logo

పట్టణం పల్లెల సమ్మిళితం.. వర్ధన్నపేట

వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్‌ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది.

Published : 04 Nov 2023 05:39 IST

వర్ధన్నపేట, న్యూస్‌టుడే

ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం

వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్‌ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్‌, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్‌ మండలాల పరిధిలో ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో వర్ధన్నపేట పురపాలక సంఘంతోపాటు గ్రేటర్‌ వరంగల్‌లోని 41 గ్రామాలు విలీనం కాగా  11 డివిజన్లు ఉన్నాయి.

నియోజకవర్గం ముచ్చట

1952 నుంచి 2018 వరకు 15 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్‌ అభ్యర్థిగా 1952లో పోటీ చేసిన పెండ్యాల రాఘవరావు విజయం సాధించి తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. ఈ ఎన్నికల్లోనే ఆయన వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అనంతరం 1957 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌సీ, స్వతంత్రులు, జేఎన్‌పీ, ఐఎన్‌సీ, భాజపా, తెదేపా, కాంగ్రెస్‌, తెరాస అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మంత్రి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు.

2009లో జరిగిన పునర్విభజనలో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్‌ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరఫున బరిలో నిలిచిన అరూరి రమేశ్‌ గెలుపొందారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఇక్కడి వారే..

ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, బోయినపల్లి వినోద్‌కుమార్‌, పురుషోత్తమరావు స్వగ్రామం పర్వతగిరి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఐనవోలు మండలం పున్నేలు. వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్‌, టి.రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు, దుగ్యాల శ్రీనివాసరావు, నేతలు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఎర్రబెల్లి స్వర్ణ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మాజీ తితిదే బోర్డు సభ్యుడు ఈగ మల్లేశం తదితరులు కూడా నియోజకవర్గం వారే. వీరంతా వివిధ హోదాల్లో పని చేశారు.

పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు.

ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలం..

ఐనవోలులో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. పర్వతగిరి మండలం అన్నారంలో ఉన్న యాకూబ్‌ షావలి దర్గాలో ముస్లింలు, హిందువులు మొక్కులు చెల్లించుకుంటారు. ఐనవోలు మండలం రెడ్డి పాలెం చర్చి, భీమారం సమీపంలోని ఎర్రగట్టు వేంకటేశ్వర స్వామి, మడికొండలోని మెట్టుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.


యువగళం

భవిష్యత్తు నిర్ణయించేది ఓటే..

అంతర్జాతీయ అథ్లెట్‌ జీవంజి దీప్తి

న్యూస్‌టుడే, పర్వతగిరి: పల్లె కీర్తిని ప్రపంచ దేశాలకు చాటుతున్న అథ్లెట్‌(పరుగు పందెం) జీవంజి దీప్తి నేటి యువతకు స్ఫూర్తి. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె ఆటలో రాణించి  ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల చైనాలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన దీప్తి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని యువతకు సూచించారు.. 

మీకు ఓటు ఎక్కడ ఉంది, మొదటిసారి ఎక్కడ వేశారు
వర్ధన్నపేట నియోజకవర్గం కల్లెడ గ్రామంలో ఓటరుగా నమోదయ్యాను. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నా.

ఓటు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనుకుంటున్నారు
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. విధిగా సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తు నిర్ణయించేది కేవలం ఓటు మాత్రమే.

యువతకు ఎన్నికలపై మీరు ఇచ్చే సందేశం
నేను తొలిసారిగా ఓటు వినియోగించుకునే అవకాశం ఈ ఎన్నికల ద్వారా లభించింది. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నచ్చిన నాయకుడికి ఓటు వేయాలనేదే నా ఉద్దేశం. ఎవరో చెబితేనో.. ఏదో ఇస్తారనో భావించి ఓటును దుర్వినియోగం చేయొద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని