logo

నారాయణ.. నారాయణ!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది నారాయణపురం సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి. ఆనకట్ట ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనా పనుల్లో అడుగులు ముందుకు పడడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37,345

Published : 07 Aug 2022 03:13 IST

నత్తనడకన ప్రాజెక్టు  ఆధునికీకరణ పనులు  
ఖరీఫ్‌ సాగునీటికి  రైతుల అవస్థలు
సంతకవిటి, న్యూస్‌టుడే

నాగావళి నదిపై ఆనకట్ట

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది నారాయణపురం సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి. ఆనకట్ట ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనా పనుల్లో అడుగులు ముందుకు పడడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37,345 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగావళి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట పనులు పూర్తికాక శివారు భూములకు అందని దుస్థితి ఏర్పడింది.

అస్తవ్యస్తంగా షట్టర్లు

ఖరీఫ్‌లో రెండు జిల్లాల పరిధిలోని సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని ఆయకట్టుకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీరు అందాలి. ఈ రెండు కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పలుచోట్ల గట్లు కోతకు గురవగా లైనింగ్‌ కొట్టుకుపోయింది. పూడిక పేరుకుపోయింది. సాగునీరు నిలవాలంటే ఆనకట్టపై ఉన్న 118 షట్టర్ల వ్యవస్థ కీలకం. ఇందులో సగం వరకు మరమ్మతులకు గురయ్యాయి. 10 వరకు షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. నీరు వృథాగా పోవడంతో శివారు గ్రామాలకు సాగునీరు ప్రశ్నార్థకమైంది. ఆనకట్ట, కాలువల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నాలుగేళ్ల కిందట జైకా నిధులు రూ.112.10 కోట్లు మంజూరు చేసింది. 2019లో పనులు ప్రారంభించారు. 2020 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కరోనా, అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు 34 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో గడువు పెంచాలని అధికారులు మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

వచ్చే ఏడాదికి పూర్తి చేస్తాం..

 - పి.సుధాకర్‌, ఎస్‌ఈ, నారాయణఫురం ప్రాజెక్టు

కొవిడ్‌  కారణంగా నారాయణపురం ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. కుడి, ఎడమ కాలువల్లో పూర్తిస్థాయిలో పూడికతీతతో పాటు, కొన్ని చోట్ల లైనింగ్‌ పనులు చేపట్టాం. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.                      
       

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని