logo

సకల వసతులు.. కార్పొరేట్‌ హంగులు

కార్పొరేట్‌ భవనాన్ని తలపించే హంగులు.. గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా గదులు.. సకల వసతులతో ఆకట్టుకునేలా జిల్లా పోలీసు కార్యాలయం సిద్ధమవుతోంది.

Published : 09 Aug 2023 03:38 IST

తుది దశకు జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణం
న్యూస్‌టుడే, భూపాలపల్లి క్రైం

కార్పొరేట్‌ భవనాన్ని తలపించే హంగులు.. గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా గదులు.. సకల వసతులతో ఆకట్టుకునేలా జిల్లా పోలీసు కార్యాలయం సిద్ధమవుతోంది. నిర్మాణం రాజ భవనాన్ని తలపిస్తోంది.. జిల్లాల ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం పోలీసు కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్‌కాలనీ చివర్లో మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. భవన నిర్మాణం పూర్తయింది. గదులు తుది మెరుగులు దిద్దే దశలో ఉన్నాయి. భవనం మొత్తం రంగులు అద్దుతున్నారు. విద్యుత్తు, నీటి వసతి పనులు జరుగుతున్నాయి. చివరగా ముఖ ద్వారం నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయాలన్నీ దాదాపు ఇదే నమూనాతో నిర్మిస్తున్నారు.

రూ.17 కోట్లతో నిర్మాణం

భూపాలపల్లిలో నిర్మించే భవన నిర్మాణం పోలీసు హౌజింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతోంది. రూ.17 కోట్ల వ్యయంతో 49,000 చదరపు గజాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకునేలా ఇంజినీరింగ్‌ పరిజ్ఞానం ఉన్న భవన సముదాయంలో అనేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో..

ఇందులో మొత్తం 16 విభాగాలుంటాయి. ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్‌డీలు, సీసీలు, పీఆర్వోలకు వేర్వేరుగా గదులుంటాయి. స్పోర్ట్స్‌, ఇన్‌, అవుట్‌ వార్డులతోపాటు పాస్‌పోర్టు విచారణ, ఐటీసీ విభాగాలున్నాయి. రిసెప్షన్‌తోపాటు గ్రీవెన్స్‌ కోసం ప్రత్యేకంగా హాలు ఉంది.

21 గదులు..

మొదటి అంతస్తులో పరిపాలన విభాగంలోని ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్‌లు, వారికి ప్రత్యేకంగా రికార్డు గదులు, మినీ కాన్ఫరెన్సు హాలు, న్యాయసేవా విభాగం ఇలా అన్నీ కలిసి మొత్తం 21 గదులున్నాయి. ఇందులోనే స్పెషల్‌ బ్రాంచ్‌కు కేటాయించారు.

రెండో అంతస్తులో..

ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌, సీసీటీఎన్‌ఎస్‌తో పాటు నేర పరిశోధనలోని ప్రత్యేక విభాగాలకు కేటాయించారు. ఐటీ కోర్‌, సీఆర్‌డీ అనాలసిస్‌, సైబర్‌ల్యాబ్‌, ఫింగర్‌ ప్రింట్‌, క్లూస్‌టీం, డీసీఆర్‌బీ, రిపోగ్రాఫిక్‌, పీడీ సెల్‌, డిజిటల్‌ శిక్షణ ల్యాబ్‌తో పాటు మహిళా పోలీసు సిబ్బంది విశ్రాంతి గదులు ఉన్నాయి. టెర్రస్‌పైన కాన్ఫరెన్స్‌ హాలు, శిక్షణ కేంద్రంతో పాటు ఉద్యోగుల కోసం భోజనశాల ఏర్పాటు చేశారు.

ఈ నెలాఖరులో ప్రారంభం

భూపాలపల్లిలోని మంజూర్‌నగర్‌లో కొత్తగా నిర్మించే కలెక్టర్‌ కార్యాలయం పనులు కూడా పూర్తయ్యాయి. రంగులు వేస్తున్నారు. ఇటీవల ప్రధాన రహదారి నిర్మించారు. కలెక్టర్‌ కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు కార్యాలయం ఒకేసారి ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభంకానున్నాయి.  


పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి

-పుల్లా కరుణాకర్‌, ఎస్పీ  

నూతన జిల్లా పోలీసు కార్యాలయం అన్ని వసతులతో ఉంది. ప్రభుత్వం పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త భవనాలు నిర్మించి కార్యాలయాలు ఏర్పాటు చేస్తోంది. పోలీసు అధికారులు, సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేలా చేస్తోంది. ఇప్పటికే పోలీసు శాఖకు కొత్త వాహనాలు సమకూర్చింది. కొద్ది రోజుల్లో జిల్లా పోలీసు కార్యాలయ ప్రారంభం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని