిన శకటాల ప్రదర్శన, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పి.రఘువర్మ, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ అవనాపు భావన, జేసీలు కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, మయూర్‌ అశోక్‌ పాల్గొన్నారు.


విద్యార్థుల నృత్య ప్రదర్శన

మెరుగైన వైద్యం కోసం..
* జిల్లాలో సుమారు రూ.764.29 కోట్ల వ్యయంతో ఆసుపత్రుల ఆధునికీకరణ, పడకల పెంపు, కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. పార్వతీపురంలో రూ.49.26 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో 70 ఎకరాల విస్తీర్ణంలో 500 పడకల సామర్థ్యంతో  వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.


గౌరవ వందనం సమర్పిస్తున్న జిల్లా అధికారులు 

జలకళ- ప్రా‘ధాన్యం’
*1,23,425 ఎకరాలకు సాగునీరు అందించే సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీ పనులను 2022 ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు రూ.120 కోట్లు వచ్చాయి. 
* 24,640 ఎకరాలకు నీరందించే జంఝావతి రిజర్వాయర్‌ పనులు, 24,700 ఎకరాలకు జలాలు ఇచ్చే తారకరామ తీర్థసాగర్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. 
* జైకా నిధులతో మధ్యతరహా ప్రాజెక్టులను రూ.181.77 కోట్లతో, చిన్నతరహా నీటి పారుదల ప్రాజెక్టులను రూ.29.03 కోట్లతో ఈ ఏడాది ఆధునికీకరించనున్నాం. 
* జిల్లాలో ఇప్పటి వరకు 39,245 మంది రైతుల నుంచి రూ.348.81 కోట్ల విలువ గల సుమారు 2 లక్షల టన్నుల ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 


వేడుకల్లో జడ్పీ ఛైర్మన్, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 

గృహయోగం
* నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో 1,01,368 గృహాలు మంజూరు చేశాం. వీటిలో 69,586 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కాగా.. 3,591 పూర్తయ్యాయి. లబ్ధిదారులకు రూ.152.99 కోట్ల బిల్లులు  చెల్లించాం. పట్టణ ప్రాంతాల్లో 2010 టిడ్కో ఇళ్లను అందజేయడానికి సిద్ధం చేశాం. 
* ఉపాధి హామీ వేతనదారులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2.68 కోట్ల పనిదినాలకు ఇప్పటి వరకు 2.25 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 
* భోగాపురం విమానాశ్రయానికి 2,723.78 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. దీని ద్వారా  విజయనగరం ఖ్యాతి అంతర్జాతీయంగా వ్యాప్తి చెందనుంది. 
* భారతమాల ప్రాజెక్టు కింద విశాఖ-రాయ్‌పూర్‌ హరిత రహదారి జిల్లాలో 52 గ్రామాలను కలుపుతూ వెళ్లనుంది. ఇందుకు ఇప్పటికే రూ.151.94 కోట్ల నిధులు మంజూరయ్యాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని