logo

చేతి సంచి, కట్టుబట్టలే ఆస్తిపాస్తులు !

తన జీవితాన్ని ప్రజా సేవకు, ప్రజా ఉద్యమాల కోసం అంకితం చేసి నిరాడంబర జీవితాన్ని గడిపిన ఏసిరెడ్డి నర్సింహారెడ్డి జీవితం నేటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు ఆదర్శం.

Updated : 07 Nov 2023 05:28 IST

మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి జీవితం

జనగామ, న్యూస్‌టుడే:  తన జీవితాన్ని ప్రజా సేవకు, ప్రజా ఉద్యమాల కోసం అంకితం చేసి నిరాడంబర జీవితాన్ని గడిపిన ఏసిరెడ్డి నర్సింహారెడ్డి జీవితం నేటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు ఆదర్శం. ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టు పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు చేపట్టినా.. నిజాయతీ, సామాన్య జీవితం, అసామాన్య వ్యక్తిత్వం ఏసిరెడ్డి సొంతం.

ఉన్నత వ్యక్తిత్వం

పూర్వ వరంగల్‌, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన ఏసిరెడ్డి రాజిరెడ్డి, రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు నర్సింహారెడ్డి ఆలేరు మండలం గుండ్లగూడెంలో మిడిల్‌స్కూల్‌ వరకు, జనగామలోని ప్రెస్టన్‌ మిషన్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ వరకు చదివారు. నైజాం పాలనలో, బాంచెన్‌ కాల్మొక్త అనే రోజులవి. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామి అయ్యారు. మరో జలియన్‌ వాలాబాగ్‌గా పిలిచే బైరాన్‌పల్లితో పాటు అనేక ఘటనల్లో పాల్గొన్నారు. 1947 నవంబరు 29న ఆలేరు, జనగామ శివారులోని పల్లెలైన సిద్దెంకి, పటేల్‌గూడెం, శారాజీపేట, టంగుటూరు గ్రామాల ప్రజలతో దండు కట్టి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలేరు రైల్వేగేటు సమీపంలో, వాగు వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ఆయన తొంటి నుంచి తూటా దూసుకుపోయింది. అప్పటికే ఆయనకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి నిరాకరించి, తనతో పెళ్లి నిశ్చయమైన యువతి జీవితానికి నష్టం వాటిల్లకుండా, మరొకరితో పెళ్లి జరిగేలా చొరవచూపడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం  బ్రహ్మచారిగానే తన జీవితాన్ని కొనసాగించారు.

గోదావరి జలాల తరలింపులో కీలకపాత్ర  

తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. జనగామ ప్రాంతానికి వరద కాల్వ ద్వారా గోదావరి జలాలను తరలించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిసిస్టు) సీపీఎం నాయకుడిగా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1967లో తొలిసారి జనగామ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి 3,782 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1972లో మూడో స్థానంలో, 1978 ఎన్నికల్లో 2,371 ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పొన్నాల లక్ష్మయ్యపై 22,217 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వరద కాల్వ పథకం ద్వారా జనగామకు గోదావరి జలాలు తరలించేలా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. కరవు కాటకాలు దూరం కావాలంటే, సాగునీటి పారుదలే ముఖ్యమని అసెంబ్లీలో తన వాణి వినిపించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఊరూరా చేతి పంపులు, దళితవాడల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించారు. జీవన్‌ధార బావులను తవ్వించారు.

సైకిల్‌పైనే ప్రయాణం

నర్సింహారెడ్డి ఎప్పుడూ సామాన్య ప్రజల మధ్యే ఉండేవారు. పార్టీ కార్యాలయంలో బస, పార్టీ కార్యకర్తలు, ప్రజల ఇళ్లలోనే భోజనం. జనగామ పాత తాలూకా పరిధిలో కాలినడకన లేదా సైకిల్‌పై, అప్పుడప్పుడు రిక్షాలో వెళ్లేవారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వం కల్పించిన జీపు సౌకర్యాన్ని సొంత అవసరాలకు వినియోగించకుండా, కేవలం నియోజకవర్గంలో కార్యక్రమాలకు మాత్రమే వాడేవారు. హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు ఎర్రబస్సులోనే ప్రయాణించేవారు. ఆయనకు వచ్చే వేతనాన్ని పార్టీకి అందజేసేవారు. ఆయన అవసరాల కోసం అందులో నుంచి రూ.1500 ఇస్తే, అందులోనూ కార్యకర్తల అవసరాలను గుర్తించి వారికి ఇచ్చేవారని ఆయన సహచరులు చెబుతుంటారు. 1991లో జులై 28న నర్సింహారెడ్డి గుండెపోటుతో మరణించే నాటికి ఆయన ఆస్తి.. చేతిసంచి, చేతి గడియారం, చెప్పుల జత, కట్టు బట్టలు మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని