logo

సమయం విలువ తెలుసుకో.. కాలంతో సాగిపో

24 గంటలు అంటే.. ఒక్క రోజులో ఏం చేయగలం.. తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు.   హనుమకొండలోని ప్రధాన గ్రంథాలయం, రామన్నపేటలోని స్మార్ట్‌ లైబ్రరీతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  గ్రంథాలయాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు

Published : 25 Aug 2023 05:06 IST

ఆగస్టు 23.. సాయంత్రం 6.04 గంటలు

ఇస్రో శాస్త్రవేత్తలు ముందే ప్రకటించినట్లు విక్రమ్‌ ల్యాండర్‌  చందమామపై దిగిన  సమయం.

‘ఒక్క సెకను ఆలస్యమైతే క్రీడాకారులు పతకాన్ని ముద్దాడలేరు..నిమిషం వెనకబడినా విద్యార్థుల భవితవ్యం తలకిందులవుతుంది..ఓ రోగిని అడిగితే చెబుతాడు చికిత్స గంట జాప్యమైతే కలిగే బాధ ఏంటని..గడువులోపు కావాల్సిన ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోతే రూ.కోట్ల ప్రజాధనం వృథా..

గంటలు.. నిమిషాలే కాదు సెకన్లతో సహా అన్ని దశల్లో సమయపాలన పాటించడం వల్లే చంద్రయాన్‌-3 విజయం సాధ్యమైంది.  సమాజంలో సమయపాలన పాటించని వాళ్లెందరో.. సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు.. ఇలా అన్ని దశల్లో ఆలస్యం చేయడంతో దాని వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతుంటాయి. ఈ క్రమంలో  కాలం విలువ తెలుసుకొని ముందుకు సాగితే ఎంతో సాధించవచ్చని చంద్రయాన్‌- 3 విజయం ద్వారా తెలుసుకోవచ్చు. ఆలస్యం అమృతం విషం’ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం తెలిసినవాళ్లు జీవితంలో అద్భుత  విజయాలు సాధిస్తారు.


ఒక్క రోజూ  వృథా చేయొద్దు

24 గంటలు అంటే.. ఒక్క రోజులో ఏం చేయగలం.. తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు.   హనుమకొండలోని ప్రధాన గ్రంథాలయం, రామన్నపేటలోని స్మార్ట్‌ లైబ్రరీతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  గ్రంథాలయాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా, బద్ధకాన్ని వీడి చదివితే కచ్చితంగా విజయం దరిచేరుతుంది.  ఒక్కరోజులో చదివిన పాఠ్యాంశాల నుంచి రెండు బిట్లు వస్తే చాలు మేటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగ సాధనలో ఒక్క రోజు కూడా వృథా చేయొద్దు. అలాగే ప్రతి నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది.

హనుమకొండ గ్రంథాలయంలో  పరీక్షలకు సిద్ధమవుతున్న యువత


సెకను..తారుమారు చేస్తుంది..

ఒక్క సెకను.. క్రీడాకారులు, దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఎంతో కీలకం. రెండు, మూడు సెకన్లు ముందు వచ్చిన అభ్యర్థులు నెగ్గుతారు. వెనకబడ్డ వారు ఓడిపోతారు. క్రీడాకారులు, పోలీసు, సైనిక దేహదారుఢ్య పరీక్షల అభ్యర్థుల భవితవ్యం సెకన్ల తేడాలోనే ఉంటుందని చెప్పడానికి ఇటీవల జరిగిన సంఘటనలు ఉదాహరణ
ః గతేడాది డిసెంబరు, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేయూ మైదానంలో పోలీసులు ఎంపిక ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇందులో ఉమ్మడి వరంగల్‌ నుంచి సుమారు 24 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో  17 వేల మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. గమ్యం చేరుకోవడంలో సెకన్ల తేడాతో ఆలస్యమై వేలాది మంది అర్హత సాధించలేదు. 2021లో హనుమకొండ జేఎన్‌ఎస్‌లో జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి. అందులో విజేతలు అందరికన్నా సెకన్ల ముందు పరుగెత్తి మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. అందుకే ప్రతి సెకను ఎంతో విలువైనదిగా భావించి శ్రమిస్తే విజయం సొంతమవుతుంది.


గంటలు.. నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం  

ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు చేయాలి. మన దగ్గర అనేక మంది  ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు గంటల తరబడి ఆలస్యంగా విధులకు వస్తున్నారు.
ఉదాహరణకు గురువారం హనుమకొండ కలెక్టరేట్కు వెళ్లి ఖజానా కార్యాలయంలో ‘ఈనాడు’ పరిశీలిస్తే.. ఉదయం పదిన్నర లోపు రావాల్సిన ఉద్యోగి  11 గంటల వరకు కూడా విధులకు రాలేదు. పింఛన్లు, ఇతర అవసరాల కోసం కార్యాలయాలకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వరంగల్‌ ఎంజీఎంలో సైతం ఇదే పరిస్థితి. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యుల్లో కొందరు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నట్లు రోగులు వాపోతున్నారు.  

 


అద్భుతాలకు అదే కీలకం..
ఆచార్య లక్ష్మారెడ్డి, విశ్రాంత అధ్యాపకుడు, నిట్

చంద్రయాన్‌ 3 ప్రయోగంలో ప్రతి దశ సమయంతో ముడిపడి ఉన్నదే. మిల్లీ సెకన్లను కూడా పరిగణించే అణు గడియారాలను ఉపయోగించి సమయాన్ని లెక్కిస్తారు.   సమయపాలన పాటిస్తే అద్భుత ఆవిష్కరణలు మన సొంతం అవుతాయి.  


‘చంద్రయాన్‌’ నేర్పుతున్న పాఠం
ప్రతి నిమిషం.. విద్యార్థులకు కీలకం  

ఒక్క నిమిషమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితమే అంధకారం అవుతుంది. విద్యార్థులు ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి శ్రమించాలి. సమయపాలన పాటించడం చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. పోటీ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా నిర్వాహకులు లోనికి అనుమతించరు. సంవత్సరమంతా కష్టపడి చదివింది వృథా అవుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్‌లో పది, ఇంటర్‌, ఎంసెట్‌, జేఈఈ లాంటి అనేక రకాల పరీక్షలకు చివర్లో హడావుడిగా పరుగెత్తుకొచ్చినా నిమిషం ఆలస్యంతో దూరమైన వారు ఉన్నారు. ఎంత ప్రాధేయపడినా అమతించని సందర్భాలు అనేకం చూశాం. సమయపాలన ప్రాధాన్యాన్ని చిన్నప్పటి నుంచే విదార్థులకు తెలియజేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి గురించి వివరించాలి.


ఏళ్లు.. జాప్యమైతే అభివృద్ధి ఆగదా!

ప్రభుత్వం గడువు లోపు పూర్తి చేయాల్సిన అనేక ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆలస్యమైనా పట్టించుకునే నాథుడే లేరు. దీంతో అభివృద్ధి నిలిచిపోతుంది. ః ఉదాహరణకు వరంగల్‌ మెగా జౌళిపార్కు నిర్మాణానికి 2017 అక్టోబరులో శంకుస్థాపన చేశారు. ఏడాదిలో పూర్తి చేయాలని గడువు విధించారు.  ఆరేళ్లయినా అనుకున్న స్థాయిలో సాకారం కాలేదు. ఇదొక్కటే కాదు.. కాళోజీ కళాక్షేత్రం పనులు మొదలుపెట్టి 8 ఏళ్లు గడచినా పూర్తి కాలేదు.  హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపం 18 ఏళ్ల కిందట  మొదలైనా ఇంకా పూర్తికాలేదు. దీంతో అంచనాలు రూ. కోట్లలో పెరిగిపోయి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు