logo

మది నిండా ప్రగతి ఆలోచనలే..!

ఆయన 99వ సంవత్సరంలోకి అడుగిడిన రాజకీయ కురువృద్ధుడు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న నేత.

Updated : 09 Nov 2023 05:56 IST

మానుకోట, కురవి, న్యూస్‌టుడే

ఆయన 99వ సంవత్సరంలోకి అడుగిడిన రాజకీయ కురువృద్ధుడు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న నేత. ఆయనే మహబూబాబాద్‌ జిల్లా సీరోలుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్సీ వెడవెల్లి వెంకటరెడ్డి. గాదె వెంకటరెడ్డిగా సుపరిచితులు..

నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కొన్నేళ్లు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. పలుమార్లు రజాకార్ల దాడుల నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం  గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. వెంకటరెడ్డిది నిరాడంబర జీవితం. హైదరాబాద్‌లో ఉండే కుమారులు తమ వద్ద ఉండాలని కోరినా సొంత గ్రామంలోనే నివసించడం ఆయనకు ఇష్టం.

ప్రముఖులకు ఎన్నికల ఏజెంటుగా..

1962లో ఎన్నికల ప్రచారానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వరంగల్‌కు వస్తే మామునూరు విమానాశ్రయంలో ఆయనను వెంకటరెడ్డి ఆహ్వానించారు. అప్పుడు వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. చెన్నారెడ్డి సనత్‌నగర్‌ ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు అలాగే రామచంద్రారెడ్డి డోర్నకల్‌ నుంచి పోటీ చేసినప్పుడు వారికి ఎన్నికల ఏజెంటుగా పనిచేశారు.

కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేసేవారు..

‘అప్పటి రాజకీయ విలువలు నేడు లేవు. ఎన్నికల సమయంలో డబ్బు వ్యయం చాలా తక్కువ, మద్యం ప్రభావం లేదు. పార్టీ కార్యకర్తలు ఎవరికి వారే సొంత డబ్బులే పెట్టుకుని పనిచేసేది. టిఫిన్‌కు ఖర్చు ఇచ్చినా తీసుకు¸నేవారు కాదు. ‘పైసలొద్దు.. మాకు  ఏమైనా పనిపడితే చేయండి’ అనేవారు.. అప్పటి మర్యాదలే వేరు. త్యాగబుద్ధి ఉండేది. ప్రజానాయకులకు నైతిక విలువలు, సేవా దృక్పథం అవసరం. వీటిని పాటించే నేతలకు తక్షణ గుర్తింపు రాకున్నా క్రమంగా సమాజంలో ఆదరణ పెరుగుతుంది.’ అని చెబుతున్నారు.

30వ తేదీన ఓటేస్తా..

వెంకటరెడ్డి 1952 నుంచి స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్‌సభ ఇలా ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటానని ఆయన ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.  

నిర్వ హించిన పదవులు

1950-52లో మహబూబాబాద్‌ తాలూకా కాంగ్రెస్‌ కార్యదర్శి. 1953లో తాలూకా సివిల్‌ సప్లయి శాఖ సభ్యుడు. 1962 నుంచి 1968 వరకు వరంగల్‌  జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. 1964లో సీరోలు సర్పంచిగా ఏకగ్రీవ ఎన్నిక. 1970 నుంచి 1978 వరకు మహబూబాబాద్‌ వ్యవసాయ సహకార అభివృద్ధి బ్యాంకు కమిటీ సభ్యుడు. 1974 నుంచి 80 వరకు వరంగల్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు.

నేటికీ తన ఊరు అభివృద్ధి పైనే ధ్యాస

ఈ వృద్ధాప్యంలోనూ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న తన సొంత గ్రామం సీరోలు అభివృద్ధే ఆయన నిత్య ఆలోచనగా ఉంటుంది. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా శ్రద్ధ చూపుతారు. తన ఇంటికి వచ్చే ప్రజలు, నేతలు, అభిమానులతో గ్రామంలో ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో చర్చిస్తారు. ప్రభుత్వ అధికారులకు ఎప్పటికప్పుడూ సమస్యలు తెలియజేస్తారు.  ఆయన కృషి వల్ల ఏకలవ్య పాఠశాల ఏర్పాటైంది. సీరోలు మండల కేంద్రం కావాలని ఆయన బాగా కోరుకునేవారు. తాజాగా నెరవేరడంతో చాలా ఆనందంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని