logo

నమ్మించి.. నట్టేట ముంచారు

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు.

Published : 26 Apr 2024 03:36 IST

ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని వైకాపా
సర్కార్‌ రోడ్డెక్కినా పట్టించుకోని జగన్‌ 

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. గద్దె ఎక్కిన తర్వాత ఆ దిశగా ఒక్క అడుగు వేయకపోగా.. కొత్త సమస్యలు సృష్టించారు. పరిష్కరించాలని రోడ్డెక్కిన ఉద్యోగులను అణచివేసే ప్రయత్నం చేశారు.

న్యూస్‌టుడే, గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ గ్రామీణం, బొబ్బిలి, గ్రామీణం, తెర్లాం రాజాం

బకాయిలు రూ.కోట్లలో..

ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్‌ నిధుల బకాయిలు వైకాపా ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతి ఏటా అందించాల్సిన డీఏ బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. ఇతర అలవెన్సులు ఇవ్వలేదు. ఐదేళ్లుగా ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోలేని పరిస్థితి. పదవీ విరమణ తర్వాత పింఛను సకాలంలో మంజూరు చేయడం లేదు. ఆన్‌లైన్‌లో సేవలు పెట్టి, ఒత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • బొబ్బిలి నియోజకవర్గంలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 4,000 మంది ఉన్నారు. ఇతర మండలాల్లో పనిచేస్తూ బొబ్బిలిలో నివాసం ఉంటున్న మరో 2,000 మంది ఉన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో దాదాపు 6,000, రాజాం నియోజకవర్గంలో 2,000 మందికిపైగా ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు.  వీరు జగన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులు, ఈఎంఐలు కట్టలేకపోయాం

ఐదేళ్లలో మేము ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులుపడ్డాం. సకాలంలో జీతాలు అందక పిల్లలకు ఫీజులు, ఈఎంఐలు చెల్లించలేకపోయాం. పీఆర్‌సీ, డీఏలు విడుదల చేయకపోవడంతో చాలా నష్టపోయాం. జగన్‌ అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి.. మమ్మల్ని మోసం చేశారు. అంతేగాక జీపీఎస్‌ పేరుతో కొత్త నాటకం ఆడారు. పాఠశాలలకు ఇవ్వాల్సిన ఖర్చులు కూడా విడుదల చేయలేదు.

ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు, దత్తిరాజేరు మండలం

ఇబ్బందులు పెడుతున్నారు

సీపీఎస్‌ రద్దు చేయాలని ఐదేళ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనకు దిగినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి.. 3, 4, 5 తరగతుల విలీనంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. చిన్న చిన్న సమస్యలు చూపి సస్పెన్షన్లకు గురిచేశారు.

చింత భాస్కరరావు, జిల్లా యూటీఎఫ్‌ కోశాధికారి, మెంటాడ

బోధనేతర పనులతో ఇక్కట్లు

బోధనేతర పనులు ఎక్కువై, పాఠశాలలో విద్యార్థులకు సరైన బోధన అందించలేకపోతున్నాం. నాడు-నేడు పనుల వల్ల బోధన కుంటుపడింది. 9 యాప్‌లు నమోదు చేసి అప్‌లోడ్‌ చేయడం వల్ల కాలయాపన జరుగుతోంది. చాలా సందర్భాల్లో అంతర్జాలం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ముఖ గుర్తింపు హాజరు పడడంలేదు. సమయం వృథా అవుతోంది.

మునిస్వామి, యూటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షుడు, తెర్లాం

పింఛనుదారుల వెతలు

వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులకు అందించాల్సిన సౌకర్యాలు లేవు. పదవీ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సి బకాయిలు సక్రమంగా అందడం లేదు. పింఛను నిర్ణయించేందుకు జాప్యం చేస్తున్నారు. సీపీఎఫ్‌ నిధులు ఇవ్వలేదు. సీపీఎస్‌ రద్దు చేస్తామని, ఎగ్గొట్టారు.

బూడి సత్యనారాయణ, గంట్యాడ మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యదర్శి

ఇన్ని కష్టాలు ఎప్పుడూ లేవు

డీఏ, పీఎఫ్‌, ఇతర బకాయిలు రూ.20 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. సీసీఎస్‌ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లించలేదు. 117 జీవోతో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే. న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేసింది. గత ఏ పాలనలోనూ ఇన్ని కష్టాలు పడలేదు. 

జేసీ రాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని