logo

Dalit Bandhu: ‘పుస్తెల తాడు అమ్మి డబ్బులిచ్చినా.. అందని దళితబంధు!’

కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తున్న మాకు దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు వర్తింపజేయడానికి అధికార పార్టీ నాయకులు డబ్బులు అడిగారని.. దీంతో రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఇచ్చామని ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలకేంద్రానికి చెందిన 35 మంది దళిత మహిళలు తెలిపారు

Updated : 03 Oct 2023 08:11 IST

బంగారు పుస్తెలు అమ్మి పసుపు తాడు ధరించినట్లు చూపుతున్న మహిళ

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తున్న మాకు దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు వర్తింపజేయడానికి అధికార పార్టీ నాయకులు డబ్బులు అడిగారని.. దీంతో రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఇచ్చామని ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలకేంద్రానికి చెందిన 35 మంది దళిత మహిళలు తెలిపారు. వీరిలో ఒక మహిళ తాను పుస్తెలతాడు అమ్మి ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు.  చివరికి ఆ నాయకులు ముఖం చాటేశారని ఆరోపిస్తూ సోమవారం స్థానిక తాళ్లపహాడ్‌ జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు స్థానిక గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు స్వార్థపూరితంగా అధికార బలం చూపించుకుని అర్హులకు అన్యాయం చేశారన్నారు. ఇక్కడ నిలిపివేసినా.. ఎక్కడికైనా వెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దళిత బంధు రాకపోతే గృహలక్ష్మి వస్తుందని, అదికూడా రాకపోతే రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని నమ్మజెప్పి మోసం చేసిన నాయకులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన మాకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. సుమారు గంటపాటు నిరసనతో ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి రాకపోకలను పునరుద్ధరించారు. నిరసనలో వార్డు సభ్యులు బోడ తులసమ్మ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కాడపాక శ్యాం, గడ్డమీది రమ్య, అల్లంకొండ కుమార్‌, గడ్డం రమేష్‌, మొలంగూరి మహేందర్‌, అశోక్‌, రజిత, రాజు, జంపయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని