logo

నిలిచిన ఉచిత బియ్యం పంపిణీ

కొవిడ్‌ విపత్కర పరిస్థితులున్నప్పుడు పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈ నెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత నెలలో పంపిణీ నిలిపివేసినా.. మే నెలలో ఇస్తారని అధికారులు చెప్పారు. ఈ నెల 20వ తేదీ

Published : 23 May 2022 04:13 IST

నగరంలో రేషన్‌ అందజేత

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కొవిడ్‌ విపత్కర పరిస్థితులున్నప్పుడు పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈ నెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత నెలలో పంపిణీ నిలిపివేసినా.. మే నెలలో ఇస్తారని అధికారులు చెప్పారు. ఈ నెల 20వ తేదీ వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి ఆదేశాలూ లేకపోవడంతో అసలు బియ్యం ఇస్తారా...?, ఇవ్వరా...?, అన్న అనుమానం పేదల్లో నెలకొంది.

5.71 లక్షల మంది ఎదురుచూపు

కొవిడ్‌ మొదటి దశ లాక్‌డౌన్‌ సందర్భంలో పేదలను ఆదుకునే ఉద్దేశంతో కేంద్రం బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రధానమంత్రి గరీబ్‌ యోజన ద్వారా ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. అప్పటి నుంచి పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ ఏడాది మార్చితో ఉచిత పథకం ముగియాల్సి ఉన్నప్పటికీ.. కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. కిలో రూపాయి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న బియ్యానికి ఇవి అదనం. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇచ్చేవారు. ఆ తర్వాత రేషన్‌ డిపోల ద్వారా కేంద్రం అందించే ఉచిత బియ్యాన్ని కార్డుదారులకు అందజేసేవారు. గత మార్చి వరకూ ఎటువంటి అవాంతరాలూ రాలేదు. ఏప్రిల్‌ నెలలో ఉచిత కోటా ఇవ్వలేదు. జిల్లాల విభజన నేపథ్యంలో కార్డుదారుల మ్యాపింగు, ఇతర సాంకేతిక కారణాలతో రాష్ట్ర వాటా రేషన్‌ పంపిణీలో కొన్ని రోజులు ఆలస్యమైంది. జిల్లాలో 5,71,703 బియ్యం కార్డులుండగా.. వీటికిగానూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యునికీ 5 కిలోల బియ్యం, రాయితీపై కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను అందజేస్తోంది. కార్డుదారులకు నెలకు 9,057 టన్నుల బియ్యం అవసరం. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం కూడా దాదాపు ఇదే పరిమాణంలో విడుదల చేయాలి. ప్రస్తుతం నెలలో మూడో వారం దాటిపోతున్నా ఇప్పటి వరకూ ఉచిత బియ్యం ఊసే లేదు. ఈ నెల కోటాకు సంబంధించి అసలు పంపిణీ ఉందా, లేదా అన్న విషయం కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు.

దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి ఎ.పాపారావును వివరణ కోరగా ఈ నెల ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని తెలిపారు. వచ్చిన వెంటనే సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని