logo
Published : 28 Jun 2022 06:45 IST

తరుణ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు


మాట్లాడుతున్న కలెక్టర్‌ కృష్ణఆదిత్య, పక్కన అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేష్‌, డీఆర్‌వో రమాదేవి

ములుగు, న్యూస్‌టుడే: వర్షాకాలం ఆరంభం అయినందున సీజనల్‌ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్య ఉప కేంద్రాలలో రక్తపరీక్ష కిట్లు, మందులు, అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల వివరాలను అయా సంక్షేమ అధికారులకు అందించాలన్నారు. ఇసుక ఓవర్‌ లోడింగ్‌ లారీలను సీజ్‌ చేయాలన్నారు. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని రవాణా, గనుల శాఖ అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలైన వెంకటాపురం, కన్నాయిగూడెం, బీరెల్లి, కాల్వపల్లి లాంటి ప్రాంతాలకు బస్‌ సర్వీసు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా రామప్ప, లక్నవరంలలో ఉన్న స్పీడ్‌ బోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి సమస్యలపై 21 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 10, ఇతర శాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు వచ్చాయి. వాటిని వివిధ ప్రభుత్వ శాఖల వారీగా పరిష్కారం నిమిత్తం కలెక్టర్‌ జిల్లా అధికారులకు సిఫారసు చేశారు. అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేష్‌, డీఆర్‌వో రమాదేవి, ఏఎస్పీలు సుధీర్‌, అశోక్‌కుమార్‌, డీఎంహెచ్‌వో అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, డీఈవో జి.పాణిని తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతో లైంగిక వేధింపులకు అడ్డుకట్ట

ములుగు: జిల్లాల్లో పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ కృష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అట్రాసిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 28 ప్రకారం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 69 కేసులకు గాను అర్హులైన 56 మంది బాధితుల కేసుల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి బాధితురాలికి పునరావాసం అందించాలన్నారు. పరిహారం కోసం వచ్చిన ప్రతి కేసును జడ్జిమెంటు వరకు పరిశీలిస్తూ ఏ స్థాయిలో అవసరం ఉన్నా సహాయం అందించాలని సూచించారు. పిల్లలకు సురక్షిత, అసురక్షిత స్పర్శలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గొత్తికోయ గూడేల్లోని గిరిజనులకు బాల్య వివాహాలు, లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని